Tuesday 10 May 2016

@@@@@. ఫేస్బుక్ వ్రత కల్పము @@@@@

@@@@@@@@@@ ఫేస్ బుక్ వ్రత కల్పము  @@@@@@@@@

                                                                  --------04/02/2014
                                                                   By N. Usha Rani .


ఫిబ్రవరి 6 న రధసప్తమి ..ఈ పుణ్య దినమున వివాహితలైన స్త్రీలువివాహానికి సిద్ధముగా వున్న కన్యలూ ..వివిధరకాలయిన నోములూ,
వ్రతాలూ మొదలు పెడతారు. అవి ఏమిటో ,ఎన్ని రకాలో ..రధ సప్తమి
రోజున చెప్పుకుందాము. ఇప్పటి అమ్మాయిలకి అవన్నీ తెలుసుకొని చేసే వోపికా , తీరికా రెండూ లేవు . అందుకు అట్టి కన్యామణులే కాక సమస్త
మానవకోటికి హితమైన "వ్రత కథ" నొకదాని గూర్చి చెప్పదల౦చితిని
..ఇది నచ్చి ,మెచ్చినవారు (ఆల్రెడీ వ్రతమారభించి యున్ననూ ) ఇంకా దీక్షగా చేయుచు, క్రోత్తవారి చేత మొదలెట్టించి ..దివ్య సుఖముల బడయవచ్చు ..

              ఒక రోజున పార్వతీ దేవి కైలాసమున మిక్కిలి ఒంటరిదై,
చింతించుచుయున్నది..కారణమేమన  పతీ, సుతులు వారి వారి
పనులతో బిజీగా యుండిరి. పరమేశ్వరుడు తన ప్రమధగణాల మధ్య వచ్చిన తగాదాలను, గిల్లి కజ్జా లను  తీర్చుట లోనూ, గణేశుడు,సుభ్రమణ్యుడు తండ్రికి తోడ్పాటగానూయుండిరి..పార్వతీ దేవికి ఏమీతోచడం లేదు..ఈ మధ్య పరమేశ్వరుడు ఈ పనులతోనే తీరికలేకుండా
ఉండుట చేత..అమ్మకు చాలా వంటరితనము ,విసుగు కలుగు
చున్నవి..పతి చెంతనుండిన ముల్లోకాల విశేషాలనూ,  చిత్ర విచిత్రాలానూ
చెపుతూ ఆమెను మిక్కిలి సంతోష పరచేవాడు..ఈ మధ్య అది కుదరక
..అమ్మవారికి చిరాకు పుట్టిస్తూ వున్నది..అర్జంటుగా తనవద్దకు
రావలసినదని అప్పటికే 100 మార్లు టెలీపతీ ద్వారా స్వామికి
కబురంపింది.. రాకపోయేసరికి నందిని పంపింది..ఆయన రాకపోతే"పుట్టింటికి " వెళ్లి పోతానని బెదిరింపు కూడా అయ్యాక..ఇహ తప్పక
పరమేశ్వరుడు , పార్వతి చెంతకు అరుదెంచే.."పనులవత్తిడి మిక్కిలి గాయున్నది పార్వతీ..ఇంత అర్జంటుగా పిలువనంపిన కారణమేది " యని
అడుగ ..పార్వతి " మీరు ఈ మధ్య ఇదే కారణాన్ని చెప్తూ వస్తున్నారు.
నాయందు తమకి అనురక్తి తగ్గినదా..నన్ను బొత్తిగా నిర్లక్ష్యమచేయుచున్నారు .? నాకు వంటరి తనము తో విసుగు వచ్చు చున్నది.

