Tuesday 10 May 2016

💦💦💦💦 చెలిమ నీరు - 4 💦💦💦💦

💦💦💦💦చెలిమ నీరు -4 💦💦💦💦

          ఇక ఆఖరుదైన నీటి సమస్య . మా వూళ్ళో నీటి సమస్య మాకు తెలియదు . వూరు చుట్టూ చిన్న చిన్న నీటి కయ్యలు  ,  కుంటలూ, చెరువు వుండడం వల్లనేమో . అది ఇప్పుడు తెలిసింది . మా ఇంట్లో భావి ఎప్పుడూ ఎండిపోలేదు  .  మంచినీళ్ళ కోసం కొంతమంది వచ్చేవాళ్ళు కూడా మా ఇంటికి .  ఇక నీళ్ళు తోడడం కూడా తెలియదు . ఎప్పుడైనా సరదాకి చేసినా అమ్మకి భయం .. భావి దగ్గరికి వెళ్ళవద్దు అనేది . అమ్మ వేసిన పెరటి తోటలో సరదాగా నీళ్ళు పోసేవాళ్ళం . అంతే .
 
            అమ్మమ్మ వాళ్ళ వూరిలో నీటి ఎద్దడి బాగా ఉండేది . చుట్టూ ప్రక్కల చెరువులు , కుంటలూ లేనందువల్ల నెమో .. వర్షాభావ పరిస్థితులు కూడా అయివుండా వచ్చు . అమ్మమ్మ వాళ్ళ ఇంటి దక్షిణం వైపు , ప్రహరీ గోడనానుకుని .. పెద్ద భావి ఉండేది . అది ఊరుమ్మడి భావి . పెద్దగా , నాలుగువైపులా
నీళ్ళు తోడుకునేందుకు ఇనుప కమ్మీలు , గిలకలు , భావి చుట్టూ  సిమెంటు గచ్చు , మురుగు నీరు నిలవకుండా కాలువ .. ఇన్నివున్నా .. భావిలో నీళ్ళు సున్నా . అమ్మమ్మ వాళ్ళ భావి లో కూడా ఆ సంవత్సరం నీళ్ళు అడుగంటి పోయాయి . గుడి పూజారి గారి ఇంట్లో భావిలో కాస్త ఉండేవి . ఉదయం వాళ్ళ అవసరాలకి తోడుకున్న తరువాత , మళ్ళీ నీళ్ళు వూరిన తరువాత , తొమ్మిది గంటల ప్రాంతంలో మేము చిన్న , చిన్న తప్పాళ్ళు, చిన్న బిందె , చెంబు లతో  నీళ్ళు మోసేవాళ్ళం . ఇవి వంటకీ , వంటింటి అవసరాలకోసం . మా పిన్ని సావిత్రి రెండు బిందెలు తడి బట్టలతో అమ్మమ్మకి మడిగా తెచ్చేది . అమ్మమ్మ మంచినీళ్ళ కోసం , చిన్న కుండ ,చిన్న వంటగదిలో విడిగా ఉండేది . మేం ముట్టుకోకూడదు . " ఎంగిలి మంగళం " చేస్తారు ఈ పిల్లలు అని విసుక్కునేది మమ్మల్ని .  మా కోసం మరో పెద్ద 'రంజన్' ఉండేది . అది హాలు ప్రక్కన ఉన్న వేరే గదిలో . దానిచుట్టు ఇసుక పోసి , అందులో అల్లం కణుపులు గుచ్చేది మా పిన్ని . అవి మొలకెత్తి , ఆకుపచ్చగా , అల్లం వాసన వస్తూ ఉండేది .  ఆ కుండలో నీళ్ళు రంధ్రాల లోనుండి కొద్దిగా వస్తాయి . అందువల్ల నీళ్ళు బాగా చల్లగా ఉంటాయి . ఆనీటి తడి ఇసుక పీలుస్తుంది . అల్లం తాజాగా , మూడు నాలుగు నెలలు చెడిపోకుండా ఉంటుందిట
. ఎంత మంచి మల్టీ పర్పస్ ప్లాన్ కదా !

