Wednesday 13 April 2016

ఉప్పుడు పిండి

                           🍚🌿🍚🌿 ఉప్పుడు పిండి  🌿🍚🌿🍚

ఉప్పుడు పిండి అంటే బియ్యం రవ్వతో చేసే , శనివారం ఫలహారం గుర్తొస్తుంది చాలా మందికి ..వరంగల్ సైడు వారు బియ్యప్పిండి తో చేస్తారు .. చాలా సులువుగా తయారయ్యే ఒక ఉపాహారమే ఇది .. చాలామందికి తెలియకపోవచ్చు ..పెద్ద వస్తుసామాగ్రి అవసరమూ ఉండదు .. బియ్యప్పిండి ఉంటేచాలు .. మూకుడులో కాస్త నూనె వేడిచేసి  , పోపు దినుసులు వేసి  వేయించి , ఒక కప్పు నీళ్ళు పోయాలి . ఉప్పువేసి , మరిగినతరువాత రెండు కప్పుల పిండి వేసి
బాగా కలపాలి . పొడి పొడిగా , కమ్మటి వాసనతో అయిదు నిముషాల్లోపే ఉప్పుడు పిండి తయారౌతుంది . అల్లము , పచ్చిమిర్చి
, కారట్లు, టమాటాలు , కరివేపాకు , కొత్తిమీర
లాంటివేమీ అక్కర్లేదు . .. కాసేపు సన్న
సెగమీద ఉంచితే .. ఘుమ ఘుమలాడే ఉప్పుడు పిండి తయారు . చిక్కటి / పల్చటి మజ్జిగ వేసుకుని తినాలి .. ఇంకేమీ అక్ఖర్లేదు .. నాకైతే చిన్న గ్లాసు పాలు వేసికుని తినడం ఇష్టం .. మా అమ్మకు లాగా.. మా
అన్నదమ్ములకీ , చెల్లికీ  ( అయిదుగురికీ ) ఈ వంట చాలా ఇష్టం . మా నాన్నకి ఇష్టం ఉండేది కాదు . ఎత్తు కెత్తు అల్లం పచ్చిమిర్చి , జీడిపప్పు నెయ్యి వే(పో) సిన ఉప్మా తప్ప !

