Friday 22 September 2017

🌷🌺🌹🌸🌻బతుకమ్మ పండుగ కథ🌷🌺🌹🌻🌸🌼

,🌹🌺🌷🌻🌸🌼-మా బతుకమ్మ పండుగ కథలు 🌹🌺🌻🌷🌼🌸-
🌹🌺🌻🌷🌼🌸-బతుకమ్మ కథ -🌹🌺🌻🌷🌼🌸

బతుకమ్మ పండుగ ఎందుకు మొదలైంది?  అసలు తెలంగాణాలో ఇంత వేడుకగా, ఇష్టంగా ఈ పండుగ జరుపుకోవడానికి కారణమేంటీ.?  అది కూడా బతుకమ్మ పాటలలోనే కనిపిస్తుంది. అక్కెమ్మ అనే యువతి బలిదానం వల్ల,  నదికి వరదలు తగ్గి,
ఆమె కుటుంబం , గ్రామం రక్షింప బడ్డాయి. క్రింద ఇచ్చిన పాట లో ఆ చరిత్ర కథ చదవ వచ్చు..

పేదరాశి పెద్దమ్మ ఉయ్యాలో - ఎందరే కొడుకులూ ఉయ్యాలా
ఎందరెక్కడిదమ్మ.ఉయ్యాలో -ఏడుగురు కొడుకులూ ఉయ్యాలా
ఏడుగురు కొడుకుల తోడ ఉయ్యాలో - ఒక్కతే అక్కెమ్మ ఉయ్యలా
ధర్మపురి మా తల్లి ఉయ్యాలో- ధనం పెట్టెలిచ్చిరి ఉయ్యాలా
ధనం పెట్టెలుదీస్కోని ఉయ్యాలో- పాలేరు దాకొస్తిమి ఉయ్యాలా
వరదనీరొచ్చెనే ఉయ్యాలో - పాలేరు పొంగెనే ఉయ్యాలా
ధనం పెట్టెలిస్తాము ఉయ్యాలో - తియ్యవే పాలేర ఉయ్యాలా
అట్లంటె పాలేరు ఉయ్యాలో - మరి అగ్గళించింది ఉయ్యాలా
ఏడుగురు అన్నదమ్ములనిస్తాము ఉయ్యాలో- తియ్యవే పాలేర ఉయ్యాలా
అట్లంటె పాలేరు ఉయ్యాలో - మరి అగ్గళించింది ఉయ్యాలా
ఏడుగురు కోడళ్ళనిస్తాము ఉయ్యాలో -తియ్యవే పాలేర ఉయ్యలా
అట్లంటె పాలేరు ఉయ్యాలో - మరి అగ్గళించింది ఉయ్యాలా
తల్లిదండ్రులనిస్తాము ఉయ్యాలో -తియ్యవే పాలేరు ఉయ్యాల
అట్లంటె పాలేరు ఉయ్యాలో - మరి అగ్గళించింది ఉయ్యాలా
అట్లైతె పాలేర ఉయ్యాలో - అక్కెమ్మ విస్తాము ఉయ్యాలా
అట్లంటె పాలేరు ఉయ్యాలో - చప్పున్నా దీసె ఉయ్యాలా
ధనంపెట్టెల్ద్జీస్కోని ఉయ్యాలో - ఇంటికే తిరగొచ్చిరీ ఉయ్యలా
(ఒకనాడు ఏడవ అన్న,  తాము ఇచ్చిన మాట ప్రకారం
అక్కెమ్మను నిజంగా  'పాలేరుకు ' బలి ఇవ్వడానికి సిధ్ధం
చేయబోతాడు..)
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో - చెల్లికి తలంటి బోయి ఉయ్యాలా
నిన్న బోస్తిన కొడుక ఉయ్యలో -ఈవేళ ఏమయ్యే ఉయ్యాలా
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో - చెల్లికి తలా దువ్వె ఉయ్యాలా
నిన్న దువ్వితి కొడుక ఉయ్యలో -ఈవేళ ఏమయ్యే ఉయ్యాలా
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో -చెల్లికి బొట్టూ పెట్టూ ఉయ్యాలా
నిన్న పెట్టితి కొడుక ఉయ్యలో -ఈవేళ ఏమయ్యే ఉయ్యాలా
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో -చెల్లికి చీరాగట్టూ ఉయ్యాలా
నిన్న గట్టితి కొడుక ఉయ్యలో -ఈవేళ ఏమయ్యే ఉయ్యాలా

అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో -చెల్లికి చద్దీగట్టూ ఉయ్యాలా
చద్ది గట్టితి కొడక ఉయ్యాలో - చల్లంగ తినబెట్టు ఉయ్యాలా
అమ్మరో ఓయమ్మ ఉయ్యాలో -చెల్లికి బిందే నివ్వు ఉయ్యాలా
బిందెనిస్తిని కొడుక ఉయ్యాలో - చెల్లి జాగర్త  కొడుక ఉయ్యాలా
అక్కెమ్మను దీస్కోని ఉయ్యాలో -పాలేరు దగ్గరకొచ్చె ఉయ్యాలా
బిందె చెల్లీకిచ్చి ఉయ్యాలో - నీళ్ళు నింపామానె ఉయ్యాలా
పాదాలవరకొచ్చె ఉయ్యాలో-బిందే నిండాదన్నా ఉయ్యాలా
మరి కాస్త బో చెల్లి ఉయ్యాలో బిందే నిండూనమ్మ ఉయ్యాలా
నడుములా వరకొచ్చే  ఉయ్యలో - బిందె మునగా దన్న ఉయ్యాలా

మరి కాస్త బో చెల్లి ఉయ్యాలో బిందే నిండూనమ్మ ఉయ్యాలా
కుతికలా వరకొచ్చే ఉయ్యాలో -బిందే మునగాదన్న ఉయ్యాలా
మరి కాస్త బో చెల్లి ఉయ్యాలో బిందే నిండూనమ్మ ఉయ్యాలా
నేను మునగావస్తి ఉయ్యలో - బిందె మునగాాదన్న ఉయ్యలా
మరి కాస్త బో చెల్లి ఉయ్యాలో బిందే నిండూనమ్మ ఉయ్యాలా
నాతల్లి దండ్రులకు ఉయ్యాలో -బిడ్డ లేదని చెప్పు ఉయ్యాలా
నీ బావమరిదికీ ఉయ్యాలో -భార్య లేదని చెప్పు ఉయ్యాలా
ఆరుగురు అన్నలకు ఉయ్యలో -చెల్లి లేదని చెప్పు ఉయ్యాలా
ఏడుగురు వదినలకు ఉయ్యలో -మరదలు లేదని చెప్పు ఉయ్యాలా
తొట్టిలో బాలునకు ఉయ్యలో -. తల్లి లేదని చెప్పు ఉయ్యలా
ఇరుగుపొరుగు అక్కలకు ఉయ్యాలో - అక్కెమ్మ లేదని చెప్పు ఉయ్యాలా
పాయెనే అకెమ్మ ఉయ్యాలో - పాలేరులో గలిసే ఉయ్యాలా..

ఇది అక్కెమ్మ కన్నీటి కథ!  అక్కెమ్మ నీటిలో కలిసినా తనవారందరినీ రక్షించుకుంది.  అందరి "బ్రతుకు "ను కోరింది కాబట్టి "బ్రతుకమ్మ " పండుగ జరుపుకుంటారు సామూహికంగా.. కులమతాల కతీతంగా.
_____________________________________________

------------------మరో కథ -----—----------

ఒకా నొక పుణ్యదంపతులకి ఏడుగురు కొడుకులు,  ఒక్కతే కూతురు.
కొడుకుల తరవాత, ఆఖర్న పుట్టిన ఆడపిల్ల సుశీలను చాలా గారాబంగా పెంచుకున్నారు.
కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి,  కూతురుకు కూడా పెళ్ళి చేసి కాశీయాత్రకు భయలుదేరి వెళతారు..

          ఆశ్వీజమాసంలో బతుకమ్మ పండుగ వచ్చింది. తల్లతండ్రులు దగ్గరలో లేరు కాబట్టి సుశీల, పెద్ద వదిన దగ్గరకు వెళ్ళి.. "పట్టుచీర, పట్టు రవికె, కాళ్ళకడియలు "
మొ. కావాలని అడుగుతుంది. ఆమె  కోపంగా మొహం తిప్పుకుని "నా దగ్గర లేవు"
అంటుంది.  అలాగే ఆరుగురు వదినలూ  "మా దగ్గర లేవు " అంటారు. ఏడవ వదిన మాత్రం" నేను ఇస్తాను కానీ పట్టు రవికెకు గంధం అంటకూడదు,  పట్టు చీర కు పసుపు అంటరాదు,  భంగారు కడియాలు నొక్కులు పడరాదు .,  అలా అయితేనే ఇస్తాను. ఒక వేళ అలా జరిగితే మాత్రం నీ నెత్తురు కళ్ళ జూస్తాను, గుర్తు పెట్టుకో.. "..  సుశీల వదిన గారి ఆంక్షలన్నీ సంతోషంగా ఒప్పుకొని,  నగలు,  చీరా,  రవికా తీసుకొని వెళ్ళింది.