               అయ్యగారి (పూజారి ) ఇంటి
నుండి నీళ్ళు మొయ్యడం సరదాగానే ఉండేది . వాళ్ళ ఇల్లు మరీ దగ్గరేమీ కాదు , అయినా విశాలమైన మట్టి రోడ్లు , కాస్త టైం
పాస్ , నీటితో ఆట . రెండు మూడు సార్లు
తిరిగి నీళ్ళు మోసినా , కష్టం అనిపించేది కాదు . కానీ అవి త్రాగడానికి ఉప్పగా ఉండేవి
. వూర్లో ఎక్కడా మంచినీళ్ళు లేవు(ట).

              మా స్నానాలకీ, ఇతర అవసరాలకీ  గంగాళాలు , బక్కెట్లు , తొట్టినిండా నింపేవాడు చాకలి భిక్షం . ఇంట్లోకి అవసరాలకి మేము తెచ్చేవాళ్ళం . మా పిన్ని 'చెలిమనీరు' తెచ్చుకుందాం అనేది . మాకు అదేమిటో తెలియదు .. సరదాగా పొలాలు చూస్తూ నడుస్తూ , వెళ్ళడమే కదా ..  నీళ్ళు తియ్యగా , కొబ్బరి నీళ్ళ లాగా ఉంటాయి అని చెప్పేది . అదేమిటో చూడాలని కుతూహలం . పైగా నీళ్ళు తేని వాళ్లకి ఉప్పు నీళ్ళే అని బెదిరించేది కూడా . తోవ పొడుగునా తెనాలి రామ లింగడి కథలూ చెప్తానని ఊరించేది..  ఇన్ని తాయిలాలు . అందరం ఉత్సాహంగా సరే ..సరే అనేశాం .

            మా అమ్మమ్మ నన్ను వద్దు అనేసింది . " ఎందుకు వద్దూ.. అదేమన్నా మహా రాణా
..? మంచినీళ్ళు తాగదా ..రానీ . దాని నీళ్ళు అదే తెచ్చుకోవాలి .."  అంది మా పిన్ని .  ఇక మా అమ్మమ్మ  సణుగుడు మొదలైంది ..
" అవేం గౌన్లు ..? చేతుల్లెకుండా .. ఎదిగే పిల్లలకి అంత పొట్టి గౌన్లు తెస్తారా ? తాటి చెట్ల లాగా ఎదుగుతుంటే , కాళ్ళు కనిపిస్తూ .. మీ నాన్న తేవడం సరే .. మీ అమ్మ వెయ్యడం సరే ..మీ నాన్న సంపాదనంతా మీ బట్టలకే సరిపోతుంది .. మీ అమ్మకి బుద్ధి ఉండద్దూ .. బీరువా నిండా అన్నేసి చీరలు ఉన్నాయి . ఏం
చేసుకుంటుందీ ? నీకు లంగా జాకెట్లు కుట్టించ వచ్చుగా ? వాణెమ్మ ( ఆఖరు పిన్ని .. మెంటల్లీ డిజేబుల్డ్ .. బలహీనంగా , పీలగా ఉండేది ) కన్నా రెండేళ్ళు చిన్నదానివి . దానికంటే పొడుగున్నావ్..(అది నా తప్పా ?) బయటికి వెళ్తే అందరికళ్ళు నీ మీదే .  అసలే
మంచి వూరు కాదు . మీ వూళ్ళో ఏమైనా ఏడవండి ,మా వూరికి వచ్చేటప్పుడు లంగా
జాకేట్లే తెచ్చుకో . గౌన్లు వద్దు .." అంటూ తిట్టి
పోసింది .  మా పిన్నీ , పెద్ద మామయ్యా "చిన్న పిల్ల దానికేం తెలుసు పాపం .. దాన్ని
తిడతావు .." అన్నా ఆగకుండా .  నేను భయంగా " ఒక లంగా జాకెట్ తెచ్చుకున్నా
అమ్మమ్మా .." అనగానే " ఉద్దరించావ్ . వేసుకో మరి .." అని నేను కూడా ,
చెలిమకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది . అదీ లంగా , జాకెట్ తో .. మా తమ్ముడు చిన్నవాడు .. అయినా వాణ్ని కూడా వదలలేదు మా పిన్ని . ఒక మర చెంబు  ఇచ్చింది వాడికి . నాకు చిన్న ఇత్తడి బిందె , తను పెద్ద బిందె , మా చిన్నన్నయ్యకు , చిన్న మామయ్యలకు కూడా చెరో స్టీల్ కాన్ . అందరం పోలో మని బయలు దేరాం .

