Monday 2 May 2016

💦💦💦💦 చెలిమ నీరు -1 💦💦💦💦💦

💦💦💦 చెలిమ నీరు 💦💦💦💦💦

ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలుగా వర్షాల్లేక , భూగర్భ జలాలు అడుగంటిపోయి , నీటి ఎద్దడి విపరీతంగా పెరిగిపోయింది . చుక్కనీటికోసం మనుషులు , జంతువులు ఇంకా పక్షులు అల్లాడిపోతున్నారు . వర్షాలు పడితే అతివృష్టి , పడకపోతే అనా వృష్టి అతి సాధారణమై పోయింది మనదేశంలో . ఎందుకిలా ? సైన్సు ఇంతగా అభివృద్ధి చెందినా , జలవనరుల పొదుపు , జాగ్రత్త , వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడం లోని మెళకువలు , ఎందుకు మెరుగు పర్చుకోలేక పోతున్నాం ? మురుగునీటి వ్యవస్థ సరిగ్గాలేక ,చిన్న వర్షాలకే రోడ్లు , ఇళ్ళు , మునిగిపోతాయి . అప్పటికప్పుడు , తాత్కాలిక చర్యలతో సరి . మరుసటి ఏడు వర్షాభావం .. మళ్ళీ వర్షాలు పడితే గానీ , వేడి పుట్టదు. మళ్ళీ మరుసటేడు ఇంకో ప్రభుత్వం వస్తుంది .. తప్పంతా పాత ప్రభుత్వానిదే .. వీళ్ళూ ఏమీ చేయరు . ఈ విష చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది . ఇక్కడ మనుషుల జీవితాలకు , 

ప్రాణాలకు విలువ , భద్రత లేవు మరి !

           నాకు ఉపన్యాసాలు , ఆవేశపూరిత కవితలూ , ప్రశ్నించడం రాదు . బాధ వుంటుంది .. కానీ కవితలు రాయను /రాయలేను కూడా..ఎవరైనా రాస్తే వారితో బాధను పంచుకోగలను. అంతే ..

           మన దేశంలోని ప్రస్తుత నీటి సమస్య  కొత్తదేమీ కాదు . ఇంతకు ముందు , ఇప్పుడు , ఇకముందు కూడా ఉంటుంది . నాకు 6,7 సంవత్సరాల వయసున్నప్పుడు , ఎండాకాలం సెలవలకి మా అమ్మమ్మగారి వూరు వెళ్లాం . అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడం అందరికీ ఇష్టమే కదా . కానీ నాకు కొంత అయిష్టం వుండేది . ఇష్టం లేకపోయినా వెళ్లాల్సి వచ్చేది . అమ్మా , నాన్నా దక్షిణ దేశ యాత్రలూ , ఉత్తర దేశయాత్రలూ చేసేవారు . చెల్లి చిన్నది కాబట్టి అమ్మతో వెళ్ళేది . మిగిలిన నలుగురం కేరాఫ్ అమ్మమ్మ వూరు .

