Friday 22 September 2017

🌹☘🌺🌿🌷☘🌻🌿🌼☘🌸🌿🍁🍀మా బతుకమ్మ పండుగ కథలు 🌷☘🌺☘🌹🌿🌻☘🌼🌿🌸☘🍁🌿

🌺🌻🌸🌼🌷బతుకమ్మ పండుగ - 2 🌺🌸🌼🌻🌷

నాకు బతుకమ్మ పండుగంటే చాలా ఇష్టం . నాకూ , నా చెల్లెళ్లకు.. ఈ పండుగ తీపి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి . పోయిన సoవత్సరం  బతుకమ్మ పండుగ మా వూర్లో ఎలా చేసుకునేవాళ్ళమో కొంత రాసాను . దానికి మరి కొంత విషయాన్ని జోడించి , తిరిగి పంచుకోవాలనిపించింది . ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క పద్ధతి , ఆచారము అలవాట్లు వుంటాయి . హైదరాబాద్ లోని , ఇంకా ఇక్కడికి దగ్గిరగా ఉండే కరీంనగర్ , మెదక్ , రంగారెడ్డి , మెహబూబ్ నగర్ జిల్లాల పద్ధతి  కాస్త వేరుగా అనిపించింది నాకు . ఏదైనా స్థూలంగా " బతుకమ్మ పండుగ " సర్వ వర్ణాలవారూ కలిసి మెలసి , ఆనందంగా ఇచ్చి పుచ్చుకుంటూ , జరుపుకునే అచ్చమైన తెలంగాణా పండుగ ! ఒకరకంగా అమ్మవారిని (ఇక్కడివారు అమాయకులు , నిరక్షరాస్యులు కాబట్టి ..) పూలతోనే స్తుతిస్తూ జరుపుకునే నవరాత్రులే !

         "బతుకమ్మ పండుగ " తెలంగాణా పల్లెల్లో అతి వైభవంగా జరుపుకునేవారు. ఇక్కడ దసరా నవరాత్రుల కన్నా,  బతుకమ్మ చద్దులే ప్రాముఖ్యంగా వుండేవి. అలా అని  'దసరా' పండుగ లేదా అంటే ..అదీ జరుపుకున వాళ్ళం..కానీ రెండు రోజులే.. నవమి,  విజయ దశిమి...నవరాత్రులు,  అమ్మవారి పూజలూ అప్పట్లో నాకు తెలియదు..ఆమాట కొస్తే పెళ్ళయ్యే వరకూ కూడా తెలియదు.

          ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ  తొమ్మిది రోజులూ బతుకమ్మలను రంగు రంగుల పూలతో పేర్చి, స్రీలంతా సాయంకాలం ఒక దగ్గర చేరి,  బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, కోలాటా లాడుతూ, పాటలు పాడుతూ , తరువాత బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

             నాకు బతుకమ్మ పండుగంటే చాలా ఇష్టంగా, సరదాగా వుండేది.  దసరా సెలవలు / మూడునెల్ల సెలవలు అనేవాళ్ళం..మరి మూడునెల్ల పరీక్షలు అయ్యాక వచ్చే సెలవలు కదా.. ఇప్పుడు క్వార్టర్లీ / టెర్మ్ హాలీడేస్ కానీ, మేం గవర్నమెంటు స్కూల్, తెలుగు మీడియం బాపతయ్యే! సెలవలు మెదలైన రోజో మర్నాడో పండగ సీజన్ మొదలు. తెల్లవారుజామున లేచి, పూలు కోసేదాన్ని. మా ఇంట్లో చాలా పెద్ద పెరడు..అందులో పచ్చ గన్నేరు,  ఎర్ర గన్నేరు,  గరుడ వర్ధన.,  నంది వర్ధన, గోరింట, ముద్దబంతి , కారం బంతి, పట్నం బంతి,ముళ్లగోరింట,పున్నాగ పూలుండేవి. అవి కోసి వాటిమీద అమ్మ తడి చీర కప్పి (పూలు వడలి పోకుండా) , కాఫీ తాగి (చిన్నప్పటినుండి కాఫీ నే అలవాటు)  వెదురు బుట్ట తీసుకుని పారిజాతం పిన్ని దగ్గరకు పరుగెత్తే దాన్ని. పారిజాతం పిన్ని నాకంటే 5సం పెద్దదేమో అంతే..13 సం. వుంటాయనుకుంటా తనకి..ఇద్దరం కలిసి రెండు కి. మీ.దూరంలో వున్న వాళ్ళ తోటకి నడిచి వెళ్ళేవాళ్ళం..అక్కడ తేలుగొండి పూలూ,  తంగేడు పూలూ వుండేవి. వాళ్ళమిరప తోటలో అక్కడక్కడా బంతి పూలు కూడా వుండేవి.. దొరికినన్ని కోసుకుని, జామ కాయలు తింటూ వెనక్కు వచ్చేవాళ్ళం.. చేల మధ్యలో ఎక్కడన్నామంచి గుమ్మడి తీగ కనపడితే,  ఒకే ఒక్క పువ్వు (చెరోటి) కోసుకునేవాళ్ళం.. ఎందుకంటే బతుకమ్మ పేర్చాక, పైన గుమ్మడి పువ్వు వుంచి, దానిమీద పసుపు గౌరమ్మను ఉంచుతారు. గుమ్మడి పూలు ఎక్కవ కొయ్యకూడదు అనేది అమ్మ. మళ్ళీ కాయలు రావు కదా

