Tuesday 9 October 2018

🌼🌺🌻🌷🌲మా బతుకమ్మ పండుగ కథలు౼8 .🌲🌹🥀🌺🌻🌼

🌲🌹🌲🌷 చద్దుల బతుకమ్మ  - తయారీ -8 🌷🌲🌹🌲

చూస్తూ ఉండగానే , మీరు నా బతుకమ్మ కథలు చదువుతుంటేనే 8 వ రోజు వచ్చేసింది . 9 వ రోజు చద్దుల బతుకమ్మ . ఆరోజు బతుకమ్మకు వీడ్కోలు . పెద్దగా పేర్చాలని , ఎవరికి వారికే , మన బతుకమ్మే ఎత్తుగా ఉండాలనే పట్టుదల .మా అమ్మకు టార్గెట్ నా ఎత్తు . ఎప్పుడు నన్ను పక్కన నిలబెట్టి ఎత్తు కోలుచుకునేది . చాలా వరకు సాధించేది కూడా .  3,4 అడుగుల ఎత్తు బతుకమ్మ , పూలతో పేర్చాలంటే ఎన్ని పువ్వులు కావాలి ? మా అమ్మకు మంది , మార్బలం ఉండేవి మరి . దీనికోసం ముగ్గురు మనుషులను నియోగించేది . ఒకరు చుట్టుపక్కల ఊర్లకి వెళ్లి , వూరు బయట
పూసే తంగేడు పూలు తేవాలి . ఒక పెద్ద బస్తా నిండా తేవాలి . పచ్చగా పూసినవే .. పాపం మా చాకలి పాపమ్మ భర్త ఆపని మీద
వెళ్లి , ఎలాగో సాధించేవాడు . ఇక మరో ఇద్దరు పని వారు గడ్డి పూలు తెచ్చేవారు . బతుకమ్మ పండుగకి ఒక 10 రోజుల ముందే , ఈ పూలు  తెచ్చేవారు . వీటిని గునుగు పూలు అంటారు . చిన్నగా గుత్తులుగా పూసే గడ్డి పూలు . మామూలుగా ఎవరూ పట్టించుకోరు . కానీ బతుకమ్మ సీజన్ లో ఈపూలే పెద్ద ఆకర్షణ ! ఎందుకంటే ఈపూలను కట్టలుగా కట్టి , నీట గా కట్ చేసి , రంగులు అద్ది , ఎండలో పెట్టి , బాగా ఎండిన తరువాత , ఒక తట్టలో దాచేది అమ్మ . పసుపు రంగు , ఆకు పచ్చ , ఊదా , ఎరుపు , రాణి పింక్ ఇలా బాగా  డార్క్ గా ఉండే రంగులు అద్ది , ఎండబెడితే , ఎండిన తరువాత కా స్త రంగు తగ్గేది . మా రెండో అన్నయ్య ఈ పనులు చేసేవాడు . మా అమ్మకి బాగా హెల్ప్ చేసేవాడు . తమ్ముడు సాయం చేయబోయినా , ఏదో పొరబాటు చేసి తిట్లు తినేవాడు . బతుకమ్మ ఎత్తు పెరగాలంటే తంగేడు పూలు , గునుగు పూలే ముఖ్యం  .  వాటిని చక్కని  కాoబినేషన్ లో పెర్చడమే ఒక గొప్ప కళ !  అప్పుడే బతుకమ్మ అందంగా కనిపిస్తుంది . చుట్టూ పూలు పెర్చినప్పుడు అవి ఎలా నిలుస్తాయి ? మధ్యన అంతా ఖాళీ కదా !
         