        నేను .. చాలా సంవత్సరాల తరువాత బ్రేక్ఫాస్ట్ కి ఉప్పుడు పిండి చేసుకున్నా ..సో
వ్హాట్ ..అనేగా మీ ఎక్స్ ప్రెషన్ ? ఈ ఉప్పుడు పిండి అంటే ఇంత ఇష్టం కలగడానికి మరో ఫ్లాష్ బాక్ ఉంది ..
          మా అమ్మమ్మగారి పుట్టిల్లు వరంగల్ .
అక్కడ దేశముఖ్ వంశానికి చెందిన జమిందారులు వారు . మా అమ్మమ్మ తల్లిగారి పేరు తారాబాయి . మాకు బాగా బుద్ధితెలిసేవరకు అంటే 7,8 సం. వయసువరకు వారు జీవించి ఉన్నారు .  సన్నగా , తెల్లగా , తెల్లటి జుట్టి , తెల్ల రవిక , సన్నటి అంచు , చిన్న  గడులున్న ( చెక్స్) చీర
కాశ ( గోచీ ) పోసి కట్టుకునేది . ఎప్పుడు నోట్లో పాన్ , కళ్ళకు సుర్మా పెట్టుకునేది. బోసి నోరు, నవ్వు ముఖం .. ఎప్పుడు కోపం వచ్చేది కాదు పెద్దమ్మమ్మకి .. తాతమ్మ అనాలి కానీ , మా మామయ్యలు , పిన్ని వాళ్ళు అమ్మమ్మ అంటుంటే మాకూ అదే అలవాటు అయ్యింది .
       విచిత్రం ఏమిటంటే .., రజాకార్ల దాడులు , మత మార్పిడులు జరిగే రోజుల్లో ,
పెద్దమ్మమ్మ , ముత్తాతగారు , వారి పెద్ద కూతురు , కొడుకు లను ముస్లిం మతం లోకి
బలవంతంగా మార్చారట !  ఆ తరువాత కూడా వారు అవేపద్ధతులు పాటించారు .
 హిందూ ఆలయాలని దర్శించేవారు కాదు . హిందూ దేవుళ్ళని పూజించేవారు కాదు . రోజు 5 సార్లు నమాజు చేసేవారు . తలమీద చీరకొంగు జారనిచ్చేది కాదు . పేరంటాలు ,
బొట్టు ( భర్త ఉన్నప్పుడు )పెట్టుకోవడం ఏమీ చెయ్యలేదుట.  మేడలో కేవలం నల్లపూసలు వేసుకునేదట . మేము పుట్టకముందే ఆవిడ భర్త్రుహీన . ఆవిడ నమాజు చేస్తుంటే మేము ఆశ్చర్య పోయేవాళ్ళం . మరో విచిత్రం ఏమిటంటే , పెద్ద కూతురు , కొడుకు తరువాత పుట్టిన ముగ్గురు కూతుళ్ళు , (మా అమ్మమ్మ , మరో ఇద్దరు చెల్లెళ్ళు  )హిందువులుగా పెరిగారు . వారి పేర్లు , కట్టు , బొట్టు సాంప్రదాయం అంతా .. పెద్ద కూతురు రంజనీ బాయి . మా అమ్మమ్మ శారద , తరువాత ద్రౌపది , సుగుణ .. చూసారా తేడా ?  మా అమ్మకి పెద్దమ్మ అయిన రంజనీ బాయి గారి భర్త , పిల్లలు హిందూ బ్రాహ్మణ సాంప్రదాయం . ఆవిడ మాత్రం నమాజు చెయ్యడం , తల మీద కప్పుకోవడం , సుర్మ , పాన్ అంతా మహమ్మదీయ సాంప్రదాయం . కాకపోతే మాంసాహారం కాకుండా , సాత్వికమైన శాఖాహారులు .  ఎంత నిబద్ధత చూడండి బలవంతపు మార్పిడి అయినా .. ఎవరు చూడొచ్చారు వీరు మతం ఫాలో
అవుతున్నారా లేదా అని ? కానీ వారు అలా చేయలేదు .
    పెద్దమ్మమ్మ పిల్లలందర్నీ ఎంతగా ప్రేమించేదో .. తన మనవలూ , ముని మనవలమైన మమ్మల్ని కూడా .. అనర్గళంగా కథలు చెప్పేది . సింద్ బాద్ , అరేబియన్ నైట్స్ కథలు , పంచ తంత్ర , తెనాలి రామ
లింగడి కథలు , ఎన్ని చెప్పేదో ! రాత్రి అవగానే అమ్మమ్మ చుట్టూ చేరే వాళ్ళం .
         అయితే ఆవిడ రాత్రిపూట అన్నం తినేది కాదు . చపాతీలు కూడా తినేది కాదు పళ్ళు లేవు కదా .. ఉప్పుడు పిండి చేసుకునేది .. నమాజు చేసుకునేది .. మళ్ళీ
మడీ , అంటూ , సొంటూ అనేది .. తనే కుంపటిమీద బుజ్జి గ్లాసుడు పిండి తో చేసుకునేది .. మాకు ఆవాసన ఘుమ ఘుమ బాగా నచ్చేది . వెంటనే ఆవిడ దగ్గర చేరి కొంచం పెట్టావా అమ్మమ్మా .. అని అడుక్కునే వాళ్ళం .. అమ్మా, పిన్నీ వాళ్ళు తిట్టేవారు . "ఆవిడ చేసుకునేదే చారెడు పిండి , దానికి కూడా
ఎగబడతారు , కరువుగొట్టు పిల్లలు " అని .. కానీ అవన్నీ తెలుసుకునే వయసు కాదు , తిండి యావ తప్ప .. "పోనీ లేవే , పిల్లల్ని తిట్టకండి " అని మాకు , పేపరు ముక్కల్లో గుప్పెఫు ఉప్పుడు పిండి , ఎత్తి పోసేది .. అంటు కదా మళ్ళీ ..ఎంత రుచిగా ఉండేదో ..ఆ మధురమైన రుచి ఎప్పటికీ మర్చిపోలేని విధంగా .. ఆ మాట మా అమ్మావాళ్ళు కూడా అనుకునేవారు ..
"అమ్మమ్మ ఉప్పుడు పిండి భలే చేస్తుంది "
అని .. నా కూతురు కూడా "అమ్మమ్మ ఉప్పుడు పిండి  సూపర్  గా చేస్తుంది "
అంటుంది .. మరి నా మనవళ్ళు
అసలు తిననే తినరు .. కాబట్టి నాకు ఆ చాన్స్ లేదు .. అమ్మ వంటా , అమ్మమ్మల వంటా .. వారి ప్రేమను
అనుభవించిన వారికే తెలుస్తాయి కదా !
ఇదీ ఉప్పుడు పిండి ఫ్లాష్ బాక్ ..

నేను చేసిన ఉప్పుడు పిండి కూడా ఓకే .. బానే ఉంది ..మీరూ ట్రై చెయ్యండి .. పాలతో తినడం మర్చిపోవద్దు  సుమా ..

No comments:

Post a Comment