          ఎనిమిదిరోజులూ బతుకమ్మ ఆడింది కానీ,  కాళ్ళకు పసుపు రాసుకోలేదు.. మెడకు గంధం పూయనివ్వలేదు.. స్నేహితురాళ్ళతో 'బిస్తి ' గీయలేదు..వారు ఎంత అడిగినా ఒప్పుకోలేదు..వదినగారికి ఇచ్చిన మాట కోసం..
కానీ చద్దుల బతుకమ్మ నాడు స్నేహితులు పట్టుబట్టి సుశీల మెడకి గంధం,  కాళ్ళకి పసుపు పూసి,  బిస్తి గీయించి (ఆడపిల్లల.ఆట..రెండు చేతులూ బిగించి పట్టుకుని
 పాదాలు నేలకానించి, చుట్టూ తిరగడాన్ని బిస్తి గీయడం అంటారు) ,  ఆట లాడించి గానీ వదల్లేదు.

                కానీ సుశీల రవికెకు గంధం, చీరకు పసుపు , బంగారు కడియాలకు నొక్కులూ పడ్డాయి.సుశీల భయపడి వదినగారు పనిలో వున్నప్పుడు  అవి తిరిగి ఇచ్చేసింది. తరువాత చూసుకున్న వదినకి చాలా కోపం వచ్చి పట్టు చీర రవికా
చింపి తలకు, వాసెన గట్టి పడుకుంటుంది. కాసేపటికి భర్త వచ్చి "ఏమైంది " అని అడుగుతాడు...ఆమె తలనొప్పి అని చెప్తుంది.. "ఏం రాస్తే తగ్గుతుంది? " అని అడుగుతాడు.. "నెత్తురు రాస్తే తగ్గుతుంది. "  "ఏ నెత్తురు కావాలి   ?  "
అంటాడు.. "నీ చెల్లి రక్తం తెస్తే తగ్గుతుందీ " అంటుంది.
ఒక్కగానొక్క గారాల చెల్లి సుశీల..ఆమె రక్తం ఎలా తీస్తాడు..
??
మర్నాడు అడవికి పోయి, కాకి ని చంపి ఆ నెత్తురు తెచ్చి ఇస్తాడు.
సంతోషంగా లేచి,  భర్తకి వంట చేసి పెట్టి, ఆనెత్తరు నుదుటికి పట్టించి ,
కడవ తీసుకుని నీళ్ళకు వెళ్ళింది.
"కట్లా కట్లా కడవ.తీసుకొని
మెట్లా భావికి నీళ్ళకి పోతే..
కలవారి కోడలు కాకి నెత్తురు పెట్టుకుందీ "....
అని అందరూ నవ్వుతారు.
మళ్ళీ తలకి వాసెన గట్టి పడుకుంటుంది.
భర్త మళ్ళీ అడుగుతాడు.. ఆమె నీ చెల్లి రక్తం కావాలి అంటుంది.
మర్నాడు పిట్ట రక్తం తెచ్చి, అది మా చెల్లిదే అంటాడు.
ఆమె ఆ రక్తాన్ని నుదుటికి పట్టించి కడవతో నీళ్ళకు వెళుతుంది.
మళ్ళీ అందరూ..
  "కట్లా కట్లా కడవ.తీసుకొని
మెట్లా భావికి నీళ్ళకి పోతే..
కలవారి కోడలు పిట్ట నెత్తురు పెట్టుకొచ్చిందీ "....
అని  నవ్వుతారు.
మళ్ళీ కోపంతో ఇంటికి వచ్చి , భర్త ముందు ఉరి పోసుకుంటానని బెదిరిస్తంది.
అప్పుడు  భర్త, ఈ సారి చెల్లిని చంపి,  ఆమె రక్తమే తెస్తానని మాట ఇచ్చి ..
సూది, దబ్బనం,  కత్తి,  నువ్వులు,  పెరుగన్నం  మూట గట్టుకోని,
చెల్లి దగ్గరకు వచ్చి "మీ అత్తింటి వారు తీసుకొని రమ్మన్నారు " అని చెప్పి బయలుదేరదీస్తాడు. సుశీల నిజంగా భర్త దగ్గరకే వెళుతున్ననని సంతోషంగా బయలుదేరుతుంది.  అడవికి చేరుకోగానే పెరుగన్నం తినమంటాడు.