            అమ్మకి నేను పూలకోసం తోటలూ, గట్లూ తిరగడం అస్సలు  నచ్చేది కాదు..ఎందుకంటే పాములూ, తేళ్ళూ..వుంటాయని, ..నాన్నకి తెలిస్తే తిడతారని.  "జీతగాళ్ళను ఎలాగూ పంపిస్తా కదా.నువ్వు వద్దులేమ్మా .. " అని వారించినా నేను వినేదాన్ని కాదు.  నాకు సరదాగా వుండేది.ఎవరో తెచ్చినవాటికన్నా,  నాచేతులతో కోసి తేవడం లో వుండే తృప్తి అనుకుంటా..

             అమ్మ తొమ్మిది రోజులూ మడిగా వంటచేసి,  ఒక ప్లేట్ లో పసుపు గౌరమ్మను,  కొన్ని పూలను పెట్టి, పూజ చేసి,  నైవేద్యం పెట్టేది. మధ్యాహ్నం భోజనాలయ్యాక,  ఇత్తడి స్థాంబాళం ( పెద్ద ప్లేట్) ,  దానిమీద వెడల్పైన గుమ్మడి ఆకులో,  కలువ.ఆకులో పరిచి,  ప్లేట్ చుట్టూ తంగేడు, గన్నేరు రంగు రంగుల పూలు పేరుస్తారు. మధ్యలో ఎత్తు పెరగడం కోసం,  పూలు నిలవడం కోసం తంగేడు ఆకులూ,  పిప్పింటాకూ.. (బాగా దొరికే గడ్డిమొక్క)  వేసి అందంగా పేర్చేది అమ్మ. బతుకమ్మకు జతగా, చిన్న తోడు మరో ప్లేట్ లో , కొద్దిపూలతో పేర్చేది. దేవుడి ముందు పీటమీద పెట్టి గౌరమ్మను ఉంచి, రెడీ గా పెట్టేది..సాయంత్రం ఐదు గంటలకల్లా మా వూరి గుడి రామాలయం లో "బతుకమ్మ "ఆట.

           నేనేమో చక్కగాపట్టు పరికిణీ, నగలూ, అమ్మేమో పట్టు చీర కట్టుకుని తయారై , మా చాకలి బతుకమ్మను తల.మీద పెట్టుకొని వెంట వస్తుంటే..ఠీవిగా..వెళ్ళేదాన్ని..మర్ నేను కోసుకొచ్చిన పూలతో తయారైన (జీతగాళ్ళు తెచ్చిన తంగేడు పూలే ఎక్కువ వుండేవి..అయినా సరే..) పెద్ద బతుకమ్మ అని గర్వం..కానీ చాలా సార్లు మా బతుకమ్మ కంటే,  బ్రాహ్మణ రంగయ్య ( పౌరోహిత్యం చేసేవారు)  గారింటి బతుకమ్మ కొంచెం పెద్దగా వుండేది.. నేను చిన్నబుచ్చకునేదాన్ని..కానీ ఆ ఇంటి అన్నమ్మ నాకు స్నేహితురాలే కాబట్టి సర్దుకునేదాన్ని.

                గుడిముందు శుభ్రంగా ఊడ్చి,  నీళ్ళు చల్లేవారు. మధ్యలో చెరువులోని నల్ల మట్టి తెచ్చివెంపలి చెట్టు కొమ్మ గుచ్చేవారు.వెంపలి చెట్టు కొమ్మచుట్టూ బతుకమ్మలను ఉంచి, ప్రథమ పూజ అమ్మే చేసేది..అమ్మ సర్పంచి గారి భార్య అనో, అందరిలోకి కలివిడిగా వుండేదనో,  కాస్త బాగా చదుకుందనో..అన్ని కలగలిసిన కారణమో... పసుపు, కుంకుమ, అక్షతలు,  వత్తి పత్తి..అందరూ వేసి..పూలు జల్లుతూ పాటలు మొదలెట్టేవారు..ముందు పెద్ద ముత్తైదువ ఎవరుంటే వారు పాడేవారు..మిగిలిన వారు కోరస్.. కొన్నిసార్లు బ్రతిమిలాడుకునేవారు.... " నువ్వు పాడు పిన్నీ.. " "అయ్యో గౌంతు బాలేదే..నువ్వు పాడవే సరనూ " అంటూ..

                    నేను వెయిట్ చేస్తూ వుండేదాన్ని...ముందు ఇద్దరు పాడగానే ఇక ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా,  ఒకదానివెంట.మరోటి...అమ్మ తిట్టేది. " అందర్నీ పాడనివ్వూ  "  అని... అప్పుడు ఒక నిముషం సేపు చూసి మళ్ళీ అందుకునే దాన్ని.. దాంతో ఏ పాటలు పాడాలో ముందే ప్రిపేర్ అయి మరీ వచ్చేవారు.
         
       ( ఇప్పటికే చాలా రాసాను కదా..మరికొంత మరో పోస్ట్ లో చెప్తాను..)

No comments:

Post a Comment