      ముక్కంటి ,జగదీశ్వరుని ఇల్లాలనైన నా పరిస్థితే ఇలావుంటే ..ఇక
భూలోకమున ఇల్లాండ్ర పరిస్థితి ఎటులుండు " నని మిక్కిలి
వగచగా...పరమేశ్వరుడు ఫెళ్ళున నవ్వి " ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు దేవీ ! వారంతా ఒకరి మొహం మరొకరు చూడకుండా ఎన్ని
రోజులైననూ గడపగలిగిన౦త తీరిక లేకుండా వున్నారు. మానవులకు 24
గంటలు సరిపోవడం లేదు. 10 సం.వారినుండి 100 సం.వారి వరకునిత్యమూ ఒకే దీక్షలో యున్నారు.వారికి మన దేవతల పూజలూ, వ్రతాలూ చేసే తీరిక లేదు. ఒకే స్మరణ ..ఒకే అనుష్ఠానము .." యని తెలుప ..పార్వతి " అదేటుల స్వామీ..అదేమీ అనుష్ఠానము , ఏమా కథ "యని కుతూహలమున యడుగగా..పరమేశ్వరుడిట్లు చెప్పదొడిగె .

   "వినుడు దేవీ.. పూర్వము ద్వాపరయుగము వరకు మన దేవతలు,ఋషులు ,మునులు, కొందరు మానవోత్తములును  టెలీపతీ ద్వారా ముల్లోకముల యందు జరుగు విశేషములను
,తెలుసుకొంచు..అవసరమైన వారి తో  సంభాషించుకునే
వారము.తరువాత రాను రాను  మానవులకు ఆ శక్తి సన్నగిల్లినది.. కానీ
మానవుడు తన తెలివి తేటలతో ..వార్తా పత్రికలద్వారా, టెలీ ఫోన్, రేడియో

,దూర దర్శిని లను కనుగొని ప్రపంచ వార్తలను, ఎక్కడ ఏమి జరిగినాతెలుసుకొనుచున్నాడు.. ఇంకా అభివృద్ధి సాధించి ..సెల్ ఫోను ద్వారాప్రపంచములో ఎక్కడి వారితో అయినా సంభాషిస్తున్నాడు..మరికొంత

ముందడుగు వైచి 'కంప్యూటర్ 'సాధనం కనిపెట్టి, దానిని ఇంటర్నెట్ తో
అనుసంధానించి ఎక్కడ ఏమిజరిగినా ఇంటిలో కూర్చుని  వీక్షించే అవకాశము పొందాడు..అందులో మరీ అభివృద్ధి సాధించి ఇప్పుడు అత చిన్న సాధనముల ద్వారాకూడా ఇవన్నీ చూడగల, ప్రపంచంతఅనుసందానమొ౦దు నటుల అభివృద్ధి సాధించెను.
 

                ఇంతలో జుకర్ బర్గ్ అను అమెరికన్ మానవుడు 2004 న.,ఫిబ్రవరి 4 న " ఫేస్ బుక్ " అను సాధనాన్ని ఆవిష్కరణ గావించాడు.

ఇతడు టేలీపతికి మారుగా యన్నట్లు..తన మిత్రులకు ప్రతి క్షణము ఎక్కడ ఏమి చేయుచున్నారో, తమ మానసంబందు ఎట్టి
యాలోచనలున్నవో,కూర్చున్న,నిలుచున్నా,త్రాగుచున్న ,...ఆఖరుకు
ఊపిరి తీసుకున్న వివరములను సైతము ప్రపంచ మున  ఏమూలనున్వారికైనా తెలిపే సాధనమే ఈ " ఫేస్ బుక్ " ..అంతే గాక తాము విన్నవీ
,చూసినవీ,నచ్చినవీ , నచ్చనివీ ప్రతిదీ చిత్రముల ద్వారా.., చలన
(వీడియో ) చిత్రముల ద్వారా అందరికీ తెలుపవచ్చు . అచిరకాలముననే
ఇది మిక్కిలి అబివృద్ధి నొంది , కొన్ని కోట్ల మంది ఇందులో దీక్షను
పూనారు ..ఇక మానవుల యానంద మేమి చెప్పుదు దేవీ ..ఆనదముతో
తలమునకలై పోయి యున్నారు ".