తింటుంది. అలసిన సుశీల నిద్రకు పక్రమించగానే,  వడిలో పడుకో బెట్టుకొని నువ్వులు తలలో పోసి కుక్కడం మొదలు పెడతాడు.. పేలు కుక్కినట్లు..అలా చేస్తే గాఢమైన నిద్ర పడుతుందట..
సుశీల నిద్ర పోగానే సూది తో గుచ్చుతాడు... రక్తం రాదు..
దబ్బనం తో గుచ్చతాడు.. రక్తం రాదు కానీ సుశీల నిద్ర లేచి.
 "అన్నా, .నన్ను.చంపడానికి ఇంత కష్టం ఎందుకూ...
కత్తితో ఒకేసారి చంపరాదా..నా నెత్తరు తీసుకెళ్ళి వదినకి ఇవ్వు.  "
అప్పుడు కత్తితో పొడిచి రక్తం తీసుకుని వెళ్ళిపోతాడు.
మరణించిన
సుశీల పొట్ట చేద బావిగా,
కాళ్ళూ చేతులు  చేద బొక్కెన, తాడూ,
కళ్ళు రామచిలుకలూ..
జుట్టు రంగు రంగుల పూల మొక్కలు గా మారి అందమైన తోట వెలుస్తుంది.
కాశీయాత్రకు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ,  ఈ తోట చూసి వెళ్ళేటప్పుడు
లేని తోట 6నెలల్లో ఎలా వచ్చిందా అని అబ్బుర పడతారు.
భావిలో నీరు త్రాగి సేద తీరుదామని,  చేద బొక్కెన భావిలో వేస్తాడు తండ్రి.
విచిత్రంగా బావిలోంచి మాటలు వినపడతాయి ..
 " ముట్టకు ముట్టకు ఓ నాన్నా,  ముడితే నీ చేయి కందేనూ
అంటకు అంటకు ఓనాన్నా .....అంటితే నీ చేయి కందేనూ " అంటూ..
అతను చేద వదిలేసి..తల్లికి ఇస్తాడు.
తల్లి నీళ్ళు తోడ బోయినా అలాగే వస్తాయి మాటలు.
బయటివారు ఎవరు ముట్టుకున్నా  ఏమీ వినపడటంలేదు.
తమ ఏడుగురు కొడుకులనూ,  కోడళ్ళనూ పిలుస్తారు.
ఆరుగురు కొడుకులూ,  కోడళ్ళూ ముట్టుకున్నా.
 "ముట్టకు ముట్టకు ఓ అన్నా.. / వదినా .."
అంటూ మాటలు వచ్చాయుి
ఏడో అన్న తాకినప్పుడు  " పాపకారి వదిన చెప్పిందని..
దోషకారి అన్నయ్యవు నీవే కదా నన్ను చంపిందీ.. "
అని మాటలు వినపడతాయి. సుశీల తల్లిదండ్రులు
జరిగినవన్నీ తెలుసుకొని,  సుశీల భర్తను పిలిపించి ఆమెకు
ఉత్తర క్రియలు జరిపిస్తారు. సుశీల భర్త శివ భక్తుడు.
తనను కూడా భగవదైక్యం చేసుకొమ్మని శివునికై తపస్సు చేస్తాడు.
శివ పార్వతులు ప్రత్యక్షమై,  నిష్కారణంగా మరణించిన సుశీల తిరిగి బ్రతికి వస్తుందని, అందుకు తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి,  గౌరీ దేవిని ఆట పాటలతో,
నైవేద్యాలతో ప్రీతి చెందేటట్లు చేయమని చెప్తారు.
అలా తొమ్మిది రోజులు బతుకమ్మను పూజించి, పసుపు గౌరమ్మను ఓల లాడించగానే,   సుశీల పన్నెండేళ్ళ బాలగా నడచి వస్తుంది.
ఆనందంగా ఆమెను అక్కున చేర్చుకుని...
అప్పటినుండీ ఆడ పిల్లలు తమ ఆయుష్షుకోసం..
గౌరీ దేవి శుభాసీస్సుల కోసం బతుకమ్మ ఆడుతారు.


No comments:

Post a Comment