Wednesday 11 May 2016

💍💍💍💍 పచ్చరాయి ఉంగరం 💍💍💍💍

💍💍💍💍💍 పచ్చరాయి ఉంగరం  💍💍💍💍💍



నాకు పదేళ్ళ వయసప్పుడు జరిగిన ఒక సంఘటన ఇది. నేను ఎప్పటికీ

మరచిపోలేని అమ్మ జ్ఞాపకం. అమ్మకి పెద్దగా నగల పిచ్చి వుండేది కాదు. నాన్న పెద్ద

లాండ్ లార్డ్ అయినా.. వర్షాధార మెట్ట పంటలూ ,ఆదాయం తక్కువ ,ఖర్చులు

ఎక్కువ.బంగారం ధర తక్కువే అయినా ,స్తోమత వున్నా ,ఎందుకో సింపుల్ గానే

వుండేది అమ్మ. కానీ ఒకసారి అమ్మ ఉంగరం చేయించుకొంది...చాలా

ఇష్టంగా...పచ్చరాయి (ఎమరాల్డ్) ఉంగరం. దాని కోసం చారిని పిలిచింది.చారి

కంసలిబత్తుడు. సిరిపురం నుండి వచ్చేవాడు. అతని దగ్గర చిన్న త్రాసు

వుండేది.చిన్నఇత్తడి  దొప్పలు , ట్వైన్ దారంకట్టి చేసిన తూకం ,త్రాసు..(దాని ఎదో

పేరుతో పిలిచేవారు .గుర్తురావడం లేదు ) అందులో వస్తువులు,బంగారం

తూచడానికి ,రాగి పైసా, సత్తు పైసా, గురవిందగింజలూ..ఇలా చాలా సంజామా తో

,పెన్సిల్ బాక్స్ లాంటి ఒకపెట్టే ,కాఖీ గుడ్డ సంచిలో పెట్టుకొని వచ్చేవాడు.నాకు

ఆత్రాసుతో ఆడుకోవాలని చాలా ఇష్టం గావుండేది. కానీ అతనికి భయం ఎక్కడ

తెగిపోతుందో అని. ఒక గురవి౦ద  గింజ చేతిలోపెట్టి ," వద్దు అమ్మాయి గారూ "

అనేవాడు.. నేను తరవాత ..తరవాత డబ్బా మూతలకు చిల్లులు పెట్టి ,దారాలు కట్టి

,పైన మరో కర్రకి వేలాడా దీసి,మధ్యలో మరో దారం కట్టి (బాలన్స్ ),త్రాసు తయారు

చేసుకోనేదాన్ని. తూకం వెయ్యడానికి , రాళ్ళు ,కుండపెంకులూ గుండ్రంగా ఉండేవి

వెతుక్కొని ,ఆడుకోనేవాళ్ళం.
       

                  సరే చారి వచ్చి ,అమ్మ చెప్పినట్టు పచ్చరాయి ఉంగరం చెయ్యడానికి ,

పాత బంగారం ,ముక్కలూ ..అవీ తీసుకొని వెళ్లి , 10 రోజుల్లో చేసి తీసుకొచ్చాడు.ఆకు

పచ్చ రాయి ఉంగరం..ధగ ,ధగ మెరుస్తూ..ఎర్ర కాయితంలో..ఎంత

బావుందో..నాలుగుపలకల చిన్నరాయి.అమ్మ వేళ్ళు తెల్ల్లగా,సన్నగా ఉండేవి.పైగా

గోరింటాకు పెట్టుకొని ఇంకా అందంగా వున్నాయి అమ్మ ఆ ఉంగరం పెట్టుకొంటే

,అమ్మ ఎడమ చెయ్యి ఎంత బావుందో..నాకూ పెట్టుకోవాలని అనిపించి, “

అమ్మా..నాకు పెట్టు..అమ్మా నాకు పెట్టు ..” అని గొడవ చేస్తే , తీసి పెట్టింది.కానీ

చిన్నపిల్లని కదా ,లూజ్ గా వుండేది. “చూడు ..లూజ్ గా వుంది. పడిపోతుంది ..”

