Wednesday 13 April 2016

                       🍋నిమ్మకాయ పప్పు 🍋- నా డయటింగు 


   ఈ రోజు నిమ్మకాయ పప్పు ,కొబ్బరి పచ్చడి,కారట్  ఫ్రై  చేసా .(మేం అడిగామా మీరేం వండుకున్నారో ? రోజూ వండుకునేవి కూడా చెప్పి చావగొట్టాలా తల్లీ !) మధ్య మధ్య ఫేస్బుక్ లో ,గుడ్మార్నింగ్స్ , హాపీ బర్త్ డే ,లైక్స్, కామెంట్స్ పెడుతూ ..కష్టపడి వంట పూర్తిచేసా .. ఈలోపే మావారి ఫోన్ .."వంట అయ్యిందా ..భొయనానికి రావచ్చా "అని.  ఫాక్టరీ పక్కనే ఉన్నాయి మా క్వార్టర్స్  .టైం 12 గంటలే  అయ్యింది  .  ఉదయం మామిడి పండు ముక్కలు తిని వెళ్ళారు పాపం,ఆకలి వేస్తుందేమో అని.."సరే రండి "అన్నా.  ఈ మధ్య రోజూ బ్రేక్ఫాస్ట్ మాంగోనే .  మరి "పరకలు ,పరకలుగా "వస్తున్నాయి ఎవరో ఒకరు పంపించారని . "నాకు ఇంట్లో అభిమానులు లేరు గానీ , బయట చాలామంది ఉన్నారు " అంటున్టారాయన దెప్పి పొడుపుగా .. "మరిహనేఁ .. అవ్వే తింటే సరి. అనవసరంగా కుళ్ళ బెట్టడం ఎందుకూ ...." అని అవే బ్రేక్ఫాస్ట్ . 

                 5నిముషాల్లో వచ్చేసారు .. ఇద్దరం కలిసి తిందామంటే నాకు పొట్టలో అన్నం గంట మోగలేదు మరి .. 2 కొడితేనే గానీ ముద్దదిగదు నాకు. అందుకే ఆయనొక్కరికే పెట్టా . వేడి ,వేడి అన్నం లో నిమ్మకాయ పప్పు కలుపుతుంటే , కమ్మటి వాసన వచ్చి ,నోట్లో లాలాజలం వూరింది . 
          
                   ముద్ద నోట్లో పెట్టుకోకముందే , "బావుందా?" అని అడిగా . నామొహం లో ఆత్రతా ,నోరు వూరుతున్నట్లు గ్రహించి ,ఒక పెద్దముద్ద నా చేతిలో పెట్టారు . 'ఆమ్ ' అని మింగేసా .! ఎంత బావుందో .. నవ్వి మరో ముద్ద  కూడా పెట్టారు ..'గుటుక్' మనిపించా . (అబ్బ..దిష్టి పెట్టకండి బాబూ .. పెళ్ళయ్యి 30 యేళ్ళయ్యింది . ఆమాత్రం ప్రేమ ఉండదా ఏం ?) ;) 

                      ఇహ ఆయన ఆఫీస్ కి వెళ్ళగానే ,కంచం పెట్టుకుని ,అన్నం,నిమ్మకాయ పప్పు కలిపి పెద్ద వాయ లాగించా. ' ఆహా ఏమి రుచి ' అనుకుంటూ . ఎంతైనా నేను వంట బాగా చేస్తాను సుమండీ ( నీ మొహం నిమ్మకాయ పప్పుకి పేద్ద కళా కౌశలం ఏమీ అక్ఖర్లేదు లెస్తూ .. ) మళ్ళీ మరో పెద్దవాయి కొబ్బరి పచ్చడి కలిపి లాగించా .. కారెట్ కూర సంగతి పెరుగాన్నానినికి అప్పజెపుదాం లే అని . గడ్డపెరుగు తో భోజనం ముగించా. ' ఓస్ .. అన్నం తినడానికి అంత మొహం వాపిరి ఎందుకమ్మా ' అనేగా మీ సందేహపు డౌట నుమానం ? 
    
