Sunday, 8 October 2017

,🌺🌻🌼🌷🌸💮🍁మా బతుకమ్మ పండుగ కథలు 🌺🌹🌷🌻🌼🍀🍁

🌺🌷🌻🌹🍁🌸🌼బతుకమ్మ  పండుగ -6 🌼🌹🌷🍁🌸🌺

 అక్కెమ్మ కన్నీటి గాధ , త్యాగనిరతి మనసుని ద్రవింప జేస్తుంది . మా అమ్మ ఈపాట చాలా బాగా , కరుణా రసం ఉట్టిపడేట్లుగా పాడేది . చాలా పెద్ద పాట . అలాగే ఒక 4,5 పాటలు అమ్మ మాత్రమె పాడేది . మిగిలినవారికి అంత బాగా వచ్చేవి కాదు . నా దురదృష్టం కొద్దీ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఆ జ్ఞానం లేకపోయింది . పాటలు రాసుకోలేదు , నేర్చుకోలేదు . అప్పుడు ఆ విలువ తెలియలేదు . తను ఉన్నన్ని రోజులు మా తమ్ముడి కూతురుతో , ఎంగిలి బతుకమ్మ , చద్దుల బతుకమ్మ పేర్చి ,ఆడించింది హైదరాబాద్లో . 10 సంవత్సరాలు అయింది అమ్మ పోయి .

ఇప్పుడు చెప్తున్న సుశీల కథ కూడా  అమ్మే చెప్పేది . అందరూ అమ్మ చుట్టూ కూర్చుని శ్రద్ధగా వినేవారు . 9 రోజుల్లో చద్దుల బతుకమ్మ ఆడే రోజు కథ చెప్పేది . మిగిలిన
రోజుల్లో పాట మాత్రమె !

🌹🌹🌹🌹సుశీల కథ 🌹🌹🌹🌹🌹
ఒకా నొక పుణ్యదంపతులకి ఏడుగురు కొడుకులు, ఒక్కతే కూతురు.
కొడుకుల తరవాత, ఆఖర్న పుట్టిన ఆడపిల్ల సుశీలను చాలా గారాబంగా పెంచుకున్నారు.
కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి, కూతురుకు కూడా పెళ్ళి చేసి కాశీయాత్రకు భయలుదేరి వెళతారు..

ఆశ్వీజమాసంలో బతుకమ్మ పండుగ వచ్చింది. తల్లతండ్రులు దగ్గరలో లేరు కాబట్టి సుశీల, పెద్ద వదిన దగ్గరకు వెళ్ళి.. "పట్టుచీర, పట్టు రవికె, కాళ్ళకడియలు "
మొ. కావాలని అడుగుతుంది. ఆమె కోపంగా మొహం తిప్పుకుని "నా దగ్గర లేవు"
అంటుంది. అలాగే ఆరుగురు వదినలూ "మా దగ్గర లేవు " అంటారు. ఏడవ వదిన మాత్రం" నేను ఇస్తాను కానీ పట్టు రవికెకు గంధం అంటకూడదు, పట్టు చీర కు పసుపు అంటరాదు, భంగారు కడియాలు నొక్కులు పడరాదు ., అలా అయితేనే ఇస్తాను. ఒక వేళ అలా జరిగితే మాత్రం నీ నెత్తురు కళ్ళ జూస్తాను, గుర్తు పెట్టుకో.. ".. సుశీల వదిన గారి ఆంక్షలన్నీ సంతోషంగా ఒప్పుకొని, నగలు, చీరా, రవికా తీసుకొని వెళ్ళింది.

ఎనిమిదిరోజులూ బతుకమ్మ ఆడింది కానీ, కాళ్ళకు పసుపు రాసుకోలేదు.. మెడకు గంధం పూయనివ్వలేదు.. స్నేహితురాళ్ళతో 'బిస్తి ' గీయలేదు..వారు ఎంత అడిగినా ఒప్పుకోలేదు..వదినగారికి ఇచ్చిన మాట కోసం..
కానీ చద్దుల బతుకమ్మ నాడు స్నేహితులు పట్టుబట్టి సుశీల మెడకి గంధం, కాళ్ళకి పసుపు పూసి, బిస్తి గీయించి (ఆడపిల్లల.ఆట..రెండు చేతులూ బిగించి పట్టుకుని
పాదాలు నేలకానించి, చుట్టూ తిరగడాన్ని బిస్తి గీయడం అంటారు) , ఆట లాడించి గానీ వదల్లేదు.

