Tuesday 9 October 2018

🌲🌷🌺🌹🌻🥀🌲మా బతుకమ్మ పండుగ కథలు ౼9 చద్దుల బతుకమ్మ 🌲🌺🏵️🌹🌷🌲

🌲💐🌲💐🌲💐 చద్దుల బతుకమ్మ 💐🌲💐🌲💐🌲

పండుగ అనగానే అమ్మ కొన్ని పనులు విధిగా చేయాల్సిందే ! తెల్లవారు ఝామున 4 గం . కి ముందే నిద్ర లేవడం , తెల్లవారే వరకు అందరికీ తలకు నూనె అంటి తల స్నానాలు , ఇల్లంతా కడిగించడం , ముగ్గులు పెట్టడం . నాము , బియ్యం మెత్తగా నూరి ఇల్లంతా తెల్లటి ముగ్గులతో భలే మెరిసి పోయేది . మామిడి తోట నుండి మామిడి కొమ్మలు తెచ్చి వరండా చుట్టూ , అన్ని గడపలకి మామిడి తోరణాలు కట్టించేది . గడపలకు పసుపు రాసి ,కుకుమ , బియ్యప్పిండి తో అలంకరణ .
తడిసిన బండలు , పచ్చటి మామిడాకుల వాసనతో  వింతైన వాసన గుభాళీంచేది . హాల్లో ఒక ప్రక్కన  ఈత చాప వేసి దానిమీద పెద్ద బస్తాడు తంగేడు , తేలుగొండి  పూలు పోసి తడి చీర కప్పి ఉంచేవారు . తంగేడు పూల గమ్మత్తైన వాసన అక్కడంతా వ్యాపించి ఉండేది . మరో పక్కన బతుకమ్మ పేర్చేటప్పుడు  మధ్యలో నింపే పిప్పింటాకు మరో పెద్ద కుప్ప .

           ఇక వంట ఇల్లు విడిగా రెండు పెద్ద గదులుగా ఉండేది . అక్కడ పిండివంటలు , చద్దుల వాసన ఘుమ ,
ఘుమలు . రెండు పెద్ద ఇనుప పొయ్యిలు ,
కట్టెలు మండుతూ ..పొగ తో వంటిల్లు నిండిపోయేది . అయితే తడికట్టెలు కాకుండా , బాగా ఎండిన కట్టెలు కాబట్టి చక్కగా మండేవి, కొద్దిగా పొగతో . అమ్మ వంట
అవగానే చద్దులు , స్టీలు కాన్లలో సర్దేసి , భోజనాలు కాగానే  బతుకమ్మను పేర్చడం మొదలు పెట్టేది .  రెండుగంటలకు పైనే పట్టే
పెద్ద పని అది . పిల్లలందరం, సాయంచేసి తంగేడు పూలు , రంగులద్దిన గడ్డిపూల కట్టలు , అమ్మా ఇప్పుడు ఇవి పెట్టు , ఈ రంగు బావుంటుంది అని సలహాలిస్తూ
..అందిస్తుంటే ..అమ్మ ప్లేట్ లో ముందు గుమ్మడాకులు వేసి , పూలు పేర్చెది . దేనితరువాత ఏవి ఇవ్వాలో , ఎలా సమానంగా మడతలు పెట్టి ఇవ్వాలో అమ్మ చెప్పినట్టు ఇచ్చేవాళ్ళం .

          అమ్మ మంచి టీం లీడర్ . పిల్లల్ని అంటే మమ్మల్ని అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేసేది . పండుగలకి చేసే పనులు , పిండి వంటలకి  కూడా మాకు పనులు చెప్పి
చేయించేది . మంట , పొయ్యి దగ్గర చేతులు
కాలతాయి   జాగ్రత్త అంటూనే , మాకు పనులు
నేర్పేది . పిండి జల్లెడ పట్టడం , నేల శుభ్రం చెయ్యడం , వండినవి డబ్బాల్లో సర్దడం ,
కట్టెలు , గరిటెలు , ప్లేట్లు అందించడం .. కాస్త పెద్దయ్యాక నూనెలో వేయించడం కూడా . పాలకాయలు , గవ్వలు వత్తడం , పల్లీ
మిఠాయి కి పల్లీలకు పొట్టు తీయడం .. ప్రతీ
పనిలో మేం అమ్మ ప్రక్కనే ఉండి , కబుర్లు చెబుతూ సాయం చేసేవాళ్ళం . మధ్యలో అమ్మా కొంచం రుచి చూస్తాం అని చేతిలో పెట్టించుకొని , తింటూ.. మధ్య , మధ్య నాన్న
వంటిట్లోకి వచ్చి , వండినవి నోట్లో వేసుకుని ..ఇంకా కారం పడుతుంది , ఉప్పు తగ్గింది ,
నువ్వులు వేగలేదు , కర కర లాడట్లేదు అని
వంకలు పెట్టి వెళ్ళేవాడు . అమ్మ విసుక్కునేదీ మిమ్మల్ని మెప్పించలెం బాబూ అని .. చివరకు బానే ఉన్నాయిలే అనేవాడు .

