Tuesday 10 May 2016

💦💦💦💦 చెలిమ నీరు -3 💦💦💦💦💦

💦💦💦💦చెలిమ నీరు -3 💦💦💦💦

        అమ్మమ్మ వాళ్ళ వూర్లో  కాలక్షేపం కూడా పెద్ద సమస్యే ! పిల్లలమైనా మాకు తోచేది కాదు . ఇల్లుదాటి బయటికి వెళ్లనిచ్చేది కాదు అమ్మమ్మ . పాత వూరు పాలేరు వరదల్లో మునిగిపోతే , కాస్త దూరంగా ఈ వూరు నిర్మించుకున్నారు . విశాలమైన నాలుగు వీధులు , దూరం , దూరంగా ఇళ్ళు. మా ఈడు పిల్లలు కనిపించే వారే కాదు . పెద్ద పాటక్ ( గేటు ) ఎప్పుడు వేసి వుండేది . ఇంటిముందు పెద్ద ఖాళీ స్థలం . ఇంటివెనక  పెద్ద చెట్లు ఉన్న దొడ్డి .., ప్రక్కనే పశువుల కొట్టం , వెనుక గడ్డి దొడ్డి (ఎండు గడ్డి ) ఉండేవి . ఊరంతా నిశ్శబ్దంగా ఉండేది అదేమిటో .బిచ్చగాళ్ళు కూడా వుండే వారు కాదు ఆ వూర్లో .

         మాది చిన్న పల్లె అయినా .. సందడిగా ఉండేది . గుడి , పక్కనే బడి . గుడి
వెనుక పెద్ద రావి చెట్టు , బోలెడు నీడ . పిల్లలందరం గుడి చుట్టూ పరుగులు పెడుతూ ఎన్ని ఆటలో . మా ఈడు పిల్లలు ఎందరు వుండేవారో .. బొమ్మరిళ్ళు కట్టడం , గృహ ప్రవేశాలు , బాదం
ఆకుల్లో భోయనాలు , బొమ్మల పెళ్ళిళ్ళు , ఆ బొమ్మల్ని బుజ్జి మేనా లో లేదా , తాటి ముంజ కాయల చక్రాలతో చేసిన బండి ని  రంగు కాయితాలతో అలంకరించి పల్లకీ  చేసి , గుడిలో దండం పెట్టించే వాళ్ళం . దూదేకుల
, ముతరాస , చాకలి , బ్రాహ్మణ , రెడ్డి అందరి పిల్లలు కలిసి మెలిసి ఆడుకునే వాళ్ళం .  మా ఇంట్లో నే పంచాయితీ ఆఫీసు . ఒక గదిలో రెండు పెద్ద ఇనుప బీరువాల నిండా పుస్తకాలు . ఏవో కవితలు , పిల్లలకథల పుస్తకాలు వుండేవి .. మంచి రచనలు, పేరున్న
రచయితల పుస్తకాలు  కాకపోయినా .. ఏదో కాలక్షేపానికి బాగానే ఉండేవి .  అమ్మ బోలెడు పత్రికలూ , చందమామ , బాలమిత్రతెప్పించేది . పత్రికలలో కార్టూన్స్ చదువుకునే వాళ్ళం .మా   బంధువులు  కూడా చాలా మంది ఉండే వారు .  మాకు సెలవుల్లో కూడా రోజు సరిపోనంత బిజీగా , పరుగులు ,
ఆటలూ ఉండేవి .


               అమ్మమ్మ వాళ్ళ యిల్లు , ఆ వూరి పూజారి గారి యిల్లు అంతే తెలుసు మాకు . అది కూడా , అమ్మమ్మ ఇంట్లో భావి ఎండి
పోతే .. వాళ్ళింటి నుండి నీళ్ళ మోత వుండేది కాబట్టి .  ఎంత బోర్ కొట్టేదో అక్కడ .
వెళ్ళిన రెండు రోజులకే , ఎప్పుడు వెళ్లిపోతామా అని ఎదురు చూపులు మొదలయ్యేవి .  అమ్మా వాళ్ళు యాత్రలు ముగిసి వచ్చినా , వెంటనే బండి పంపేవారు కాదు మా కోసం . ఆరోజుల్లో ఎద్దుల బండి
ప్రయాణమే ! జీతగాళ్ళు తీరికగా ఉండి , ఎద్దులు , బండి ఖాళీ అయ్యేవరకు మాకు ఈ అజ్ఞాత వాసమే !

(సశేషం )

No comments:

Post a Comment