అని అమ్మ తీసేసి ,మళ్ళీ తనవేలికి పెట్టుకొనేది. నా గొడవ పడలేక ఒకరోజు

ఉంగరానికి చుట్టూ దారం చుట్టి , జారిపోకుండా ,నా వేలికి పెట్టింది. మరి నా

చెయ్యి అమ్మ చెయ్యి అంత అందంగా కనపడలేదు.ఎందుకంటే అమ్మ తెల్లని చేతికి

ఎర్రగా గోరింటాకు పండి, అందంగా వుంది. నేను పెట్టుకోలేదు. ఇంట్లోనే చెట్టు. మా

చాకలి కోసి ,రుబ్బుతుంది ఎప్పుడూ..కానీ నేను రాములును (మా జీతగాడు )

తొందరపెట్టి ,కోయించా..ఆకుకోసి , పెరట్లో వున్న పెద్ద రోట్లో రుబ్బడానికి

కూర్చున్నాడు రాములు. నేను రుబ్బుతానని కూర్చున్నా, “ వద్దు..అమ్మాయి

గారూ ,చెయ్యి నలిగి పోతుందీ ..” అని వారించినా, మనం వినం కదా.. అయితే చేతికి

పచ్చరాయి ఉంగరం వుంది. కొత్తగా మెరుస్తూ..దానికి గోరింటాకు అంటి , ఎర్రగా

అయిపోతే... అప్పుడు ఎలా..? అమ్మ తిట్టదూ ..అందుకని చేతికి గట్టిగా వున్నా,

బలవంతంగా సబ్బు పెట్టి మరీ తీసేసి ,వళ్ళో పెట్టుకొని ,రుబ్బడం మొదలు పెట్టా. కానీ సరిగ్గా

రుబ్బలేను. రాములుకి భయం,చెయ్యి నలిగితే  అమ్మ తిడుతుందని ..”చిన్నపిల్లతో

పనిచేయి౦చావా .. నువ్వేం చేస్తున్నావ్ ..” అంటే.. అదీ వాడి భయం. ఇంతలో బ్రాహ్మణవారి

అన్నమ్మ, అంజిబాబు నా ఫ్రెండ్స్. "ఆడుకుందామా "అంటూ వచ్చారు.. ఇంకేముందీ

లేచి పరుగెత్తా...
         

                             అమ్మ రాత్రి అన్నం తిన్నాక, చేతికి గోరింటాకు పెడుతూ ,చెయ్యి

చూసి “ఉంగరం ఏదే..ఉషా..” అని అడిగింది. నిద్రతో కళ్ళు మూతలు పడుతున్నాయి.

“ రేడియో మీద పెట్టానమ్మా..” అన్నాను. మా ఇంట్లో , పెద్ద హాలు , అందులో గోడకి

వేసిన పెద్ద చెక్క టేబులూ, దాని మీద పెద్ద మర్ఫీ రేడియో ఉండేవి. ఆ రేడియో మీద

అమ్మ క్రోషియా తో అల్లిన క్లాత్ వేసి వుండేది. ఆ రెడియోమీద పెన్నులూ ,

చిల్లరడబ్బులూ, నాన్న గడియారం, బుల్లెట్ మోటార్ సైకిల్ తాళాలు , పంచాంగం ,

ఇలా సర్వ వస్తు సముదాయం వుండేది. అందుకే ఏదన్నా జాగ్రత్త చేయాలంటే ,అదే

సరైన ప్లేస్. గాడ్రెజ్ బీరువా వున్నా , అది తాళం తీసి ,అందులో పెట్టే అలవాటు లేదు

ఎవ్వరికీ . అందుకే అలా అలవోకగా చెప్పేసా. అమ్మ నాకు గోరింటాకు పెట్టి ,చేతికి

గుడ్డ కట్టి , చాపవేసి దాని మీద పాత బెడ్ షీట్ వేసి (పక్క బట్టలకి గోరింటాకు

అంటకుండా..) పడుకోబెట్టింది. తెల్లారి  లేచాక , గబగబా చేతులు కడుక్కొని

చూసుకొంటే ఎర్రగా పండిన చేతులు..నాకే ముద్దొచ్చాయి.కానీ అసలు నేను

గోరింటాకు పెట్టుకోవాలని గొడవచేసి మరీ ..పెట్టుకొంది ఉంగరం కోసం కదా..అది

లేదు. నాకు అమ్మ మీద కోపం వచ్చింది. “అమ్మ ఎప్పుడూ ఇంతే..నిద్రపోగానే

ఉంగరం లాగేసుకొంటు౦ది..” అనుకొంటూ..కాళ్ళు టపటపా నేలకేసి కొడుతూ..

