Sunday, 7 May 2017

🐦🐦🐦🐒🐒అల్లరి కోతి-- డాక్టరు చిలకమ్మ🐒🐒🐦🐦🐦

అల్లరి కోతి🐒 --   డాక్టర్ చిలకమ్మ🐦


             మధ్యాన్నం కాస్త చల్లబడి , వర్షం జల్లు కురిసింది. పిల్లలకి ( ఆమాట కొస్తే నాకుకూడా ) వానలో తడవాలని , ఆడుకోవాలని... కానీ నాకు భయం..వీళ్ళకి జ్వరాలోస్తే
నాకే అవస్థ..అసలే చిన్నవాడికి జ్వరం కూడా..అందుకే వాళ్ళని వద్దని ఆపి, మనంమంచికథచెప్పుకుందామా..అనివాళ్ళని మెల్లగా బెడ్ రూమ్లోకి తీసుకెళ్ళి , AC వంకతో తలుపుకూడా వేసేసి, బంధించా.. మెల్లిగా కబుర్లులలోకి దింపా..వాళ్ళు ఊరుకుంటారా..'కథ చెప్పూ'అనినస పెట్టారు..సరే కథ చెప్పడం మొదలు పెట్టా..
             

                   ఒక అడవిలో ,పెద్దచెట్టుమీద కోతి ఒకటి ఉంటోంది. దానికి ఒక చిన్న పిల్లకోతి కూడా వుంది. అది వాళ్ళ అమ్మ చెప్పిన మాట అస్సలు వినదు ..బాగా
అల్లరి. కొమ్మలమీద దూకడం, దెబ్బలు తగిలించుకోవడం , కనిపించినవన్నీ నోట్లో
పెట్టుకోవడం , వస్తువులు విసిరెయ్యడం ,విరగ్గొట్టడం..అన్నీ అల్లరి పనులే. ఒకరోజు
బాగా వర్షం పడుతోంది.  అమ్మ కోతి , పిల్ల కోతికి వర్షం లో తడవ కూడదు , జ్వరం వస్తుంది..వెళ్ళవద్దు అని చెప్పింది.కానీ పిల్ల కోతి వినదు కదా..అది వద్దన్నా వినకుండా వర్షంలో బాగా ఆడింది.. మరి తడుస్తూ ఆడుకుంటే అప్పటికి బాగానే
వుంటుంది. హాపీగా.. కానీ సాయంత్రం అయ్యేసరికి బాగా జలుబుచేసి జ్వరం వచ్చింది. రాత్రంతా బాగా చలి ,జ్వరం..కోతిపిల్లకి చేవిలోకూడా బాగా నొప్పి వచ్చి తెల్లవార్లూ ఏడుస్తూ , బాధపడింది. ఉదయం వాళ్ళ అమ్మ ,వాడిని ఔల్ (గుడ్లగూబ )
డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన కోతి పిల్లను చూసి, జ్వరం బాగా వుంది, జలుబు వల్ల చెవిపోటు కూడా..అందుకే జ్వరం తగ్గే వరకు కోతి పిల్లకి ఆహారం ఏమీ ఇవ్వకూడదు. లంఖణం చేయించాలి అన్నమాట. తరువాత మిరియాలు, శో౦ఠి, తులసి , ఇంకా కొన్ని మూలికలు కలిపి ,కషాయం కాచి 3 సార్లు తాగించమని చెప్పాడు . కానీ ఆ కషాయం కారం గావుండి, కోతిపిల్ల తాగనని ఏడ్చి ,మొండి కేసింది. మరి మందు తాగక పోతే జ్వరం ఎలా తగ్గుతుంది,? తగ్గలేదు. బాగా
ఎక్కువయ్యింది. కోతి పిల్ల వాళ్ళమ్మకి బాగా దిగులేసింది. ఎలా తగ్గుతుంది పిల్లాడికీ అని.. ఇంతలో పక్కింటి ,మరో కోతి చెప్పింది. అడవిలోకి ఒక కొత్త డాక్టర్ వచ్చింది....
డాక్టర్ చిలకమ్మ అని. ఆవిడ బాగా చూస్తుందట , మీ అబ్బాయిని తీసుకెళ్ళు అని చెప్పింది. సరే అని తల్లి కోతి ,పిల్ల కోతిని తీసుకొని ,డాక్టర్ చిలకమ్మ దగ్గరికి వెళ్ళింది.