                   ఎక్స్కర్షన్ కి వెళ్ళినంత థ్రిల్ తో .  కానీ షార్ట్ కట్ రూట్ అని ఏనెల్లో ( చిన్న రాళ్ళ గుట్టలు ) నుండి మా ప్రయాణం . ఒక చేత్తో బిందె , మరోచేత్తో లంగా అడ్డం పడకుండా ఎత్తి పట్టుకుని , హవాయి స్లిప్పర్లు రాళ్ళమీద జారకుండా బాలెన్సు చేసుకుంటూ , గెంతుతూ ..రెండు కిలో మీటర్లు నడిచి కాలవ గట్టుకి చేరాం . అది పంట పొలాలకి నీళ్ళిచ్చే కాలువ . కాలువ కింద నేల తడిగా , నీటి వూటతో లూజుగా ఉంది . కొద్దిగా వెతికి శుభ్రంగా ఉన్న చోట , తనతో తెచ్చిన అంచులేని ఇత్తడి గిన్నెతో తవ్వి , గుంత చేసింది మా పిన్ని . కొద్దిగా తవ్వగానే సన్న నీటి ఊట .. ఇంకాస్త లోతుగా తవ్వి , మొదట వూరిన నీళ్లన్నీ ఎత్తి పారబోసింది మా పిన్ని .  మరో అరగంట వెయిట్ చేసాక , గుంట నిండింది .. ఈసారి నీళ్ళు స్వచ్చంగా ఉన్నాయి . తనతో తెచ్చిన తెల్లటి బట్ట , మూడు మడతలు వేసి  బిందేలన్నీ మెల్లగా తనే నింపింది . మమ్మల్ని అస్సలు ముట్టుకోనివ్వకుండా .. మురికి అవుతాయని ..మాకు దోసిళ్ళలో పోసి రుచి చూపించింది కూడా .. తియ్యగా ఉన్నాయి నీళ్ళు . ఇదంతా రెండుగంటలు పట్టింది . తిరిగి ఇంటికి బయలుదేరాం . నేను బిందె తలమీద , భుజమ్మీద మోయలేక పోయా . నడుము మీద పెట్టుకున్నా . లంగా ఎత్తి పట్టుకోవాలి . తడి చెప్పులకి మట్టి అంటి , జారుతున్నాయి . పైగా బిందెలో నీళ్ళు ఒలికి , డ్రెస్ తడిసిపోతోంది ..నడవడం కష్టంగా ఉంది . ఎండ మండిపోతోంది .. రాళ్ళ గుట్టమీద
జారి బోర్లా పడిపోయా .. రెండు మోకాళ్ళ
చిప్పలు పగిలి రక్తం .. మా పిన్ని నాకు తగిలిన  దెబ్బ కన్నా , బిందె సొట్ట పడిపోయిందని బాధ . అమ్మమ్మ తో తిట్ల భయం . ఇంతలో మా తమ్ముడు చెప్పులు మర్చిపోయాడు చెలిమ దగ్గిర . తనబిందే రాళ్ళమీద పెట్టి , మా అన్నయ్యవాల్లని కాపలా పెట్టి , నేనూ , పిన్ని , తమ్ముడు వెనక్కు వెళ్ళాము చెలిమ
దగ్గరికి . అక్కడ చెప్పులు లేవు .. మళ్ళీ నా
బిందె నింపుదామంటే , నీళ్లన్నీ మురికి అయిపోయాయి . మేకలు నీళ్ళు తాగుతున్నాయి కూడా . మళ్ళీ ఇంకో చెలిమ తవ్వాలి . ఇక లాభం లేదని వెనక్కు వచ్చేసాం . నేను కుంటుతూ ఎలాగో ఇల్లు చేరా . మా అమ్మమ్మ ఒకటే కంగారు . ఇంతసేపు అయిందే మని . మా పిన్ని జరిగిందంతా చెప్పింది . నా దెబ్బలకి పసుపు పెట్టి , చూసుకొని నడవాలని
దేప్పింది .  చెలిమ నీటి సరదా అలా తీరింది . మర్నాడు పెద్ద మామయ్య  ఎవ్వరూ మంచినీళ్ళు తేవద్దు . బిక్షం సైకిల్ మీద తెస్తాడు అని చెప్పేసాడు . అటు తరువాత మరో రెండు సార్లు చెలిమ కి వెళ్ళినట్లు గుర్తు .. గౌను తోనే ..