ఏడుస్తూ.. “ నేను నిద్రపోగానే నా (?) ఉంగరం లాగేసుకోన్నావా ..? నా ఉంగరం

నాకిచ్చేయ్ ..” అంటూ పేచీ మొదలెట్టాను. అమ్మ తెల్లబోయి.. “ నిన్న నీకే పెట్టా

కదా..దారం చుట్టి , నేను తీసుకోలేదు. అన్నట్టు నిన్న గోరింటాకు పెడుతున్నప్పుడు

,రేడియో మీద పెట్టానన్నావ్..? వెళ్లి చూడు.”.అంది కాఫీ పెడుతూ.. గబగబా అటు

పరుగెత్తా. కానీ అక్కడ లేదు. పెడితేగా ఉండటానికీ..మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్లి “

లేదమ్మా..” అన్నా.. నేను చూస్తాలే  తరవాత అన్నది. మళ్ళీ గంటకి.. “అమ్మా

ఉంగరం..” అంటూ గోల పెట్టా.. అమ్మ వచ్చి చూసింది..లేదు. అన్నీ తీసి ,

రెడియోమీద క్లాత్ దులిపి చూసింది..ఉహూ.. అప్పుడే చాకలి లచ్చి (లక్ష్మి ..కానీ

అంతా అలాగే పిలిచేవారు.) ఇల్లు వూడుస్తోంది. అమ్మ “ లచ్చీ..ఉషమ్మ ఉంగరం

టేబుల్ మీద పెట్టిందట..వూడ్చేతప్పుడు జాగ్రత్త గా చూడూ..” అంది.. ఇల్లంతా రెండు

సార్లు వూడ్చినా ఉంగరం లేదు. అమ్మకి కంగారు మొదలైంది. మళ్ళీ నన్ను దగ్గర

కూర్చోపెట్టుకొని ,మెల్లిగా .. “ ఆలోచించి చెప్పు.. ఎక్కడ పెట్టావు..? ఎప్పుడు

తీసావూ..? ఎవరింటికైనా వెళ్ళావా,,? ఎవరికైనా ఇచ్చావా ..” ఇలా పాపం చాలా

రకాలుగా అడిగింది. “సాయంత్రం స్నానం చేసేటప్పుడు తీసావా..? సబ్బు

రుద్దుకొంటు౦టే జారిపోయిందా ..” అమ్మ దిగులు పడింది.  “ చేయించి నెలన్నా

కాలేదు ... ఎవరి దిష్టి తగిలిందో..” అని .  సబ్బు మాట విన్నాక అప్పుడు

గుర్తొచ్చింది..సబ్బు పెట్టి బలవంతం గా ఉంగరం తీసిన గుర్తువచ్చింది ... అప్పుడు

చెప్పా.. “ ఆ గుర్తొచ్చింది..నిన్న గోరింటాకు రుబ్బాగా..అప్పుడు తీశా..” అన్నా..అమ్మ

ఆశ్చర్యంగా “ నువ్వు రుబ్బడం ఏంటీ..? రాములు కదా రుబ్బింది..” అని..రాములు

ని పిలిచింది. “ రాములూ, నువ్వు రుబ్బలేదా గోరింటాకు ? ఉషమ్మ గారు

రుబ్బానని అంటోంది ..” అని గట్టిగా అడిగింది. “ అమ్మాయిగారు రుబ్బుతానని శానా

గొడవ సేసినారండి..వద్దన్నా ఇనలేదు..మళ్ళీ బాపనోరి పిల్లలు రాగానే ..