డాక్టర్ చిలకమ్మ నవ్వుతూ ,కోతి పిల్లను చూసి, చక్కగా పలకరించింది. అక్కడ వున్న బొమ్మలతో ఆడుకోమ్మంది. తరవాత దగ్గరికి పిలిచి, నోరు ,చెవులు పరీక్ష
చేసింది. కోతి పిల్ల ఆవిడ చెప్పినట్లు విన్నది .మరేమీ భయం లేదు తగ్గిపోతుంది అని చెప్పి , తియ్యటి టానిక్కు లు, సిరప్స్  ఇచ్చింది..( మా పిల్లల డాక్టర్ ..DR.రామసుబ్బయ్య గారు , వీళ్ళని అడిగి మీకు ఎ ఫ్లేవర్ కావాలీ అని అడిగి మరీ వాళ్ళకిష్టమైన ఫ్లేవర్ సిరప్స్ ఇస్తారు మరి..).తరవాత వాళ్ళ అమ్మతో బాగా వీక్ వున్నాడు మీ బాబు అందుకే యాపిల్స్ , బ్రెడ్ ఇవ్వండి. పాలు కూడా గోరువెచ్చగా
గ్లాసులోనే ఇవ్వండి ( సౌమిత్ బాటిల్ మానడం లేదు..),బాటిల్ లో తాగిస్తే ,బొజ్జ నొప్పి వస్తుంది..అస్సలు తాగకూడదు, గ్లాసులోనే తాగాలి ,గోరువెచ్చగా అని చెప్పింది.( సౌమిత్ వెంటనే ,నేను గ్లాసులోనే తాగుతా అనేసాడు..) . బాగా చల్లగావుంది కాబట్టి , వాడికి స్వెట్టర్ వేసి ,కాప్ కూడా పెట్టి ,బ్లాంకెట్ కప్పి
వెచ్చగావుంచాలి అని చెప్పింది. ఇంటికి రాగానే కోతి పిల్ల వాళ్ళమ్మ ,వాడికి బ్రెడ్ ,పాలు ఇచ్చి మందులు వేసింది. కానీ కోతిదగ్గర బ్లాంకెట్ ,స్వెట్టర్ ,కాప్ లేవు. ఆలోచించి  ఒక షీప్ (గొర్రె ) దగ్గరికి వెళ్లి , మా అబ్బాయికిజ్వరంవచ్చింది,కొంచం ఇస్తావా ,బ్లాంకెట్ చేయించుకుంటాను అన్నది. అప్పుడు షీప్ కొంచం వూల్
ఇచ్చింది. అదితీసుకొని ,బ్లాంకెట్ నేసె అతనిదగ్గరికి వెళ్లి బ్లాంకెట్ చేసి ఇస్తారా ,మా అబ్బాయి కోసం అని అడిగి , చేయించుకొంది. ఇంకా కాప్ ,స్వెట్టర్ కావాలి..అవి ఎవరిని అడగాలి అని ఆలోచించి..చాలా మంది పిల్లలని అడిగింది.ఎవ్వరూ మా దగ్గర లేవు అన్నారు. సిద్ధాంత్ ,సౌమిత్ పార్క్ లో ఆడుకొంటున్నారు.వాళ్ళ దగ్గరికి వెళ్లి ,మీదగ్గర స్వెట్టర్ ,కాప్ ఉన్నాయా అని అడిగింది .అప్పుడు సిద్ధాంత్ నాదగ్గర వుంది.
నాచిన్నప్పటిది ,నాకు పొట్టిగా అయ్యింది నేను ఇస్తాను అన్నాడు.సౌమిత్ నా దగ్గర
కాప్ వుంది నేను కూడా ఇస్తాను అన్నాడు..ఇద్దరూ ఇంటికి వచ్చి,అమ్మని అడిగి అవి
కోతికి ఇచ్చారు.కోతి చాలా సంతోషపడి , మీరు ఇద్దరూ మంచి అబ్బాయిలు. మీరంటే
నాకు చాలా ఇష్టం అనిచెప్పి , ఇంటికి వెళ్లి , వాళ్ళ అబ్బాయికి స్వెట్టర్ వేసి..( జలుబు చేసింది కాబట్టి బోజ్జకి ,వీపుకీ విక్స్ రాయాలట.సౌమిత్ ఉవాచ..), దాని కంటే ముందు బోజ్జకి ,వీపుకీ విక్స్ కూడా రాసి, కాప్ పెట్టి ,బ్లాంకెట్ కప్పి ,వెచ్చగా
పడుకోపెట్టింది . మర్నాడు ఉదయం లేచేసరికి జ్వరం తగ్గి పోయింది.. కోతి పిల్ల హాయిగా ఆడుకోంది .
                       

                           దీనివల్ల మనకి ఏమి నీతి తెలిసిందీ..అని అడిగాను..నాకు తెలుసు.. వాళ్ళకి ,పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి , వర్షం లో తడవకూడదు , అల్లరి చేయకూడదు , కోపం వస్తే అన్నీ విరగ్గోట్టకూడదు..ఇలా అన్నీ అర్ధమైన్దనుకుంటా..
అందుకే.. ఉత్సాహంగా , వాళ్ళ మొహం లోకి చూస్తున్నా..ఇద్దరూ ముక్త కంఠం తో ,
"మనం కూడా డాక్టర్ చిలకమ్మ దగ్గరికి వెళ్ళాలి..బోలెడు బొమ్మలు ఇస్తుందీ.., పైగా అందంగా వుంటుందీ., మనం కూడా ఏంచక్కా చిలకమ్మని  చూడవచ్చు..ఎక్కడ వుంటుందీ  ..?” అన్నారు..ఓరినీ..గడుగ్గాయలూ..అంటే ..కిల కిలా నవ్వుతూనే వున్నారు.No comments:

Post a Comment