కానీ సుశీల రవికెకు గంధం, చీరకు పసుపు , బంగారు కడియాలకు నొక్కులూ పడ్డాయి.సుశీల భయపడి వదినగారు పనిలో వున్నప్పుడు అవి తిరిగి ఇచ్చేసింది. తరువాత చూసుకున్న వదినకి చాలా కోపం వచ్చి పట్టు చీర రవికా
చింపి తలకు, వాసెన గట్టి పడుకుంటుంది. కాసేపటికి భర్త వచ్చి "ఏమైంది " అని అడుగుతాడు...ఆమె తలనొప్పి అని చెప్తుంది.. "ఏం రాస్తే తగ్గుతుంది? " అని అడుగుతాడు.. "నెత్తురు రాస్తే తగ్గుతుంది. " "ఏ నెత్తురు కావాలి ? "
అంటాడు.. "నీ చెల్లి రక్తం తెస్తే తగ్గుతుందీ " అంటుంది.
ఒక్కగానొక్క గారాల చెల్లి సుశీల..ఆమె రక్తం ఎలా తీస్తాడు..
??
మర్నాడు అడవికి పోయి, కాకి ని చంపి ఆ నెత్తురు తెచ్చి ఇస్తాడు.
సంతోషంగా లేచి, భర్తకి వంట చేసి పెట్టి, ఆనెత్తరు నుదుటికి పట్టించి ,
కడవ తీసుకుని నీళ్ళకు వెళ్ళింది.
"కట్లా కట్లా కడవ.తీసుకొని
మెట్లా భావికి నీళ్ళకి పోతే..
కలవారి కోడలు కాకి నెత్తురు పెట్టుకుందీ "....
అని అందరూ నవ్వుతారు.
మళ్ళీ తలకి వాసెన గట్టి పడుకుంటుంది.
భర్త మళ్ళీ అడుగుతాడు.. ఆమె నీ చెల్లి రక్తం కావాలి అంటుంది.
మర్నాడు పిట్ట రక్తం తెచ్చి, అది మా చెల్లిదే అంటాడు.
ఆమె ఆ రక్తాన్ని నుదుటికి పట్టించి కడవతో నీళ్ళకు వెళుతుంది.
మళ్ళీ అందరూ..
"కట్లా కట్లా కడవ.తీసుకొని
మెట్లా భావికి నీళ్ళకి పోతే..
కలవారి కోడలు పిట్ట నెత్తురు పెట్టుకొచ్చిందీ "....
అని నవ్వుతారు.
మళ్ళీ కోపంతో ఇంటికి వచ్చి , భర్త ముందు ఉరి పోసుకుంటానని బెదిరిస్తంది.
అప్పుడు భర్త, ఈ సారి చెల్లిని చంపి, ఆమె రక్తమే తెస్తానని మాట ఇచ్చి ..
సూది, దబ్బనం, కత్తి, నువ్వులు, పెరుగన్నం మూట గట్టుకోని,
చెల్లి దగ్గరకు వచ్చి "మీ అత్తింటి వారు తీసుకొని రమ్మన్నారు " అని చెప్పి బయలుదేరదీస్తాడు. సుశీల నిజంగా భర్త దగ్గరకే వెళుతున్ననని సంతోషంగా బయలుదేరుతుంది. అడవికి చేరుకోగానే పెరుగన్నం తినమంటాడు.
తింటుంది. అలసిన సుశీల నిద్రకు పక్రమించగానే, వడిలో పడుకో బెట్టుకొని నువ్వులు తలలో పోసి కుక్కడం మొదలు పెడతాడు.. పేలు కుక్కినట్లు..అలా చేస్తే గాఢమైన నిద్ర పడుతుందట..
సుశీల నిద్ర పోగానే సూది తో గుచ్చుతాడు... రక్తం రాదు..
దబ్బనం తో గుచ్చతాడు.. రక్తం రాదు కానీ సుశీల నిద్ర లేచి.
"అన్నా, .నన్ను.చంపడానికి ఇంత కష్టం ఎందుకూ...