ఎల్లిపోయారు..అప్పుడే లచ్చిమి వచ్చి..నేను రుబ్బుతాలే అని రుబ్బిందండి. నేను

గొడ్లకాడికి (పశువులు ) ఎల్లిపోనాను. రోటికాడికి పోలేదు.” ..మళ్ళీ కథ లచ్చి దగ్గరికి

వచ్చింది.అది “నేనే రుబ్బాను..కానీ ఉంగరం సంగతి తెల్వది , చీకట్లు పడ్డాయి ఏమీ

కాపడలేదు(కనపడలేదు )కంటికి ..దొరసానీ ..” అన్నది.. “ అప్పుడు

కనపడకపోయినా, ఉదయం వాకిలి వూడ్చింది నువ్వేకదా మళ్ళీ..నీకు కాకపొతే

ఎవరికి  దొరుకుతుంది.? నిజం చెప్పు దొరకి తెలిస్తే గొడవై పోతుంది...” అని ఎన్ని

రకాలుగా చెప్పినా అది ..నాకు దొరకలేదనే ..అన్ని వోట్లు పెట్టి ,చెప్పింది. అమ్మ విసిగి

పోయి ,ఉక్రోషం పట్టలేక ,నా చెంప పగలగొట్టి..కళ్ళనీళ్ళు పెట్టుకొని..ఊరుకుంది.

నాన్నకు తెలిస్తే మళ్ళీ గొడవ అని.
                   

                                                   అప్పటి నుండి అమ్మ మళ్ళీ ఉంగరం

పెట్టుకోలేదు. నాకు బుద్ధితెలిసాక అమ్మచేతికి ఉంగరం చూళ్ళేదు. నా పెళ్ళయి ,

ఉద్యోగం చేస్తున్నప్పుడు “అమ్మా ..నీ ఉంగరం నేనే పారేశా కదా..నీను ఉంగరం

కొంటాను. మళ్ళీ పచ్చరాయి ఉంగరం ..” అని నేనంటే..  “ ఛ..వద్దొమ్మా..నువ్వు

కొనడమేంటీ..అయినా నాకు ఉంగరం అచ్చిరాలేదు..వద్దు.”అనేది. నాకు చాలా గిల్టీగా

వుండేది. కానీ అమ్మకి ఉంగరం మాత్రం కొనలేదు.. 3 సం. క్రితం ,మావారు మా

పెళ్ళిరోజుకి ,ఉంగరం కొన్నారు. విచిత్రం గా “పచ్చరాయి” ఉంగరం..ఎమరాల్డ్..అచ్చం

అమ్మ పోగుట్టుకున్న ,ఉంగరం లాగే ఉంది. కాకపోతే సైజ్ కాస్త పెద్దగా..అమ్మ వేళ్ళు

సన్నగా ఉండేవి. మరి నా వేళ్ళు లావు.వెంటనే అమ్మ గుర్తొచ్చింది..అమ్మ ఫోటో

దగ్గర పెట్టి ,గంటసేపు ఏడ్చాను. కానీ అమ్మకి ఉంగరం మాత్రం కొనలేకపోయాననే

బాధ, నా జీవితాంతం వేధిస్తూనే వుంటుంది.అమ్మా నన్ను క్షమించవూ..

( అమ్మ ఫోటోలో నవ్వుతోంది. “పిచ్చిదానా..నీకోసం నేనే కొన్నా ఆఉంగరం ..నీకూ ఇష్టం గా మరి”..అని..)అమ్మా నాన్నలకి నమస్కారాలతో..

 కన్నీటితో అమ్మకి అంకితం.. నీ ఉష.

Tuesday 10 May 2016

@@@@@. ఫేస్బుక్ వ్రత కల్పము @@@@@

@@@@@@@@@@ ఫేస్ బుక్ వ్రత కల్పము  @@@@@@@@@

                                                                  --------04/02/2014
                                                                   By N. Usha Rani .


ఫిబ్రవరి 6 న రధసప్తమి ..ఈ పుణ్య దినమున వివాహితలైన స్త్రీలువివాహానికి సిద్ధముగా వున్న కన్యలూ ..వివిధరకాలయిన నోములూ,
వ్రతాలూ మొదలు పెడతారు. అవి ఏమిటో ,ఎన్ని రకాలో ..రధ సప్తమి
రోజున చెప్పుకుందాము. ఇప్పటి అమ్మాయిలకి అవన్నీ తెలుసుకొని చేసే వోపికా , తీరికా రెండూ లేవు . అందుకు అట్టి కన్యామణులే కాక సమస్త
మానవకోటికి హితమైన "వ్రత కథ" నొకదాని గూర్చి చెప్పదల౦చితిని
..ఇది నచ్చి ,మెచ్చినవారు (ఆల్రెడీ వ్రతమారభించి యున్ననూ ) ఇంకా దీక్షగా చేయుచు, క్రోత్తవారి చేత మొదలెట్టించి ..దివ్య సుఖముల బడయవచ్చు ..

