Sunday, 16 April 2017

-----------🍅🍅టమాటా🍜 పన్నీర్ మసాలా🍅🍅 -------

---------------------------------- 🍅🍅🍅🍅టమాటా🍜 పన్నీర్ మసాలా🍅🍅🍅🍅 ------------------------------------

ఇక్కడ మేమున్న గౌరీపట్నం లో పాలుదొరకడం కష్టమే..ఒకతను కాలనీ లో పాలు తెస్తున్నాడు.కానీ బాగాలేవు అన్నారు.నేను వుండేది కొద్దిరోజులు.కానీ పాలులేకపోతే గడవదు. అందుకే కొవ్వూరు
నుండి పాలపాకెట్లు తెస్తారు . అవి ఫుల్ క్రీం మిల్క్. లో ఫాట్, 2 % ఫాట్ మిల్క్ (వెన్నతీసిన పాలు )దొరకవట.తిరుమలా మిల్క్ సప్లై . సరే ఇక్కడినుండి వెళ్ళేలోపు ఒక 10 కి.బరువు ఎలాగూ పెరుగుతాను అని డిసైడ్ అయ్యా. ఎందుకంటే చిక్కటి పాలు , కేకు కోసినట్టు వుండే గడ్డ పెరుగు,
మామిడి పళ్ళు,ఏమీ పనిలేకుండా కూర్చుని మింగడం.ఇహ బరువు ఎందుకు పెరగనూ..

         సరే. నిన్న రాత్రి 1/2 లీటరు చిక్కటిపాలు విరిగిపోయాయి. అయ్యో అనిపించింది.నిన్న ఫేస్ బుక్ లో Balabhadrapatruni Ramani గారు మేథీ పన్నీర్ మసాలా షేర్ చేసారు. నేనూ పాలక్ పన్నీర్ ,కాప్సికప్ పన్నీర్ మసాలా ,మేథీ చమన్ చేస్తూనే ఉంటా.కానీ ఇంట్లో ఆకుకూరలు లేవు.
ఎలాగా అనుకున్నా. మామూలుగా మసాలా రైస్ చేసినప్పుడు  టొమాటో గ్రేవీ కర్రీ చేస్తాను.అది గుర్తొచ్చి ,టమాటో పన్నీర్ మసాలా ఎందుకు చెయ్యకూడదూ ..అనుకున్నా.

                       విరిగిన పాలని ,పల్చటి బట్టలో వడకట్టి ,దానిపై  బరువు పెట్టాను.ఉదయానికి చక్కగా చెనా (పాల విరుగు ) రెడీ. మామూలుగా నేను ఈ విరుగుతో 'కలాఖండ్' చేస్తా . లేదా '
రసగుల్లా' చేస్తాను.కానీ స్వీట్ తినేవారేరీ.. నాకు ,మావారికీ స్వీట్స్ ఇష్టం లేదు. మా అబ్బాయికి అల్లుడికీ ఇష్టం. ఈ చెనా లో సరిపడా పంచదార వేసి , పాన్ లో తిప్పుతూ వుంటే ,పాకం వచ్చి కొద్దిగా గట్టి పడుతుంది. అప్పుడు కొద్దిగా నెయ్యి ,వేయించిన డ్రై ఫ్రూట్స్ , ఏలకుల పొడి వేస్తే కలాఖండ్.

చెనాని ,ఉండలు చేసి, మరుగుతున్న నీటిలో 2 ని ,మళ్ళీ  పంచదార పాకం లో 5 ని వేస్తే. రసగుల్లాలు తయారవుతాయి.

                          టమాటో పన్నీర్ మసాలా కి ,రెండు ఉల్లిపాయలతరుగూ  ,1 sp అల్లం వెల్లుల్లి ముద్ద, 5  టమాటో లు రెడీ చేసుకొన్నా.పాన్లో 2 sp ఆయిల్ వేసి ,వుల్లితరుగు వేసి ,వేగాక ,అల్లం
వెల్లుల్లి ముద్ద +పసుపు + కొంచం కరివేపాకూ వేసాను.అవికూడా వేగాక 2 sp కారం వేసా.టొమాటోలు పెద్దముక్కలు గా కట్ చేసి వేసాను. పావు కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి 3 ని .మగ్గించా. తరువాత
పనీర్  / చెనా  వేసి బాగా కలిపి అందులో ఎవరెస్ట్ వారి "కిచన్ కింగ్ " అనే మసాలా వేసా. ఇది గరం మసాలా లాగా కాకుండా.కసూరీ మేథీ డామినేషన్ వుండే మసాలా. గ్రేవీ కూరలకి చాలా బావుంటుంది.
మూత పెట్టి 3 ని. తరువాత చిటికెడు పంచదార + సరిపడా ఉప్పు వేసి , స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లాను. నూనె తేలుతూ ,కమ్మటి వాసనతో చాలా బావుంది.

                                   మధ్యాన్నం మావారు భోజనానికి వస్తే వడ్డించి ,ఎదురుగా కూర్చున్నా.బీరకాయ పెసరపప్పు తో ఒకవాయ అయ్యింది.నెక్స్ట్ టమాటో పనీర్
మసాలా.మాట్లాడకుండా తిన్నారు. మళ్ళీ కొంచం వేసా.నాకు మండిపోతోంది.ఏమీ చెప్పరే. మళ్ళీ రెండో వాయ కూరతో.అప్పుడు "ఏమిటీ టమాటో కూరా "..అన్నారు. "కాదు ..కాకర కాయ..కూర.."
అన్నా మంటగా. ఒక్కసారి ఆశ్చర్యంగా తలెత్తి.చూసి , "గసాలు ,జీడిపప్పు వేసావా ".అన్నారు. నేను
"మీకు ఇప్పుడు వంట చెయ్యడం వచ్చుగా కనుక్కోండి .." అన్నా. మరో రెండు ముద్దలు లాగించి.".పన్నీరు వేసినట్లున్నావ్ ..ఎక్కడిదీ..ఇక్కడ దొరకదుగా.." అన్నారు.  నేను ఉత్సాహంగా.."నిన్న విరిగిన పాలు ,వేస్ట్ చేయకూడదని ,ఇలా కూరచేసాను.." (ఎంత పొదుపో నేను
చూసుకోండి అని గర్వంగా..)..ఏమీ మాట్లాడకుండా పెరుగన్నం తిని , వాష్ బేసి వైపు తిరిగి ,"ఇక రోజూ
ఒకపాకేట్ పాలు విరగ్గొట్టి ,ప్రయోగాలు చేస్తావన్నమాట ..." అన్నారు. "లేదు..విరిగినా డ్రైనేజ్ లో
పారబోసేస్తా..ఎందుకొచ్చిన ప్రయోగాలూ..అంత కష్టంగా మింగడం ఎందుకులెండి .."
.అన్నా..ఉక్రోషంగా. హు..చేసి పెడితే తిని..ఇలా అంటారా అని..

" రాదే చెలీ..నమ్మరాదే చెలీ ..మగవారినిలా నమ్మరాదే చెలీ.." అని పాడుకుంటుంటే..ఇంటర్ కాం
మోగింది. నాకిక్కడ ఫోన్ చేసేది పతిదేవుడే.. అందుకే విసురుగా "హలొ.."అన్నా..

" నవ్వుతూ అన్న్నాలే..కూర సూపర్. చాలాబావుంది.రాత్రికి రోటీస్ లోకి ఇంకా బావుంటుంది .."
23-5-2014
Usha

No comments:

Post a Comment