కత్తితో ఒకేసారి చంపరాదా..నా నెత్తరు తీసుకెళ్ళి వదినకి ఇవ్వు. "
అప్పుడు కత్తితో పొడిచి రక్తం తీసుకుని వెళ్ళిపోతాడు.
మరణించిన
సుశీల పొట్ట చేద బావిగా,
కాళ్ళూ చేతులు చేద బొక్కెన, తాడూ,
కళ్ళు రామచిలుకలూ..
జుట్టు రంగు రంగుల పూల మొక్కలు గా మారి అందమైన తోట వెలుస్తుంది.
కాశీయాత్రకు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ , ఈ తోట చూసి వెళ్ళేటప్పుడు
లేని తోట 6నెలల్లో ఎలా వచ్చిందా అని అబ్బుర పడతారు.
భావిలో నీరు త్రాగి సేద తీరుదామని, చేద బొక్కెన భావిలో వేస్తాడు తండ్రి.
విచిత్రంగా బావిలోంచి మాటలు వినపడతాయి ..
" ముట్టకు ముట్టకు ఓ నాన్నా, ముడితే నీ చేయి కందేనూ
అంటకు అంటకు ఓనాన్నా .....అంటితే నీ చేయి కందేనూ " అంటూ..
అతను చేద వదిలేసి..తల్లికి ఇస్తాడు.
తల్లి నీళ్ళు తోడ బోయినా అలాగే వస్తాయి మాటలు.
బయటివారు ఎవరు ముట్టుకున్నా ఏమీ వినపడటంలేదు.
తమ ఏడుగురు కొడుకులనూ, కోడళ్ళనూ పిలుస్తారు.
ఆరుగురు కొడుకులూ, కోడళ్ళూ ముట్టుకున్నా.
"ముట్టకు ముట్టకు ఓ అన్నా.. / వదినా .."
అంటూ మాటలు వచ్చాయుి
ఏడో అన్న తాకినప్పుడు " పాపకారి వదిన చెప్పిందని..
దోషకారి అన్నయ్యవు నీవే కదా నన్ను చంపిందీ.. "
అని మాటలు వినపడతాయి. సుశీల తల్లిదండ్రులు
జరిగినవన్నీ తెలుసుకొని, సుశీల భర్తను పిలిపించి ఆమెకు
ఉత్తర క్రియలు జరిపిస్తారు. సుశీల భర్త శివ భక్తుడు.
తనను కూడా భగవదైక్యం చేసుకొమ్మని శివునికై తపస్సు చేస్తాడు.
శివ పార్వతులు ప్రత్యక్షమై, నిష్కారణంగా మరణించిన సుశీల తిరిగి బ్రతికి వస్తుందని, అందుకు తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి, గౌరీ దేవిని ఆట పాటలతో,
నైవేద్యాలతో ప్రీతి చెందేటట్లు చేయమని చెప్తారు.
అలా తొమ్మిది రోజులు బతుకమ్మను పూజించి, పసుపు గౌరమ్మను ఓల లాడించగానే, సుశీల పన్నెండేళ్ళ బాలగా నడచి వస్తుంది.
ఆనందంగా ఆమెను అక్కున చేర్చుకుని...ఆనందంగా గడుపుతారు .
అప్పటినుండీ ఆడ పిల్లలు తమ ఆయుష్షుకోసం..సౌభాగ్యం కోసం
గౌరీ దేవి శుభాసీస్సుల కోసం
బతుకమ్మను పూలతో పేర్చి , పసుపు కుంకుమలతో కొలిచి , నీళ్ళల్లో వదిలి తమ భక్తినీ , ప్రేమనీ , గౌరవాన్నీ పాటల ద్వారా తెలుపుకుంటారు . అందుకే ఎంతో ఉదాత్తమైన , ఉన్నత మైన విలువలు కలిగిన పండుగ ఇది .