              ఒక రోజున పార్వతీ దేవి కైలాసమున మిక్కిలి ఒంటరిదై,
చింతించుచుయున్నది..కారణమేమన  పతీ, సుతులు వారి వారి
పనులతో బిజీగా యుండిరి. పరమేశ్వరుడు తన ప్రమధగణాల మధ్య వచ్చిన తగాదాలను, గిల్లి కజ్జా లను  తీర్చుట లోనూ, గణేశుడు,సుభ్రమణ్యుడు తండ్రికి తోడ్పాటగానూయుండిరి..పార్వతీ దేవికి ఏమీతోచడం లేదు..ఈ మధ్య పరమేశ్వరుడు ఈ పనులతోనే తీరికలేకుండా
ఉండుట చేత..అమ్మకు చాలా వంటరితనము ,విసుగు కలుగు
చున్నవి..పతి చెంతనుండిన ముల్లోకాల విశేషాలనూ,  చిత్ర విచిత్రాలానూ
చెపుతూ ఆమెను మిక్కిలి సంతోష పరచేవాడు..ఈ మధ్య అది కుదరక
..అమ్మవారికి చిరాకు పుట్టిస్తూ వున్నది..అర్జంటుగా తనవద్దకు
రావలసినదని అప్పటికే 100 మార్లు టెలీపతీ ద్వారా స్వామికి
కబురంపింది.. రాకపోయేసరికి నందిని పంపింది..ఆయన రాకపోతే"పుట్టింటికి " వెళ్లి పోతానని బెదిరింపు కూడా అయ్యాక..ఇహ తప్పక
పరమేశ్వరుడు , పార్వతి చెంతకు అరుదెంచే.."పనులవత్తిడి మిక్కిలి గాయున్నది పార్వతీ..ఇంత అర్జంటుగా పిలువనంపిన కారణమేది " యని
అడుగ ..పార్వతి " మీరు ఈ మధ్య ఇదే కారణాన్ని చెప్తూ వస్తున్నారు.
నాయందు తమకి అనురక్తి తగ్గినదా..నన్ను బొత్తిగా నిర్లక్ష్యమచేయుచున్నారు .? నాకు వంటరి తనము తో విసుగు వచ్చు చున్నది.

      ముక్కంటి ,జగదీశ్వరుని ఇల్లాలనైన నా పరిస్థితే ఇలావుంటే ..ఇక
భూలోకమున ఇల్లాండ్ర పరిస్థితి ఎటులుండు " నని మిక్కిలి
వగచగా...పరమేశ్వరుడు ఫెళ్ళున నవ్వి " ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు దేవీ ! వారంతా ఒకరి మొహం మరొకరు చూడకుండా ఎన్ని
రోజులైననూ గడపగలిగిన౦త తీరిక లేకుండా వున్నారు. మానవులకు 24
గంటలు సరిపోవడం లేదు. 10 సం.వారినుండి 100 సం.వారి వరకునిత్యమూ ఒకే దీక్షలో యున్నారు.వారికి మన దేవతల పూజలూ, వ్రతాలూ చేసే తీరిక లేదు. ఒకే స్మరణ ..ఒకే అనుష్ఠానము .." యని తెలుప ..పార్వతి " అదేటుల స్వామీ..అదేమీ అనుష్ఠానము , ఏమా కథ "యని కుతూహలమున యడుగగా..పరమేశ్వరుడిట్లు చెప్పదొడిగె .