                   నేను రోజూ తినేది ' పులకాలు ' కదామరి .. అబ్బబ్బా  ఎవరి ' కాలూ ' కాదు . గోధుమ పుల్కాలు . రెండు  పూటలా అవే తినేది . " ఓహో అన్నం తింటే లావుగా , పుల్కాలు తింటే సన్నగా అయిపోతారా .." అంటారేమో.  సన్నబడటం మాట దేవుడెరుగు , నేను గ్యారంటీగా లావు అవుతాను . ఎందుకంటే అన్నం అనేసరికి ఊరగాయలు కలిపి మరో రెండు వాయలు  ఎక్కువతింటాను . అదీ భయం . పుల్కాలైతే  రెండింటి తో సరిపెట్టవచ్చు . 
                    " ఆ( .. మరీ చోద్యం కాకపోతే .. ఇప్పుడు సన్నబడి మోడలింగ్ చెయ్యాలా ఏంటీ " అంటూ దీర్ఘాలు తీస్తున్నారా ? ( అంతసీను లేదు పాపా .. ఎప్పుడో ఏజ్ బార్ అయ్యింది ) . మోడలింగ్ చెయ్యక్ఖర్లేదు గానీ , ఇంకాలావు కాకుండా ఉంటే చాలు బాబూ .. మొన్నామధ్య జలుబు చేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు , ఈసీజీ, స్కానిన్గూ ,థైరాయిడ్ ,షుగరూ ,బీపీ లాంటి టెస్టులన్నీ చేసి .. " ఎప్పటినుండి వెయిట్ పుటాన్ అయ్యారూ ..?" అని అడిగాడు . ఇది తెలుసుకోవడానికి ఇన్ని టెస్టు లెందుకు , అడిగితే నేనే చెప్పేదాన్నిగా .. అందుకే ఠక్కున " మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండీ సర్ .." అన్నా. డాక్టర్ గారు బీపీ వచ్చి పడిపోయారు పాపం. " మరే మనం పుట్టాక ముందునుండే ఓవర్ వెయిట్ !! ఏంచేస్తాం  చెప్పండి .. జీన్సు .. "
   
                         అదిగో ఆమాట అనగానే మానాన్న ఫోటోలో నుండే కోపంగా " నీ దుంప తెగ ,జీన్సూ , టీ షర్టూ  అంటూ మా వంశాన్ని బయటేస్తున్నావా  ? మాతాతయ్య లావు , నాయనమ్మ,లావు, మా నాన్న లావూ అని . మరి మీ అమ్మ పెట్టిన మీగడ పెరుగూ , వెన్నా ,ఆవకాయ ముద్దలూ ,డజన్ల కొద్దీ మింగిన వడలూ ,దోశలూ ఏమయ్యాయి ? అవితిని కాదా " అంటున్నాడు . సరే ,ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు లెండి . ఏదో ఇలా అనుభవిస్తున్నాం .
   
                          మా చిన్నప్పుడు మాఇంటికి వచ్చిన బందువొకాయన , మా అమ్మనడిగేవాడు . " ఏం పెడితే పిల్లలు ఇంత ఆరోగ్యంగా( లావుగా అనడానికి మొహమాటపడి ) అవుతారమ్మా .. మా పిల్లలు ఈసురోమన్నట్లు  ఉంటారు .." అని  . మా పెద్దన్నయ్యకి  ( చిన్నప్పుడు బాగాలావుగా,తెల్లగా , ముద్దుగా ఉండేవాడు ) వళ్ళుమండి , " పచ్చిగడ్డి , పళ్ళ తొక్కలు పెట్టండి " అన్నాడట !

                          సరే ఏదైతేనేం ..ఈరొజు ఫుల్లుగా లాగించా. ఈజీగా ఒక 2 కిలోలు పెరిగే ఉంటా . ఇది రాస్తుంటే .. (సాయంత్రం నాలుగ్గంటలు )  కళ్ళు మూతలు పడిపోతున్నాయి .  హా( ఆఆఆఆ ... ని... ద్ద ... రొ .. స్తో ... న్ది .. గుడ్ నైట్ ..   :) 
        మా నాన్న " అందుకే మరి వళ్ళు తగ్గంది .. పగటినిద్ర మానుకో " అంటూ సణుగుతున్నారు . నాన్న ఫోటో నా లాప్టాప్ స్క్రీన్ మీదే ఉంటుంది . 

************* బ్రాకెట్స్ లో ఉన్నది నా స్వగతం అని మనవి .  

                                                                                                 ఉషారాణి నూతులపాటి 
                                                                                                      ( 29/ 05/2014 )

                    








No comments:

Post a Comment