        మరి ఎందుకు ఇష్టం ఉండదూ అక్కడికి వెళ్ళడం ?  అక్కడ తిండి సమస్య , నీటి సమస్య , నిద్ర సమస్య .. టైం పాస్ కూడా సమస్యే !! తిండి సమస్య ఏంటంటే .. అమ్మమ్మ వాళ్లకు పాడి సమృద్ధి లేదు . రెండు ఆవులు పాలు ఇచ్చేవి . నీళ్ళపాలు .. మొత్తం కలిపి 1 లీటర్ కూడా ఉండేవి కావు . కొందామన్నా దొరకని పల్లెటూరు . నీటి ఎద్దడి . గడ్డి దొరక్కపోతే అవి పాలు ఎలా ఇస్తాయి ? ( ఇదంతా పెద్దయ్యాక వచ్చిన జ్ఞానం .. అప్పట్లో తెలిసేది కాదు ) . మాకు పాడి బాగా ఉండేది . మీగడతో గడ్డ  పెరుగు , పెరట్లో అమ్మ అన్ని రకాల ఆకు కూరలూ , కాయగూరలూ పండించేది . పైగా  జనం బాగా వచ్చిపోయే యిల్లు. ఉదయం టిఫిన్లూ , మధ్యాహ్నం రెండుకూరాలూ , పప్పు , పచ్చడి , నెయ్యి , పెరుగు ,వూరగాయలతో భోజనం.సాయంత్రం చిరు తిళ్ళు .. డబ్బాలకు డబ్బాలు చేసేది అమ్మ .  అమ్మమ్మ వాళ్ళింటికి వెళితే నో కాఫీ . మాకు పాలు తాగే అలవాటు చిన్నప్పటినుండీ లేదు . మా వంశంలోనే లేదు అని అమ్మ వెక్కిరించేది కూడా .. చిన్నప్పటినుండీ , గ్లాసు పాలల్లో కాఫీ వేస్తేనే తాగడం , లేకపోతే కక్కడం . విసుగు పుట్టి కాఫీలే తాగి చావండి అనుకుందేమో మరి . అమ్మమ్మ వాళ్ళింట్లో నీళ్ళ పాలు . వాళ్ళందరికీ టీ తాగడమే అలవాటు . పొద్దున్నే టీ తాగడం అంటే ఆముదం త్రాగినట్లే వుండేది మా అందరికీ . నేను కాఫీ కావాలని ఏడ్చేదాన్ని.. అప్పుడు వాళ్ళ వూర్లో వున్నా ఒకే ఒక్క కిరాణా షాపులో నో కాఫీ పొడి . కాఫీ బిళ్లలు దొరికేవి . అవి దంచి , డికాషన్ చేస్తే .. కాఫీ అంటే విరక్తి పుట్టేది . కంపు వాసన , వాన నీళ్ళు లాగా , ఎర్రగా ..పల్చగా . అంతకంటే టీ నే బెస్ట్ అనుకునేవాళ్ళం . మా రెండో అన్నయ్య కాఫీ నల్లుల వాసన అనేవాడు . అంత ఘోరం . 

ఇక కూరలు దొరికేవి కావు . మా అమ్మ మాతో పాటే .. 4,5 కిలోల ఆలుగడ్డలు , దోసకాయలూ , దొండకాయలూ ఆకుకూరలూ పంపేది . కానీ ఎన్నిరోజులు వస్తాయి ? అమ్మమ్మ డయాబెటిక్  పేషంట్ . తొందరగా అలసిపోయి చెయ్యలేకపోయేది . పైగా మడి, ఆచారం . ఉదయం నో బ్రేక్ఫాస్ట్ . చద్దన్నం , ఆవకాయ , నీళ్ళ మజ్జిగ . చద్దన్నం మా ఇంట్లో అసలు తినేవాళ్ళం కాదు . అన్నం మిగిలితే చాకలికి ఇచ్చేసేది అమ్మ . స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూడా వేడి అన్నమే , ఏదైనా కూరా , పెరుగు.  పైగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎర్రచీమలు విపరీతం . అన్నం నీళ్ళల్లో పెట్టినా , అన్నానికి , మజ్జిగకీ , ఆఖరుకి ఆవకాయకి కూడా చీమలు పట్టేవి . చచ్చినట్లు అవే తినాలి . కళ్ళు 'పత్తికాయల్లా ' తెరుచుకుని , వంచిన తల ఎత్తకుండా .. చీమలు ఏరుకుని , తీసేసి తినాలిగా మరి .  మా ఇంట్లో భోజనాలప్పుడు గొడవలు , 

గ్లాసులు విరుకోవడాలూ ..తిట్లు .. యుద్ధాలు 

జరిగేవి . అక్కడ ఆ అవకాశమే లేదు . నిశ్శబ్ద యుద్ధం .. సాయంత్రం ఎంత ఆకలేసినా తినడానికి ఏమీ ఉండేవికావు . అమ్మమ్మ ఆకలి అంటే .." ఆకలేస్తే రోకలి మింగండి .. ఈ పిల్లలకి  కి ఆకలి దయ్యం పట్టింది " అనేది . మళ్ళీ రాత్రికి నీళ్ళ మజ్జిగ అన్నాలే . మా రెండో అన్నయ్య , "మా ఇంట్లో పెరుగన్నం తిని చెయ్యి కడుక్కుంటే ఇంతకంటే చిక్కగా వస్తాయి నీళ్ళు " అనే వాడు . మా అందరిలో తెలివిగా మాట్లాడగలిగేది తనే . నాకు ఏడుపు తప్ప ఇంకోటి వచ్చేది కాదు . నాకంటే చిన్నవాడు తమ్ముడు . పాపం ఎలా తినేవాడో .. వాడికి తెలిసేది కాదేమో కూడా .

(సశేషం ... చాలా రాయాలి మరి..మీకు ఒకేసారి చదవాలంటే కష్టం అని .... ఇలా ముక్కలు , ముక్కలు గా చెప్తాను...)

No comments:

Post a Comment