సరే మళ్ళీ బతుకమ్మ దగ్గరికి వద్దాం . ముందు పెద్ద పువ్వులు , బరువైనవి పేర్చి , రాను రాను వెడల్పు తగ్గిస్తూ , కోన్ షేప్ లో పేరుస్తూ , పైన తేలికైన పూలు , రంగు రoగుల్లో పేరుస్తూ  , పైన గుమ్మడి పువ్వు పెట్టి ముగించేది . పెద్ద బతుకమ్మ , ప్రక్కనే తోడు బతుకమ్మ లపైన దేవుడిదగ్గర ఉదయమే పెట్టి పూజ చేసిన గౌరమ్మలను ఉంచేది . పెద్దగా పేర్చిన బతుకమ్మను ఎలా తీసుకెళ్ళాలి ? పూలు కదలి పోతాయి కదా ! అందుకే ప్లేటు కిందినుండి  గట్టి దారం పసుపు రాసి , నాలుగు వైపులా పైకి తీసి కట్టేవారు .అప్పుడు పువ్వులు కదలకుండా గట్టిగా ఉంటాయి . బతుకమ్మ చుట్టూ అగరు వత్తులు గుచ్చి ఉంచేవారు .
   
        మళ్ళీ గబ,గబా తయారు కావాలి . చద్దుల బతుకమ్మ గుడి దగ్గర కాదు , వూరికి దూరంగా ఉన్న చిన్న గుట్ట మీద . బల్ల
పరుపుగా ఉన్న ఆ బండ ని , గిద్దె బండ అనేవారు . ప్రక్కనే పెద్ద నీళ్ళ కుంట ఉండేది .అందులో బతుకమ్మ లను వదిలి పెట్టేవారు .వూరికి 1 కి మీ దూరం లో ఉండేది . అక్కడికి వెళ్ళాలి .  బతుకమ్మను మోయడానికి ఇద్దరు ఉండేవారు , భుజాలు మార్చుకునేవారు బరువైనప్పుడల్లా .. పైగా కొండ చిన్నదైనా పైకి ఎక్కాలి కూడా బరువుతో
.  ప్రసాదాల కాన్లు  కూడా ఉండేవి . అందరం తలా ఒకటి పట్టుకునేవాళ్ళం . తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడిపోతుంది . పల్లెటూరు , వీధి దీపాలు ఉండవు ,
అందుకు పెట్రో మాక్స్ లైట్లు మూడు , నాలుగు తెప్పించేది అమ్మ .
   
            కొత్త బట్టలు కట్టుకుని తయారు అయ్యేసరికి , సన్నాయి మేళం వచ్చేసేది . ఇంటి ముందు చక్కాగా పాటలు వాయించేవారు .  బతుకమ్మ పైన చిన్న ,రవికల బట్ట , వడి బియ్యం మూట ( చిన్నది
) పెట్టి , పెరుగన్నం  కలిపి మూడు ముద్దలు ఇంటి ఆడపిల్లకి తినిపించాలి . ఇంకెవరికీ ..? నాకే ! తరువాత నా చేత్తో చల్ల (మజ్జిగ ) గడపకు మూడుసారు అద్దించి ,  దేవుడికి , పెద్దలకి నమస్కారం చేయించేది అమ్మ !
మీకు ఏమి గుర్తుకు వస్తోంది ? ఆడపిల్లను
ఆత్తవారింటికి ఇలాగే పంపుతారు కదూ .. వడి బియ్యం , పెరుగన్నం పెట్టి . అవును .. అచ్చం అలాగే .. బయట సన్నాయి మేళం , బోలెడంత మంది ఊరిజనం , హడావుడి అచ్చు అలాగే ! అమ్మ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేది .  బతుకమ్మను నెత్తికెత్తుకుని మేళ lతాళాలతో , వెనక మేం ఠీవిగా నడుస్తూ
కదిలేవాళ్ళం . తరువాత బాబాయి వాళ్ళ బతుకమ్మ , తరువాత బ్రాహ్మణవారి బతుకమ్మ ఇలా అందరూ ఊరేగింపుగా నడుస్తూ  ముందు సన్నాయి మేళం , వెనుక బతుకమ్మలు , ఆ వెనుక మేము కబుర్లు చెప్పుకుంటూ గిద్దె బండ చేరేవాళ్ళం . అగరుబత్తుల వాసన ఘుమ ఘుమ లాడుతూ , బతుకమ్మల పైన వెలిగించిన
చిన్న ప్రమిదలలో దీపాలు వెలుగుతూ .. పెద్ద పెద్ద బతుకమ్మలు రంగు రంగుల్లో , సాయంకాలపు నీరెండలో మెరిసిపోతూ ! అద్భుతమైన దృశ్యం ! చుట్టూ  మరింత మెరిసిపోతూ స్త్రీలు .. పిల్లలు ! గిద్దె బండ మా రాజ్యం అన్నంత స్వేచ్చ  ! పరుగులూ .. ఆటలూ , పాటలతో మార్మ్రోగుతూ ! సంతోషం అంతా అక్కడే రాశి పోసినంత అందంగా !

