Tuesday 10 May 2016

🙊🙉🙈🐒 అల్లరి జ్ఞాపకాలు 🐒🙊🙉🙈

🙈🙉🙊 కొన్ని అల్లరి జ్ఞాపకాలు 🙈🙉🙊

       మా అమ్మమ్మ వాళ్ళు , తాతయ్య ఉన్నప్పుడు , పిల్లల చదువుల కోసం ఖమ్మం లో ఉన్నారు . పొడవైన ప్లాట్ లో మూడు వరసగదులు .. కట్టి .. మిగతా ఖాళీ స్థలం అలాగే ఉంచారు . కాంపౌండ్ కట్టి , పెద్దగేట్ ఉండేది . అప్పటికి అమ్మకి , పెద్ద పిన్నికి పెళ్లైంది . పిన్నికి పిల్లలు లేరు . మేం నలుగురం (చెల్లిపుట్టలేదు ) . ముగ్గురు ఆడపిల్లలు , ఇద్దరు మొగపిల్లలు , మా పెద్దన్నయ్య అక్కడ చదువుకునేవారు . ఆ మూడు గదుల్లోనే ఎంత మంది సర్దుకునే వాళ్ళమో .. అమ్మమ్మ చెల్లెళ్ళు , వారి పిల్లలు , అమ్మమ్మ వాళ్ళ అమ్మ ( తాతమ్మ ) , మా అమ్మ , మేము అందరం కలిసినప్పుడు
చాలా సందడిగా ఉండేది . భారీగా వంటలు , సినిమాలకి వెళ్ళడం , మంచినీళ్ళు
మొయ్యడం ( ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పక్కింట్లో నల్లా దగ్గర పట్టుకోవలసి వచ్చేది ) .. మా సావిత్రి పిన్ని రింగు లీడర్ .

         సావిత్రి నాకంటే నాలుగేళ్ళు పెద్ద
అంతే . పెద్దన్నయ్య వయసు . చాలా ఇంటెలిజెంట్ , ప్రాక్టికల్ మైండెడ్ గా ఉండేది . పెద్దవాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ గా ఉంటె ,
వాళ్లకి తెలియకుండా , మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళేది . ఇంతమంది పిల్లల్లో , తెలియకుండా ఎవరో ఒకరు నోరు జారేవాళ్ళు .
దొంగతనం బయట పడేది .. పుల్లైసు కొనేది .. నొక్కేసిన డబ్బులతో ..అమ్మమ్మ ఏదో కొనుక్కు రమ్మంటే , తక్కువ కొని డబ్బులు మిగల్చడం , ధర ఎక్కువ చేసి చెప్పడం .. ఇలా . పుల్లైసు తింటే నోరు ఎర్రగా అయ్యేది . డబ్బులు ఎక్కడివి ? అని అడిగితే అందరూ
సావిత్రిని చూపించే వాళ్ళు . ముందు తిట్లు తిని , తరవాత మమ్మల్ని తిట్టేది . ఈసారి అస్సలు చెప్పం అని ఒట్టు వేసుకునే వాళ్ళం .. మళ్ళీ మామూలే !
       ఖమ్మం లో వీర భద్రం కిరాణా షాపు ఉండేది . అక్కడే కిరాణా సామాను కొనేవారు మా వాళ్ళు . అతను చిన్న లాటరీ నడిపేవాడు. ఐదు పైసలు , పది పైసలు ,
పావలా . దానిమీద బెట్ చెయ్యాలి . మనం చెప్పిన నెంబర్ లాటరీ లో వస్తే , ఎన్ని రెట్లు
బెట్ చేసామో అంత డబ్బు వస్తుంది . ఆ నంబర్లు ఒక కాలెండర్ లో నుండి కట్ చేసినవి . అది మా సావిత్రి గమనించింది .
ఆ కాలెండర్ లోని నంబర్లు జాగ్రత్తగా కట్
చేసి , మాలో ఇద్దరినీ  తన వెంట తీసుకేల్లేది . ఒకటి , రెండు సార్లు 5 పైసలు , 10 పైసలో
ఓడి పోయేది .  తరువాత పావలా బెట్ . ఫైవ్
టైమ్స్ / సిక్స్ టైమ్స్ అనేది . అతను ఒక చిన్న డబ్బా మనముందు పెడతాడు . తను కోరుకున్న నెంబర్ ( ఉదా .:33 అనుకోండి ) ఆ
డబ్బాలో నుండి తీయాలి . ఎలాగూ అది రాదు . వెనక ఉన్న మా దగ్గర సేం నంబెర్ ఉంటుంది . జాగ్రత్తగా అతని దృష్టి మళ్ళించి నంబర్ మార్చేది .  ఇలా రెండు మూడు రోజులకోసారి అతన్ని మోసం చేసేది . తప్పు
కదా అంటే .." ఆ ( .. వాడేమన్నా సత్య సంధుడా ..? మనకు నాణ్యత లేని సరుకులు అమ్ముతాడు . లాటరీ లో ఎంతమందినో మోసం చేస్తాడు .. మనం రెండు , మూడు రూపాయలు కొట్టేస్తే తప్పులేదు " అనేది .  ఆ డబ్బుతో సినిమాలు , పుల్లైసులు ., సినిమా బెంచి టిక్కట్టు 50 పై . ఉండేదనుకుంటా అప్పట్లో ..5 పై సలు పుల్లైసు .