Friday, 22 September 2017

,🌹☘🌺🌿🌻☘🌷🌿🌼☘🌸🍀🍁🌿 మా బతుకమ్మ పండుగ కథలు-5 ,,🌹☘🌺🌿🌻☘🌷🌿🌼🍀🌸☘🍁🍀

🌺🍃🌻🍃🌸🍃 బతుకమ్మ పండుగ - 5 🍃🌺🍃🌻🍃🌸


బతుకమ్మ పండుగ ఎందుకు మొదలైంది? అసలు తెలంగాణాలో ఇంత వేడుకగా, ఇష్టంగా ఈ పండుగ జరుపుకోవడానికి కారణమేంటీ.? అది కూడా బతుకమ్మ పాటలలోనే కనిపిస్తుంది. అక్కెమ్మ అనే యువతి బలిదానం వల్ల, నదికి వరదలు తగ్గి,
ఆమె కుటుంబం , గ్రామం రక్షింప బడ్డాయి. క్రింద ఇచ్చిన పాట లో ఆ చరిత్ర కథ చదవ వచ్చు..

పేదరాశి పెద్దమ్మ ఉయ్యాలో - ఎందరే కొడుకులూ ఉయ్యాలా
ఎందరెక్కడిదమ్మ.ఉయ్యాలో -ఏడుగురు కొడుకులూ ఉయ్యాలా
ఏడుగురు కొడుకుల తోడ ఉయ్యాలో - ఒక్కతే అక్కెమ్మ ఉయ్యలా
ధర్మపురి మా తల్లి ఉయ్యాలో- ధనం పెట్టెలిచ్చిరి ఉయ్యాలా
ధనం పెట్టెలుదీస్కోని ఉయ్యాలో- పాలేరు దాకొస్తిమి ఉయ్యాలా
వరదనీరొచ్చెనే ఉయ్యాలో - పాలేరు పొంగెనే ఉయ్యాలా
ధనం పెట్టెలిస్తాము ఉయ్యాలో - తియ్యవే పాలేర ఉయ్యాలా
అట్లంటె పాలేరు ఉయ్యాలో - మరి అగ్గళించింది ఉయ్యాలా
ఏడుగురు అన్నదమ్ములనిస్తాము ఉయ్యాలో- తియ్యవే పాలేర ఉయ్యాలా
అట్లంటె పాలేరు ఉయ్యాలో - మరి అగ్గళించింది ఉయ్యాలా
ఏడుగురు కోడళ్ళనిస్తాము ఉయ్యాలో -తియ్యవే పాలేర ఉయ్యలా
అట్లంటె పాలేరు ఉయ్యాలో - మరి అగ్గళించింది ఉయ్యాలా
తల్లిదండ్రులనిస్తాము ఉయ్యాలో -తియ్యవే పాలేరు ఉయ్యాల
అట్లంటె పాలేరు ఉయ్యాలో - మరి అగ్గళించింది ఉయ్యాలా
అట్లైతె పాలేర ఉయ్యాలో - అక్కెమ్మ విస్తాము ఉయ్యాలా
అట్లంటె పాలేరు ఉయ్యాలో - చప్పున్నా దీసె ఉయ్యాలా
ధనంపెట్టెల్ద్జీస్కోని ఉయ్యాలో - ఇంటికే తిరగొచ్చిరీ ఉయ్యలా
(ఒకనాడు ఏడవ అన్న, తాము ఇచ్చిన మాట ప్రకారం
అక్కెమ్మను నిజంగా 'పాలేరుకు ' బలి ఇవ్వడానికి సిధ్ధం
చేయబోతాడు..)
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో - చెల్లికి తలంటి బోయి ఉయ్యాలా
నిన్న బోస్తిన కొడుక ఉయ్యలో -ఈవేళ ఏమయ్యే ఉయ్యాలా
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో - చెల్లికి తలా దువ్వె ఉయ్యాలా
నిన్న దువ్వితి కొడుక ఉయ్యలో -ఈవేళ ఏమయ్యే ఉయ్యాలా
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో -చెల్లికి బొట్టూ పెట్టూ ఉయ్యాలా
నిన్న పెట్టితి కొడుక ఉయ్యలో -ఈవేళ ఏమయ్యే ఉయ్యాలా
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో -చెల్లికి చీరాగట్టూ ఉయ్యాలా
నిన్న గట్టితి కొడుక ఉయ్యలో -ఈవేళ ఏమయ్యే ఉయ్యాలా

అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో -చెల్లికి చద్దీగట్టూ ఉయ్యాలా
చద్ది గట్టితి కొడక ఉయ్యాలో - చల్లంగ తినబెట్టు ఉయ్యాలా
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో -చెల్లికి బిందే నివ్వు ఉయ్యాలా
బిందెనిస్తిని కొడుక ఉయ్యాలో - చెల్లి జాగర్త కొడుక ఉయ్యాలా
అక్కెమ్మను దీస్కోని ఉయ్యాలో -పాలేరు దగ్గరకొచ్చె ఉయ్యాలా
బిందె చెల్లీకిచ్చి ఉయ్యాలో - నీళ్ళు నింపామానె ఉయ్యాలా
పాదాలవరకొచ్చె ఉయ్యాలో-బిందే నిండాదన్నా ఉయ్యాలా
మరి కాస్త బో చెల్లి ఉయ్యాలో బిందే నిండూనమ్మ ఉయ్యాలా
నడుములా వరకొచ్చే ఉయ్యలో - బిందె మునగా దన్న ఉయ్యాలా