              అందుకోసం మరో గడ్డి చెట్టు , పల్లెల్లో విరివిగా ఎక్కడైనా పెరిగే పిప్పింటాకు కూడా ఒక బస్తాకు కోసుకోచ్చేవాళ్ళు . మా పెరట్లో ఉన్న పిప్పింటాకు మొత్తం ముందు
రోజుల్లో ఖతం అయిపోయేది మరి . చిన్న , గుండ్రటి ఆకులతో ఉండే పిప్పింటాకు కొమ్మలనుండి దూసి , బతుకమ్మ పేర్చడానికి ఉపయోగించేవారు . తంగేడు ఆకులు కూడా వాడేది అమ్మ .బతుకమ్మ పేర్చడానికి ఒక పెద్ద
స్థాoబాళ మ్  తీసుకొని , దానిమీద పెద్ద గుమ్మడి ఆకులు పరచి , బతుకమ్మ పేరుస్తారు . నీళ్ళల్లో వదిలినప్పుడు ఆ గుమ్మడాకు  మీద తేలుతుంది బతుకమ్మ . చద్దుల బతుకమ్మ కోసం బాగా పెద్ద సైజు  ఇత్తడి ప్లేటు తయారు
చేయించి , పెట్టుకునేవారు .  తంగేడు , గునుగు , బంతి పూలు , కారం బంతి , సీత జడలు , చామంతి , నది వర్ధన , గరుడ వర్ధన , ముద్ద ఒంటి రెక్క మందారాలు , తేలు గొండి , గోరింట , గన్నేరు , కట్ల పూలు ,
బీర , గుమ్మడి పూలు  మొదలైన రకాలు వాడేవారు బతుకమ్మ పేర్చడానికి .

         బతుకమ్మ పేర్చడం అందరికీ రాదు . ఓపిక , శ్రద్ధ , ఒడుపు తెలిసి ఉండాలి . ఏమాత్రం సరిగ్గా లేకపోయినా , పక్కకి ఒరిగి , పూలు కుప్పలా పడిపోతాయి . చాలా
ఇళ్ళలొ మగవారు పేర్చేవారు. మా ఇంట్లో అమ్మ ఒక్కతే పేర్చేది. మేము చుట్టూ కూర్చుని సాయం చేసేవాళ్ళం . మా బ్రాహ్మణవారి (వైదీకి )అత్తయ్య ఇంట్లో , రంగయ్య తాతయ్య
పేర్చేవాడు. చాలా బాగా పేర్చేవాడు . పైగా వాళ్ళ బతుకమ్మ , మా బతుకమ్మకంటే ఒక పిసరైనా  పెద్దగా ఉండేది . మా నాన్న , రామ
శాస్త్రి మామయ్యా ఒకేవయసు వారు . లక్ష్మప్పా (నాన్న ) ,రామప్పా ( మామయ్యా )నారప్పా ( నారాయణ రావు , మా బాబాయి ) అని పిలుచుకునేవారు . పిల్లలం మేము కూడా ఫ్రెండ్స్ .  అందుకే కుళ్ళు కోకుండా ( మనసులో నొచ్చుకున్నా ) , సర్దుకునేదాన్ని. వాళ్ళ అన్నమ్మ , నేను ఫ్రెండ్స్ .. అది నాకంటే చిన్నదే అయినా , నాతో ఎంతో బాగా ఉండేది , నేను చెప్పినట్లు వినేది 'సరే  వదినా ' అంటూ ..

            ఇలా రోజు వారి బతుకమ్మ ఆడుతూ , చద్దుల బతుకమ్మకి తయారీ , భారీ ఎత్తున చేసేది అమ్మ . మిగిలిన వాళ్ళు ఎలా చేసేవారో తెలియదు . మా ఇంట్లో మాత్రం
పిల్లలు , పెద్దలు , పనివాళ్ళు అందరూ  యమా బిజీ అన్న మాట !

రేపు చద్దుల బతుకమ్మని ఎలా సాగానంపుతారో తెలుసుకుటే ఆశ్చర్య పోతారు . మరి ఒక్కరోజు ఓపిక పట్టండి . అన్నట్టు రేపటితో ఈ సుత్తి కొట్టడం ఆపేస్తాను . ప్రామిస్ ...😃

No comments:

Post a Comment