              మాకు కామిక్ పుస్తకాల పిచ్చి ఉండేది .  నాన్న ఖమ్మం వెళ్తున్నాం అని అందరికీ తలా ఒక రూపాయి ఇచ్చేవారు . అవి సావిత్రి తీసుకునేది . కామిక్స్ కొనుక్కోవాలి అని ఏడిస్తే .. నీకు కొనిస్తాగా అనేది .  ఖమ్మంలో వై . ఎన్ . ప్రెస్ అని ప్రింటింగ్ ప్రెస్ / బుక్ షాప్ ఉండేది . వాళ్ళదగ్గర రష్యన్ పబ్లికేషన్ వో , వారి స్వంత పబ్లికేషనో గుర్తు లేదు కానీ , పెద్ద పెద్ద అక్షరాలతో , ఇంగ్లీషు , తెలుగు లలో కథల పుస్తకాలు దొరికేవి . డాక్టర్ చిలకమ్మ, జిత్తులమారి నక్క , తెలివైన కోతి అనే టైటిల్స్ వుండేవి .అవి ఒక్కో పుస్తకం పది పేజీలే ఉండేవి . పిల్లలు చదువుకునేందుకు , మంచి రంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉండేవి .ఖరీదు కూడా చాలా తక్కువ . పావలాకి ఒకటి . మేం బాగా కొనుక్కునే వాళ్ళం . సావిత్రి మా రెండో అన్నయ్యని , ఒక చేతి సంచి తీసుకొని వెళ్ళేది . వై ఎన్ ప్రెస్ ఎప్పుడు  కిటకిట లాడుతూ ఉండేది . వాళ్ళు కామిక్స్ అనగానే ఒక కట్ట తీసేవారు . అందులో చాలా పుస్తకాలు ఉండేవి .. మరి ఒక్కో పుస్తకం పది , పన్నెండు పెజీలేగా . చూసుకొని తీసుకుంటాం అని కట్ట తీసుకొని , మధ్యలో నుండి ఒక పది పుస్తకాలు లాగి , బాగ్ లో వేసేది .. అట్లా
చాలా బుక్స్ కొట్టేసేది . కొన్ని సార్లు హిందీ వి , అంతకు ముందు కొన్నవే వచ్చేవి .. ప్రెస్ వాళ్ళు ఎప్పుడు గమనించలేదు .. మా సావిత్రి పట్టు బడలేదు . కానీ ఇంట్లో దొరికి పోయి తిట్లు బాగా తినేది . ఎవరికి సావిత్రి మీద  కోపం వచ్చినా , తను చేసిన , దాచిన సీక్రెట్ చెప్పెసేవారు అమ్మమ్మకి .. అమ్మమ్మ నాలుగు దంచేది కూడా !

           పాలలో సాయిబాబా (సత్య సాయి ) కనిపించాడు అని పెద్దవాళ్ళని కూడా నమ్మించింది ఒకసారి . తాతయ్యకు చాలా సీరియస్ గా ఉందని , పెద్ద వాళ్ళంతా హాస్పిటల్ లో ఉన్నారు . తాతయ్య ఇక కొన్ని రోజుల్లో పోతారని తెలిసింది . తాతమ్మ ,
మేము ఇంట్లో , భయం భయంగా బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాము . సావిత్రి , "పాలల్లో సాయిబాబా కనిపించారు నాకు . భజన చేస్తే , బాపు (నాన్న ) కి ఏమీ కాదుట .." అంది . తాతయ్య , అమ్మమ్మ సత్య సాయిని బాగా నమ్మే వారు . నీకు బాబా ఎలా కనిపించాడు
? మాకూ చూపించు అని అందరూ అడిగారు
. పాలగిన్నే తెచ్చి లైటు వెలుతురు కింద పెట్టింది . వెడల్పుగా ఉన్న గిన్నెలో , బాబా తల ఆకారంలో నీడ కనిపించింది . అంటే ఆయన తల ఆకారం .. ఇక రోజంతా బాబా భజనలే .. తరువాత ఎవరో .. "అంతా వట్టిదే ..ఏ వెడల్పు గిన్నెలో అయినా , వెలుతురు లో పాల నీడ , అలాగే ఉంటుంది .. మనం గమమిచం " అన్నారు . మళ్ళీ నిలదీస్తే , "నాకు బాబా కనిపించి , మాట్లాడినట్లు
అనిపించింది " అంది ..

       ఇలా మా సావిత్రి ఆగడాలు , అల్లరి పనులు .. కో కొల్లలు . కొన్ని సరదాగా షేర్ చేసాను మీ అందరికీ ..

No comments:

Post a Comment