మరి కాస్త బో చెల్లి ఉయ్యాలో బిందే నిండూనమ్మ ఉయ్యాలా
కుతికలా వరకొచ్చే ఉయ్యాలో -బిందే మునగాదన్న ఉయ్యాలా
మరి కాస్త బో చెల్లి ఉయ్యాలో బిందే నిండూనమ్మ ఉయ్యాలా
నేను మునగావస్తి ఉయ్యలో - బిందె మునగాాదన్న ఉయ్యలా
మరి కాస్త బో చెల్లి ఉయ్యాలో బిందే నిండూనమ్మ ఉయ్యాలా
నాతల్లి దండ్రులకు ఉయ్యాలో -బిడ్డ లేదని చెప్పు ఉయ్యాలా
నీ బావమరిదికీ ఉయ్యాలో -భార్య లేదని చెప్పు ఉయ్యాలా
ఆరుగురు అన్నలకు ఉయ్యలో -చెల్లి లేదని చెప్పు ఉయ్యాలా
ఏడుగురు వదినలకు ఉయ్యలో -మరదలు లేదని చెప్పు ఉయ్యాలా
తొట్టిలో బాలునకు ఉయ్యలో -. తల్లి లేదని చెప్పు ఉయ్యలా
ఇరుగుపొరుగు అక్కలకు ఉయ్యాలో - అక్కెమ్మ లేదని చెప్పు ఉయ్యాలా
పాయెనే అకెమ్మ ఉయ్యాలో - పాలేరులో గలిసే ఉయ్యాలా..

ఇది అక్కెమ్మ కన్నీటి కథ! అక్కెమ్మ నీటిలో కలిసినా తనవారందరినీ రక్షించుకుంది. అందరి "బ్రతుకు "ను కోరింది కాబట్టి "బ్రతుకమ్మ " పండుగ జరుపుకుంటారు సామూహికంగా.. కులమతాల కతీతంగా.

(మరొక కరుణాపూరిత మైన కథ రేపు చెప్తాను . ఓపికగా చదువుతున్న మిత్రులందరికీ శత కోటి వందనాలు  🙏🏼)

🌹🌿🌺☘🌻☘🌷🍀🌼🌿🌸☘🍁🌿మా బతుకమ్మ పండుగ కథలు -4 🌹☘🌺🌿🌻☘🌷🌿🌼☘🌸🍀🍁🌿

🌺🍃🌻🍃🌸🍃🌷🍃 బతుకమ్మ పండుగ  - 4 🌸🍃🌼🍃🌺🍃🌻🍃

బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులూ ఎంతో సందడిగా గడిచేవి . రోజంతా బిజీ బిజీగా .. ఏమిటో బాధ్యతలన్నీ మనమే మొస్తున్నంత ఫీలింగ్ !  పూలు కోయడం , అమ్మ బతుకమ్మ పెరుస్తుంటే , సాయం చేయడం , కాడలు లేని చిన్నసైజు గోరింట , గరుడవర్ధన పూలలాంటివి  పెద్ద సూదితో గుచ్చడం , చేతులకు సూది  గుచ్చుకున్నా , కిక్కురు మనకుండా .. ఇష్టమైన పనికి కష్టం ఉండదు కదా !  అమ్మ బతుకమ్మను పెరుస్తుంటే శ్రద్ధగా చూసేదాన్ని . ఎవరైనా ఏ పని చేస్తున్నా .. లయబద్ధంగా , యాంత్రికంగా చేసే వారి పనులన్నీ గమనిస్తూ అనుకరించడం నాకు బాగా అలవాటు .
మా చాకలి రోట్లో ఏదైనా దంచుతుంటే ,
లయబద్ధంగా వేసే రోకలి పోటూ ...
ఇష్షు ఇష్షు  అంటూ , చేతులు మారుస్తూ దంచడం నాకు బాగా నచ్చి , ఎవ్వరూ లేనప్పుడు రోట్లో ఏదైనా వేసి అచ్చం వాళ్ళలాగే చేసేదాన్ని . బియ్యం , పప్పులూ , ఆవాలూ , ధనియాలూ లాంటివి ఎక్కువగా కొని , బాగుచేయించేది అమ్మ .. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూర్చుని పని చేస్తుంటే పక్కన చేరి , చూసేదాన్ని . అలా ఇప్పుడు నాకు చేట తో చెరగడం , రాళ్ళు లేకుండా ఒడుపుగా , నేర్పుగా చేటతిప్పుతూ బాగుచెయ్యడం నాకు వచ్చేసాయి . చాలా మందికి చేట పట్టుకోవడం కూడారాదు .అవి నేను ఇష్టంగా నేర్చుకున్నా . బియ్యం , ఇంకా ఆవాలు లాంటివి రాళ్లు లేకుండా గాలించడం
, అంటే పెద్దగిన్నేలో నీటి తో ఉన్న వాటిని , గిన్నె ఒడుపుగా తిప్పితూ , రాళ్ళు అడుగున ఉండిపోయేలా , ఒక్కరాయి కూడా లేకుండా వేరుచేయ వచ్చు .  అలాగే చల్ల కవ్వం తో  ,
పెద్ద కుండలో , లయ బద్ధంగా , కవ్వం కిందపడి , కుండ పగలకుండా , మజ్జిగ చిలికి ,వెన్న చేయడం బాగా వచ్చు .
ఇంకా చెప్పాలంటే ... మీరు నవ్వకూడదు మరి ...మా శ్రీవారికి కూడా చెప్పలేదు నవ్వుతారని ...గేదె పాలు కూడా పితికే దాన్ని .. నమ్మాలి మరి . ఏదో ఆటగా కాదు .
 సీరియస్ గా ! 3,4 గేదెలకు
పని వాళ్ళే పాలు పిండే వాళ్ళు . ఇంటిండా అన్నిపనులకూ మనుషులుండేవాళ్ళు .. అయినా ఆపని నేర్చుకోవాలనే కోరిక , ఇష్టంగా మారి , చేసేదాకా నిద్రపట్టేది కాదు . అలా ఒక గేదె పాలు నేనే పిండే దాన్ని . వేరు శనగ కాయలు , ఇంటి అవసరాల కోసం ఒక బస్తా కాయలు గింజలు కొట్టించేది అమ్మ . పనికి వచ్చిన అమ్మాయిలూ వేగంగా రెండు చేతులతో చక చకా కొట్టేవారు కాయలని .. వారితో  సమానంగా నేనూ కొట్టే దాన్ని . మా రెండో అన్నయ్య  ఏడిపించే వాడు .. అమ్మా దీన్ని కూలిపనులకి పంపించవే అని ...