         ఆఖరి రోజున రెట్టించిన ఉత్సాహం తో
పాటలూ  , కోలాటాలూ వేసి బాగా అలసిపోయి ..చీకటి పడేవరకు
బతుకమ్మలను కుంటలో వదిలేసి , పసుపు గౌరమ్మలను అక్కడే ఓలలాడించి , ఆ పసుపు భక్తిగా అద్దుకొని , ప్రసాదాలు పంచుకునేవారు . ఎన్ని ప్రసాదాలు ? ఎన్నెన్ని చద్దులు ? కమ్మగా , తియ్యగా కడుపునిండా తిని , బాగా ఆడుకుని సంతోషం గా తబ్బిబ్బయ్యే పిల్లలు . రోలు రోకళ్ళు , పిస్తోలు రీళ్ళు పేలుస్తూ మగ పిల్లలు , బిస్తి గీసి , చెమ్మ చెక్కలు ఆడుతూ ఆడవారు ..! ఒక
అందమైన అనుభూతి . ఇక బాగా చీకటి పడిందని పెట్రోమాక్సు లైట్లు ముందు
దారిచూపుతుంటే , వెనుక కోలాహలంగా
ఆరుస్తూ పిల్లలం , ఆవెనుక రోజంతా పనులతో , బతుకమ్మ ఆటతో అలసిన
అమ్మలు మెల్లిగా , బతుకమ్మను సాగానంపెసామనే భారమైన  హృదయాలతో .. అడుగులు వేస్తూ , మెల్లిగా కబుర్లు
చెప్పుకుంటూ ఇళ్ళు చేరేవారం !

తొమ్మిది రోజుల సందడి అలా ముగిసేది .  మర్నాడు దసరా పండుగ ! గుడివద్ద మగవారు అందరూ చేరేవారు . గుడిలో పూజలు జరిపించి , ధ్వజ స్థంభం వద్ద జమ్మి కొమ్మను నిలబెట్టేవారు . అందరూ కాగితాలమీద  " శమీ శమయతే పాపం !
శమీ శత్రు వినాశనం ! అర్జునస్య  ధనుర్ధారీ , రామస్య ప్రియదర్శనం ! " అనే శ్లోకం రాసి , జమ్మి చుట్టూ ప్రదక్షిణాలు , మూడుసార్లు చేసి , ఆ కాగితాలను జమ్మి కొమ్మకు గుచ్చేవారు . గుడి ప్రసాదాన్ని తీసుకొని , సాయంత్రం వూరి పొలిమేర దాకా నడిచి , పాల పిట్ట దర్శనం చేసుకుని వెనుదిరిగేవారు ! పాల పిట్ట దర్శనం సకల శుభదాయకం మరి !
l
ఇవండీ మా చిన్న పల్లెటూర్లో బతుకమ్మ ,
దసరా పండుగ విశేషాలు !  ఈమాత్రం పండుగ మేమూ చేసుకున్నాం లేవో .. అంటారా ..? చాలా సంతోషం ! మన చిన్ననాటి జ్ఞాపకాలు నేమరేసుకున్నామని సంతోషిస్తా ! విసుగనిపిస్తే  క్షమించండి .. బతుకమ్మ నా జ్ఞాపకం .. నాకోసమే రాసుకున్నా !
   