            " ఫేస్ బుక్ " అను మాట ఇప్పుడే వినుచున్నాను స్వామీ
..అది యేటుల ఆనందము కలిగించును ,ఆ దీక్ష ఎటుల స్వీక౦రిచవలె
..సవివరముగా తెలియజేయండి స్వామీ " యని పార్వతి
అడుగగా..పరమేశ్వరుడిట్లు చెప్పదొడిగె .." పార్వతీ ..ఆ మానవుడు 'జుకర్ బర్గ్ '  కనిపెట్టిన సాధనమైన ఈ ఫేస్ బుక్ ..ఏక కాలంలో కొన్ని లక్షలమందిని అనుసంధానిస్తూ ,'స్టేటస్ అప్డేట్స్ ',నచ్చిన 'వీడియోలూ'
చిత్రాలూ ఒకరినుండి మరొకరికి 'షేర్ ' చేసుకోనుచూ, 100 షేర్ లూ 200లైకులూ, కలిగి అందరికీ  మనోల్లాసములను కలిగించుచూ ఆనందపరచు చుండే..దీని ద్వారా మానవులు స్త్రీ, పురుష భేదము లేక  బృందాలుగా ,గ్రూపులుగా ఏర్పడి ,స్నేహబందాలను ఏర్పరచుకొంటూ ,'అప్డేట్స్ '
చేసుకొంటూ ,పగలూ రాత్రి భేదములేకుండా,ఆకలి బాధ లేదు, నిత్య సంతోషులై ..అదో ప్రపంచమందు విహరిన్చుచున్నారు ..!" యని తెలుప పార్వతి "అటులనా ప్రభూ ..! నాకు ఈ వ్రత విధానమును వివరముగా
తెలుసుకొనవలెనని మిక్కిలి ఆశ గాయున్నదితెలుపుడ"నిన..పరమేశ్వరుడు " ఈ వ్రతమును ఎవరైననూ ,జాతి,కుల
,మత భేదము లేక ప్రపంచము లోని అన్ని జాతులవారైన మానవులు ఆచరించ వచ్చు . విధి ,నియము, కట్టుబాట్లు ,మడి
,ఆచారము,నైవేద్యము,ఉద్యాపన,వాయన నియమములు ఏమియును లేవు..ఎవరికీ నచ్చినట్లు వారు చేయవచ్చును.మనసున ఇచ్చ కలిగిన మరుక్షణమే వ్రత మారంభింప వచ్చును .మన పూజలలో లాగా పూజా
మందిరం, తూర్పు దిక్కు , మంచి దినము ..ఇటువంటి నియమాలు
లేవు..కానీ  సంకల్పం చెప్పుకోవాలె.అదియునూ గోత్రనామాలు గాక,
పేరు,పుట్టిన దినము వంటి వివరాలు ఒక్కసారి పొందుపరచి.."అక్కౌంటు
"రూపొందించిన చాలు. ప్రతిదినమూ చెప్పవలసిన పనిలేదు.ఒకసారి వ్రత
దీక్ష బూనిన ,ఇహ ఉద్యాపన,వ్రత విరమణ చేయనక్ఖర  లేదు.మృష్టాన్నములు, పిండి వంటలూ,పండ్లూ నైవేద్యములూ ఏమీ వుండవు.అందుకే మ్లేచ్చుల నుండి అన్ని జాతుల వారూ ఈ వ్రత దీక్ష సల్పు చున్నారు . ఈ ఫేస్ బుక్ మాయా దీక్షలో పడి  , మనకి పూజలు చేయడం కూడా మరిచి పోతున్నారు దేవీ,.. " అని తెలిపి  పరమేశ్వరుడుఇప్పుడే వచ్చేద నని మరల జనియె..