సరే ..మళ్లీ బతుకమ్మ దగ్గరకి వద్దాం ..అమ్మను చూసి , చిన్న ప్లేటు తెచ్చుకుని నేనూ ఒక బతుకమ్మ పేర్చెదాన్ని . అమ్మకూడా ఏపని చేసినా తిట్టడం , కొట్టడం చేసేది కాదు . నేర్చుకోనీ అన్నట్లు  వదిలేసేది ..ఎలాగో తోడు బతుకమ్మ చిన్నది ఉండాలి .. అది నేను పేర్చెదాన్ని . గుడికి కూడా నేనే తీసుకెళ్లెదాన్ని ..
ఊరంతా ఇంటి ఆడపడుచులు , కొత్తకోడల్లతో సందడిగా ఉండేది .. గుడిదగ్గర కూడా , చాలా కలర్ఫుల్ గా , గల గల మాటలతో .. అద్భుతమైన వాతావరణం ఉండేది .. నాలాంటి మరికొందరు పిల్లలం , బతుకమ్మ ఆట మొదలయ్యేలోపు , గుడిచుట్టు పరుగులు పెడుతూ , దాగుడు మూతలు , బిస్తి గీయాడాలు , తొక్కుడు బిళ్ళ
ఆటలూ .. కిల కిలా రావాలతో .. గుడి ప్రాంగణం అంతా .. చక్కని పూలతోటలో పక్షల కిల కిలా రావాలకి మల్లె .. ఆహ్లాద భరితమైన పండుగ వాతావరణం నిండి ఉండేది . గుడి అరుగుల మీదా , మెట్ల మీదా కూర్చున్న స్త్రీలు రంగు రగుల చీరలు నగలు ..ధరించి .. విరబూసిన పూల చెట్ల లాగా ఉండేవారు . కల్మషం లేని పల్లె వాతావరణం ఎంతో రమణీయంగా ఉండేది .,,

( మరికొంత మరో పోస్ట్ లో చెప్పుకుందామా .. విసుగు పుట్టిస్తే క్షమించండి .. :).  )


మా బతుకమ్మ పండుగ కథలు ,🌹☘🌺🌿🌷🍀🌻🌿🌼☘🌸☘🌼🍀🍁🌿

🌺🍃🌼🍃🌸బతుకమ్మ పండుగ 🌸🍃🌼🍃🌺🍃🌻
---
( మూడవ భాగం ) రోలు -రోకళ్ళు ---

నేను వెయిట్ చేస్తూ వుండేదాన్ని...ముందు ఇద్దరు పాడగానే ఇక ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా, ఒకదానివెంట.మరోటి...అమ్మ తిట్టేది. " అందర్నీ పాడనివ్వూ " అని... అప్పుడు ఒక నిముషం సేపు చూసి మళ్ళీ అందుకునే దాన్ని.. దాంతో ఏ పాటలు పాడాలో ముందే ప్రిపేర్ అయి మరీ వచ్చేవారు.
మా సరసక్క నెం.వన్ గా పాడేది.. వరుసకు అక్క అయినా, అమ్మకంటే ఓ నాలుగైదేళ్ళు చిన్నదేమో.. బతుకమ్మపాటలకు మాత్రం నాకు గురువు..

"ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ - ఏమేమి కాయప్పునే..
గుమ్మడీ పువ్వప్పునే గౌరమ్మ - గుమ్మడీ కాయప్పునే
గుమ్మడీ పువ్వులో -గుమ్మడీ కాయలో
ఆట చిలుకలు రెండు - పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు - కందువ్వ మేడలో ..
!!ఏమేమి!!
తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే..
!!ఏమేమి!!
గన్నేరు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే..
ఇలా ఎన్ని పూలు, అయినా కలుపుకోవచ్చు..
మూడు చరణాలు తప్పని సరిగా వుండాలి.

"ఒక్కొక్క పూవ్వేసి చందమామ. -.ఒక్క ఝామూ ఆయె చందమామ
శివ పూజ వేళాయె చందమామ - శివుడేల రాడాయె చందమామ "

ఇలా ఎన్నో పాటలు..పాడినవి రిపీట్ కాకుండా.. 2 గంటల పాటు మైమరచి ఆడి పాడే వారము. కాసేపు కోలాటం..కోలాటంవేసేటప్పుడు ఆపాటలు వేరే..

" నెమలి బాయెనమ్మా కోలు - సజ్జలు గల దేశం
సజ్జలు పండించీ కోలు - సజ్జలారగించీ
చెలిమ నీరు తాగీ కోలు - చెంగళించి కూసే "

ఇలా పాటలన్నీ పూలమీదా, పళ్ళ మీదా, ధాన్యాల మీదా, పక్షల మీదా వుండేవి
.అందరూ మైమరచి పోయి, ఛలోక్తులతో, వదినా మరదళ్ళ పరాచికాలతో సందడి, సందడిగా వుండేది.. కొన్ని పాటలు దేవుళ్ళ జంటలతో ( పాట గుర్తు రావడం లేదు
కానీ తప్పక చెప్తాను ..) వుండేవి.. లక్ష్మీ దేవి -విష్ణుమూర్తి; పార్వతి - పరమేశ్వరుడు; సరస్వతి - బ్రహ్మదేవుడు ఇలా...
కొందరు కొంటె తనంతో (మా సరసక్క) అక్కడ వున్న వారిని వారి భర్త పేరుతో కలిపి పాడేవారు. ఉదా: మా అమ్మ సులోచన - నాన్న లక్ష్మీ నరసింహారావు
అనసూయమ్మ -రంగయ్య గారు; సరసమ్మ -వెంకటేశ్వరరావు: జయమ్మ -వెంకటరెడ్డి; తాయమ్మ -నారాయణరావు ..అంటూ పాడుతుంటే ..చూడాలి..
పక పకా నవ్వులు....సిగ్గులు.. (మరి ఇప్పటి స్త్రీలు భర్తను పేరు పెట్టి, ఏరా, ఏంవోయ్
అనే రోజుల్లో ..ఆ సరదా అర్ధం కాదేమో.. పైగా వాట్స్ ద ఫన్? అనుకుంటారు..) ఆ ఆనందం, నవ్వులూ నాకు ఇంకా ఇప్పుడేవిన్నట్టుగా...చెవుల్లో వినపడుతోంది.

ఆడంగులంతా ఈ కోలాహలం లో వుంటే, కొంటె కోణంగి అబ్బాయిలు
రోలు రోకళ్ళతో వెనకాలే మోత మోగిస్తూ. అందరూ వులిక్కి పడి, జడుసు కునేట్టు చేసేవాళ్ళు... రోలు -రోకళ్ళు అంటే నిజమైన' రోలు -రోకళ్ళు ' కావు..అదే ఆకారంలో వుండే అంగుళం సైజు ఇనప "రోలు -రోకళ్ళు" అన్న మాట..ఇప్పటి వారి ఊహకు కూడా అందని ఆట వస్తువిది. చిటికెడు గంధకం పొడిని వాటిలో నింపి, గట్టిగా బిగించి గోడకు కొడితే, పెద్ద బాంబు పేలిన శబ్దం వచ్చేది. దసరాల నుండీ దీపావళివరకూ, మగపిల్లందరి దగ్గరా ..ఖచ్చితంగా వుండి తీరవలసిందే..
మరి ఎంతమందికి గుర్తుందో... smile emoticon