        కాస్త  పెద్ద అయ్యాక అమ్మమ్మా వాళ్ళ వూరు వెళ్ళడం తగ్గింది . సావిత్రి పిన్ని పెళ్ళవడం , పెద్ద మామయ్య కి జాబ్ రావడం , చిన్న మామయ్య ఖమ్మం లో చదువు .. అమ్మమ్మే కోదాడ వచ్చేది . డాక్టర్ కి
చూపించుకోవాలని . రెండు బస్సులు మారి రావాల్సి వచ్చేది డైరెక్ట్  బస్సు లేక . బస్టాండు నుండి నడిచి వచ్చేది . రిక్షా ఎక్కోచ్చుగా అంటే .. 'రూపాయి దండగ . ఎందుకె ' అనేది . " నాకోసం ఏమి తెచ్చావు అమ్మమ్మా .." అంటే  " ఖాళీ చేతులు , చెప్పుల్లో కాళ్ళు " అనేది .. " ఏమి వంట చేసావ్" అంటే .. " గుండ్ల కూర , బెండ్ల పచ్చడి .. ఏదో ఒకటి అన్నీ తినేవే . తినడానికి అంటూ ఒకటి దొరకడమే ఎక్కువ .." అనేది . అన్నం మెతుకులు కింద పడకూడదు , "మెతుకు పోతే , బతుకు పోతుంది " అనేది .. ఇప్పటికీ నాకు అన్నం కింద పడితే ఎత్తి , కళ్ళకు అద్దుకోని ప్లేట్ లో వేసుకుంటాను అమ్మమ్మ మాట గుర్తుకు వచ్చి .
 కాలేజీకి వచ్చాక , లంగా వోణీ వేసుకుని " ఇప్పుడు బావున్నానా అమ్మమ్మా ..?" అని కొంటెగా అడిగితే ... " బాగానే ఉన్నావులే . రేపు నిన్ను చేసుకునే వాడి సంపాదనంతా నీ బట్టలకీ , చెప్పులకే చాలదు .." అని కొంగు అడ్డం పెట్టుకుని నవ్వేసేది అమ్మమ్మ . డిగ్రీ లో ఉన్నప్పుడే అమ్మమ్మ దైవ సాన్నిధ్యం పొందింది .. తను నేర్పిన జీవిత విలువలు అన్యాపదేశంగా మా మీద ప్రభావం చూపిస్తూ ..మమ్మల్ని మనుషులుగా నిలబెట్టాయి..🙏🏼🙏🏼

     ----సమాప్తం 🙏🏼
చదివి ఆదరించిన మితృలందరికీ  శతకోటి ధన్యవాదాలు ..💐🙏🏼💐

No comments:

Post a Comment