  😃🙏🏼

🌼🌺🌻🌷🌲మా బతుకమ్మ పండుగ కథలు౼8 .🌲🌹🥀🌺🌻🌼

🌲🌹🌲🌷 చద్దుల బతుకమ్మ  - తయారీ -8 🌷🌲🌹🌲

చూస్తూ ఉండగానే , మీరు నా బతుకమ్మ కథలు చదువుతుంటేనే 8 వ రోజు వచ్చేసింది . 9 వ రోజు చద్దుల బతుకమ్మ . ఆరోజు బతుకమ్మకు వీడ్కోలు . పెద్దగా పేర్చాలని , ఎవరికి వారికే , మన బతుకమ్మే ఎత్తుగా ఉండాలనే పట్టుదల .మా అమ్మకు టార్గెట్ నా ఎత్తు . ఎప్పుడు నన్ను పక్కన నిలబెట్టి ఎత్తు కోలుచుకునేది . చాలా వరకు సాధించేది కూడా .  3,4 అడుగుల ఎత్తు బతుకమ్మ , పూలతో పేర్చాలంటే ఎన్ని పువ్వులు కావాలి ? మా అమ్మకు మంది , మార్బలం ఉండేవి మరి . దీనికోసం ముగ్గురు మనుషులను నియోగించేది . ఒకరు చుట్టుపక్కల ఊర్లకి వెళ్లి , వూరు బయట
పూసే తంగేడు పూలు తేవాలి . ఒక పెద్ద బస్తా నిండా తేవాలి . పచ్చగా పూసినవే .. పాపం మా చాకలి పాపమ్మ భర్త ఆపని మీద
వెళ్లి , ఎలాగో సాధించేవాడు . ఇక మరో ఇద్దరు పని వారు గడ్డి పూలు తెచ్చేవారు . బతుకమ్మ పండుగకి ఒక 10 రోజుల ముందే , ఈ పూలు  తెచ్చేవారు . వీటిని గునుగు పూలు అంటారు . చిన్నగా గుత్తులుగా పూసే గడ్డి పూలు . మామూలుగా ఎవరూ పట్టించుకోరు . కానీ బతుకమ్మ సీజన్ లో ఈపూలే పెద్ద ఆకర్షణ ! ఎందుకంటే ఈపూలను కట్టలుగా కట్టి , నీట గా కట్ చేసి , రంగులు అద్ది , ఎండలో పెట్టి , బాగా ఎండిన తరువాత , ఒక తట్టలో దాచేది అమ్మ . పసుపు రంగు , ఆకు పచ్చ , ఊదా , ఎరుపు , రాణి పింక్ ఇలా బాగా  డార్క్ గా ఉండే రంగులు అద్ది , ఎండబెడితే , ఎండిన తరువాత కా స్త రంగు తగ్గేది . మా రెండో అన్నయ్య ఈ పనులు చేసేవాడు . మా అమ్మకి బాగా హెల్ప్ చేసేవాడు . తమ్ముడు సాయం చేయబోయినా , ఏదో పొరబాటు చేసి తిట్లు తినేవాడు . బతుకమ్మ ఎత్తు పెరగాలంటే తంగేడు పూలు , గునుగు పూలే ముఖ్యం  .  వాటిని చక్కని  కాoబినేషన్ లో పెర్చడమే ఒక గొప్ప కళ !  అప్పుడే బతుకమ్మ అందంగా కనిపిస్తుంది . చుట్టూ పూలు పెర్చినప్పుడు అవి ఎలా నిలుస్తాయి ? మధ్యన అంతా ఖాళీ కదా !
         