మా రెండో అన్నయ్యా, తమ్ముడూ ఇంకా కొంతమంది చేరి, ఈ రోలు -రోకళ్ళు మోగించేవారు. మాకు చచ్చేంత భయం..కొంతమంది పెద్దవాళ్ళకి కూడా గుర్తుండని, నోరు తిరగని పాటలు సైతం అవలీలగా పాడే నేను.. ఆ శబ్దాలకు భయపడి.. పాట ఆపి మా అమ్మను పట్టుకొని 'బావురుమని ' ఏడ్చేదాన్ని..ఇంకొంతమంది పెద్దలకీ భయమే... అందులో ముఖ్యం మా సరసక్క.
వాళ్ళ నాన్న మాకు హెడ్మాస్టర్ గారు ( నాన్న కజిన్) , మా సరసక్క భర్త వెంకటేశ్వరరావు గారు (బావ) మాకు టీచరు..వరసకి బావే అయినా మా అందరికీ చచ్చేంత భయం ఆయనంటే... సరసక్క, బక్కపల్చగా, చామన ఛాయతో, గట్టిగా బిగించి వేసుకున్న జడ, తలనిండా పూలు, కాస్త పైకి కట్టిన చీర, కాళ్ళకి లావుపాటి పట్టాగొలుసులు, మట్టెలు , మెడకి హత్తుకుని నల్లపూసలూ, కళ్ళకి కాటుక...ముగ్ధ లా, అమాయకంగా, అందంగా ..బతుకమ్మలాగే వుండేది..

వీళ్ళ రోలు -రోకళ్ళమోత భరించలేక, పెద్ద గొంతుతో ( కొద్దిగా ఉక్రోషం కూడా) ... కళ్ళు పెద్దవి చేసి...ముక్కులు వుబ్బిస్తూ..... "వురేయ్..మీ బావతో చెప్తా వుండండి..ఒక్కొక్కడి సంగతి..సెలవలు బలాదూరుగా వృధా చేస్తున్నారని చెప్పి కోదండం వేయించమంటాను.. బడి శుభ్రం చేయించమంటా .. " అంటూ అరిచేది..
మా సోదరులూ, వాళ్ళ ఫ్రెండ్సూ....కిక్కురు మనకుండా ఆరోజుకి పారిపోయినా..
మర్నాడు 'కుక్కతోక వంకరే .. ' మామూలుగా మళ్ళీ తయారయ్యేవాళ్ళు.. రోలు -రోకళ్ళ తో...

పాటలు పాడటానికి కూడా నన్ను ' స్టాండ్ బై ' గా పెట్టుకనేవారు చాలామంది.. చరణాలు గుర్తు రావనీ, ఒక్కోసారి గుక్క తిప్పుకునేందుకో, కీచుగొంతు పైకి లేవని వాళ్ళూ.. నన్ను " మనిద్దరం పాడదాం రావే ఉషా.. "
అంటూ పిలిచేవారు..వెంటనే నేను సర్కిల్ లో వాళ్ళ ప్రక్కన చేరి పోయేదాన్ని,
మహదానందంగా.. "మా ఉషమ్మ మంచిది .. " అంటూ బుగ్గలు పుణికి, గారం చేసేవారు.. మా సరసక్క నన్ను పక్కన పెట్టుకొని కొన్ని పెద్దపాటలు ఒక చరణం తనూ, ఒక చరణం నేనూ పాడే వాళ్ళం.. ఇంతా చేస్తే నా వయసు 10 సం. లోపే..ఇప్పుడు తలచుకుంటే ఎంతో గర్వంగా... నాకే వింతగా అనిపిస్తోంది.

ఒక్కోసారి కొత్తగా నేర్చుకున్న పాటలు , తడబడటమో , చరణం మర్చి పోవడమో జరిగితే .. మా సరసక్క , గుడ్లు  ఉరిమేలా చూసి , పెద్దగొంతు తో  తను పాడేది .. నాకు భలే ఇoసల్ట్ అనిపించేది ..మర్నాడు అమ్మతో బుక్ లో రాయించుకొని , బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని .  తప్పుల్లేకుండా పాడి , సరసక్కవైపు గర్వంగా చూసేదాన్ని . నా అమాయకత్వానికి ముసి ముసిగా నవ్వుకునేది మా సరసక్క ! తన పూర్తిపేరు సరస్వతి .. కానీ అందరూ సరసూ , సరసమ్మా అనేవారు .

(అప్పుడే అయిపోతే ఎలా..? ఇంకా ఎన్నో చెప్పాలి మీకు...  మరికొన్ని మరో పోస్ట్ లో చెప్తా..)