        "ఔరా !! ఈ మానవులెంత తెలివైన వారు ..? " అని ఆశ్చర్య
పోయి ,పార్వతి తన స్నేహితురాల్లయిన లక్ష్మీ ,సారస్వతులకు ఈ కథ
నంతయు జెప్పి ,తమ భర్తల బిజీ షెడ్యూల్ వల్ల తామెంత
వంటరితనమును అనుభవించు చున్నారో యని దలచి, ప్రమధగాణాలలో
తమకు నమ్మకస్తుడైన ఒకనిని  భూలోకమునకంపి  3 లాప్ టాప్
లు,ఐఫోన్ లు, ఐపాడ్ లూ తెప్పించుకొని ,ఫేస్ బుక్ వ్రత దీక్షబూని..వారిలో వారే స్టేటస్ అప్డేట్స్ ,షేర్ లు, లైకులతో ఆనందంగా వుండిరి.
తమ పతుల  రాకపోకలను , ఉనికిని కూడా మరువగా ..ఇదంతా తన
మనోనేత్రము ద్వారా తెలుసుకొన్న విష్ణుమూర్తి ..శివుని తొందరపాటుకు చింతించే. దీనికి విరుగుడు ఏమా యని ఆలోచనలో పడిన వాడాయే ..

              ఇప్పటికీ విష్ణుమూర్తి విరుగుడు కనుగొన లేకపోయినా ఈ వ్రత విధానమును సూతుడు ,శౌనకాది ముని శ్రేష్టులకు ,వారినుండి
ముని పత్నులకు  , వారినుండి సకల జనులకు తెలియగా ..భరత
ఖండమున , ఆంద్ర ప్రదేశ్ అను రాష్ట్రమున ,కృష్ణా గోదావరుల మధ్యప్రదేశమైన హైదరాబాద్ అను పట్టణమున స్వగృహమున నివసించు ఉషారాణి నూతులపాటి యను నొక వనితామణి ఈ కథను మీ
కందరకును తెలియజేసినది.

                ఈ కథ విన్నవారికి ,చదివినవారికి, షేర్ చేసినవారికి మరు జన్మలోకూడా ఫేస్ బుక్ ను సేవించే మహద్భాగ్యం కలుగును. మరియు లైక్ చేసి , కామెంట్ చేసినవారు కూడా ఈ జన్మలోనే సర్వ సుఖములనూ బడియుదురు..అందరికీ కూడా ఎంతో పున్య కీర్తులు దక్కి ,స్నేహ పరంపర ,తామర తంపరగా వృద్ధి నొంది  ,జీవితాంతమూ ఈ 'fb' సుడి గుండములోనే  ..సుళ్ళు తిరుగుతూ , ఊపిరి పీల్చుకొను సమయము కూడా లేకుండా 'గిలగిలా' కొట్టుకుందురని కూడా సూతుడు శౌనకాది మునులకు ,వారి నుండి వారి పత్నులకు..వారినుండి.....తెలిసినది

       ********* శుభం భూయాత్ *********

ముఖ్య గమనిక :- ఈ కథపై పూర్తి హక్కులు నావే..దీనిని ప్రచురించదలచిన పత్రికలూ , ఒకవేళ సినిమా తీయాలనుకున్న నిర్మాతలు నన్నే సంప్రదించ వలెను.పూర్తి హక్కులు నావే..మొదట వచ్చిన వారికి పారితోషకము లో డిస్కౌంట్ ఇవ్వ బడును.

సూచన : { ఇది కేవలం నవ్వుకోవదానికే నని.మన పురాణాలూ ,వ్రతాలూ ,పూజలూ అనిన మిక్కిలి గౌరవము ,అభిమానమూ వున్న శుద్ధ శ్రోత్రీయ వంశజను అని మనవి ..} :)

2 comments:

  1. :) ఇంతకీ ఇది ఫేస్ బుక్ లో షేర్ చేసారా ?

    ReplyDelete
  2. హహహ...చేసాను వనజ గారూ ..:P

    ReplyDelete