              అందుకోసం మరో గడ్డి చెట్టు , పల్లెల్లో విరివిగా ఎక్కడైనా పెరిగే పిప్పింటాకు కూడా ఒక బస్తాకు కోసుకోచ్చేవాళ్ళు . మా పెరట్లో ఉన్న పిప్పింటాకు మొత్తం ముందు
రోజుల్లో ఖతం అయిపోయేది మరి . చిన్న , గుండ్రటి ఆకులతో ఉండే పిప్పింటాకు కొమ్మలనుండి దూసి , బతుకమ్మ పేర్చడానికి ఉపయోగించేవారు . తంగేడు ఆకులు కూడా వాడేది అమ్మ .బతుకమ్మ పేర్చడానికి ఒక పెద్ద
స్థాoబాళ మ్  తీసుకొని , దానిమీద పెద్ద గుమ్మడి ఆకులు పరచి , బతుకమ్మ పేరుస్తారు . నీళ్ళల్లో వదిలినప్పుడు ఆ గుమ్మడాకు  మీద తేలుతుంది బతుకమ్మ . చద్దుల బతుకమ్మ కోసం బాగా పెద్ద సైజు  ఇత్తడి ప్లేటు తయారు
చేయించి , పెట్టుకునేవారు .  తంగేడు , గునుగు , బంతి పూలు , కారం బంతి , సీత జడలు , చామంతి , నది వర్ధన , గరుడ వర్ధన , ముద్ద ఒంటి రెక్క మందారాలు , తేలు గొండి , గోరింట , గన్నేరు , కట్ల పూలు ,
బీర , గుమ్మడి పూలు  మొదలైన రకాలు వాడేవారు బతుకమ్మ పేర్చడానికి .

         బతుకమ్మ పేర్చడం అందరికీ రాదు . ఓపిక , శ్రద్ధ , ఒడుపు తెలిసి ఉండాలి . ఏమాత్రం సరిగ్గా లేకపోయినా , పక్కకి ఒరిగి , పూలు కుప్పలా పడిపోతాయి . చాలా
ఇళ్ళలొ మగవారు పేర్చేవారు. మా ఇంట్లో అమ్మ ఒక్కతే పేర్చేది. మేము చుట్టూ కూర్చుని సాయం చేసేవాళ్ళం . మా బ్రాహ్మణవారి (వైదీకి )అత్తయ్య ఇంట్లో , రంగయ్య తాతయ్య
పేర్చేవాడు. చాలా బాగా పేర్చేవాడు . పైగా వాళ్ళ బతుకమ్మ , మా బతుకమ్మకంటే ఒక పిసరైనా  పెద్దగా ఉండేది . మా నాన్న , రామ
శాస్త్రి మామయ్యా ఒకేవయసు వారు . లక్ష్మప్పా (నాన్న ) ,రామప్పా ( మామయ్యా )నారప్పా ( నారాయణ రావు , మా బాబాయి ) అని పిలుచుకునేవారు . పిల్లలం మేము కూడా ఫ్రెండ్స్ .  అందుకే కుళ్ళు కోకుండా ( మనసులో నొచ్చుకున్నా ) , సర్దుకునేదాన్ని. వాళ్ళ అన్నమ్మ , నేను ఫ్రెండ్స్ .. అది నాకంటే చిన్నదే అయినా , నాతో ఎంతో బాగా ఉండేది , నేను చెప్పినట్లు వినేది 'సరే  వదినా ' అంటూ ..

            ఇలా రోజు వారి బతుకమ్మ ఆడుతూ , చద్దుల బతుకమ్మకి తయారీ , భారీ ఎత్తున చేసేది అమ్మ . మిగిలిన వాళ్ళు ఎలా చేసేవారో తెలియదు . మా ఇంట్లో మాత్రం
పిల్లలు , పెద్దలు , పనివాళ్ళు అందరూ  యమా బిజీ అన్న మాట !

రేపు చద్దుల బతుకమ్మని ఎలా సాగానంపుతారో తెలుసుకుటే ఆశ్చర్య పోతారు . మరి ఒక్కరోజు ఓపిక పట్టండి . అన్నట్టు రేపటితో ఈ సుత్తి కొట్టడం ఆపేస్తాను . ప్రామిస్ ...😃

🏵️🌹🌺🌼🌻 మా బతుకమ్మ పండుగ కథలు ౼7 🌼🏵️🌹🌺🌻🌷

🌹🌲🌺🌲🌼బతుకమ్మ పండుగ - 7🌲
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
🌷🌲🌹🌲🌻
~~~~~~~~~~~
🍚🍨బతుకమ్మ చద్దులు  (నైవేద్యాలు ) 🍲🍟

బతుకమ్మను పసుపు కుంకుమలతో పూజించి , ఆటపాటలతో , కోలాటాలతో అలరించి ,తాము తెచ్చిన చద్దులను అక్కడ ఉంచి నైవేద్యం పెడతారు .

బతుకమ్మ కు పెట్టే నైవేద్యాలు (వండిన పదార్ధాలను ) చద్దులు అంటారు . మామామూలుగా చాలా మంది, మొదటి  8 రోజులు  బెల్లం , అటుకులు ; కొమ్ము శనగపప్పు ( వేయించిన శనగలు ) + బెల్లం , పేలాలు , పేలపిండి లో బెల్లం పొడి కలిపి ఇలా చేస్తారు .  9 వ రోజు అన్నం తో చేసే పులిహోర , దద్ద్యోజనం , తియ్య పొంగలి , మినప , పెసర గారెలు , రవ్వ లడ్డూలు , తప్పాల చెక్కలు , నువ్వు లడ్లు , పేలపిండి లడ్లు , పల్లీ ఉండలు ఇలా 3 రకాలు కానీ , ఐదు రకాలు లేదా తొమ్మిది రకాలు చేస్తారు . ఎక్కువ నైవేద్యాలు 9 వరోజు చేస్తారు కాబట్టే "చద్దుల బతుకమ్మ " అంటారు .

     మా అమ్మ మొదటి రోజునుండి రోజు వండిన చద్దులే నైవేద్యం పెట్టేది . ఇంకా
ఇద్దరో , ముగ్గురో కూడా వండిన చద్దులు తెచ్చేవారు .  మిగిలిన వాళ్ళు అటుకులు బల్లెం /పుట్నాలు బెల్లం / పేలాలు తెచ్చేవారు . పెద్ద కాన్ నిండా ప్రసాదం చేసేది అమ్మ . తియ్య పొంగలి , కట్టు పొంగలి , గారెలు , మొక్కజొన్న గారెలు ఇలా . 5 వరోజు తెల్లఅట్లు నైవేద్యం . 9 వరోజు 9 రకాలు చేసేది . పూజారి గారి ఇంట్లోని బాదం ఆకుల్లో ప్రసాదం పంచేది అమ్మ . ప్రసాదం పంచేటప్పుడు గొడవ గొడవగా , పిల్లలంతా మూగేవారు అమ్మ చుట్టూ .

నైవేద్యం పెట్టగానే , బతుకమ్మల మీద
ఉంచిన గౌరమ్మలను, ఒక పెద్ద
స్థంబాళం (పెద్ద ప్లేట్ )లోకి తీసుకుని  ,
బతుకమ్మలను గుడి వెనక ఉన్న చిన్న

చెరువు లో వదిలి పెట్టేవారు .. తరు వాత ఆ చెరువు నీళ్ళే కాడిని తెచ్చి , పసుపు గౌరమ్మల మీద చిలకరించి , మరోపెద్ద ప్లేట్ ను బోర్లించి , అందరు గుండ్రం గా ఆ ప్లేట్ పట్టుకునేవారు . అమ్మ ఓలలాడించే పాట
పాడుతుంటే అందరూ ఆ పళ్లాన్ని పైకి కిందికీ ఊపుతూ ఉండేవారు .
దీన్నే ఓలలాడిన్చడం అనేవారు .  గౌరీ దేవిపాట .. ఎంత బావుండేదో .. నాకు పూర్తిగా గుర్తు రావడం లేదు . ఇలా సాగేది ..
  " హిమవంతునింట్లో బుట్టి ,  హిమవంతు నింట్లో పెరిగి .."  పెళ్లి చేసి పంపుతూ , కూతురుకు తల్లిదండ్రులు అప్పగింతలు చెప్తూ .." నీ చిన్ని గజ్జెల పాదం ధరకొట్టి నడువకమ్మా .." అంటూ , అత్తగారి ఇంట్లో ఎలా ఉండాలో , ఎలా నడుచుకోవాలో చెప్పే పాట ! నాకు అస్సలు గుర్తు రావడం లేదు .
ఓలలాడించిన  తరువాత ఆ పసుపును అందరూ భక్తిగా మంగళ సూత్రాలకు అద్దుకుంటారు. ఐదవ తనాన్ని , సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటారు .

             తరువాత ప్రసాదాలు పంచుకుంటారు . కబుర్లు చెప్పుకుంటూ , బిస్తి గీయాడాలు , చెమ్మ చక్కలు , లాంటి వాటితో
కాసేపు తమ వయసు , ఇంటి దగ్గర ఉన్న సమస్యలూ అన్నీ మరచి ఆనందంగా గడిపి , బాగా చీకటి పడేవరకు ఇళ్ళకు చేరుకుంటారు . పల్లెల్లో ఉండే వనితలందరికీ , కేవలం వారి సంతోష , సరదాలకి సభంధించిన  పండుగ , మగవారి ప్రమేయం అస్సలు ఉండని ఏకైక పండుగ  , ఈ బతుకమ్మ పండుగ !

(మరి కొన్ని కబుర్లు రేపు చెప్పుకుందాం .. )