   "వినుడు దేవీ.. పూర్వము ద్వాపరయుగము వరకు మన దేవతలు,ఋషులు ,మునులు, కొందరు మానవోత్తములును  టెలీపతీ ద్వారా ముల్లోకముల యందు జరుగు విశేషములను
,తెలుసుకొంచు..అవసరమైన వారి తో  సంభాషించుకునే
వారము.తరువాత రాను రాను  మానవులకు ఆ శక్తి సన్నగిల్లినది.. కానీ
మానవుడు తన తెలివి తేటలతో ..వార్తా పత్రికలద్వారా, టెలీ ఫోన్, రేడియో

,దూర దర్శిని లను కనుగొని ప్రపంచ వార్తలను, ఎక్కడ ఏమి జరిగినాతెలుసుకొనుచున్నాడు.. ఇంకా అభివృద్ధి సాధించి ..సెల్ ఫోను ద్వారాప్రపంచములో ఎక్కడి వారితో అయినా సంభాషిస్తున్నాడు..మరికొంత

ముందడుగు వైచి 'కంప్యూటర్ 'సాధనం కనిపెట్టి, దానిని ఇంటర్నెట్ తో
అనుసంధానించి ఎక్కడ ఏమిజరిగినా ఇంటిలో కూర్చుని  వీక్షించే అవకాశము పొందాడు..అందులో మరీ అభివృద్ధి సాధించి ఇప్పుడు అత చిన్న సాధనముల ద్వారాకూడా ఇవన్నీ చూడగల, ప్రపంచంతఅనుసందానమొ౦దు నటుల అభివృద్ధి సాధించెను.
 

                ఇంతలో జుకర్ బర్గ్ అను అమెరికన్ మానవుడు 2004 న.,ఫిబ్రవరి 4 న " ఫేస్ బుక్ " అను సాధనాన్ని ఆవిష్కరణ గావించాడు.

ఇతడు టేలీపతికి మారుగా యన్నట్లు..తన మిత్రులకు ప్రతి క్షణము ఎక్కడ ఏమి చేయుచున్నారో, తమ మానసంబందు ఎట్టి
యాలోచనలున్నవో,కూర్చున్న,నిలుచున్నా,త్రాగుచున్న ,...ఆఖరుకు
ఊపిరి తీసుకున్న వివరములను సైతము ప్రపంచ మున  ఏమూలనున్వారికైనా తెలిపే సాధనమే ఈ " ఫేస్ బుక్ " ..అంతే గాక తాము విన్నవీ
,చూసినవీ,నచ్చినవీ , నచ్చనివీ ప్రతిదీ చిత్రముల ద్వారా.., చలన
(వీడియో ) చిత్రముల ద్వారా అందరికీ తెలుపవచ్చు . అచిరకాలముననే
ఇది మిక్కిలి అబివృద్ధి నొంది , కొన్ని కోట్ల మంది ఇందులో దీక్షను
పూనారు ..ఇక మానవుల యానంద మేమి చెప్పుదు దేవీ ..ఆనదముతో
తలమునకలై పోయి యున్నారు ".

            " ఫేస్ బుక్ " అను మాట ఇప్పుడే వినుచున్నాను స్వామీ
..అది యేటుల ఆనందము కలిగించును ,ఆ దీక్ష ఎటుల స్వీక౦రిచవలె
..సవివరముగా తెలియజేయండి స్వామీ " యని పార్వతి
అడుగగా..పరమేశ్వరుడిట్లు చెప్పదొడిగె .." పార్వతీ ..ఆ మానవుడు 'జుకర్ బర్గ్ '  కనిపెట్టిన సాధనమైన ఈ ఫేస్ బుక్ ..ఏక కాలంలో కొన్ని లక్షలమందిని అనుసంధానిస్తూ ,'స్టేటస్ అప్డేట్స్ ',నచ్చిన 'వీడియోలూ'
చిత్రాలూ ఒకరినుండి మరొకరికి 'షేర్ ' చేసుకోనుచూ, 100 షేర్ లూ 200లైకులూ, కలిగి అందరికీ  మనోల్లాసములను కలిగించుచూ ఆనందపరచు చుండే..దీని ద్వారా మానవులు స్త్రీ, పురుష భేదము లేక  బృందాలుగా ,గ్రూపులుగా ఏర్పడి ,స్నేహబందాలను ఏర్పరచుకొంటూ ,'అప్డేట్స్ '
చేసుకొంటూ ,పగలూ రాత్రి భేదములేకుండా,ఆకలి బాధ లేదు, నిత్య సంతోషులై ..అదో ప్రపంచమందు విహరిన్చుచున్నారు ..!" యని తెలుప పార్వతి "అటులనా ప్రభూ ..! నాకు ఈ వ్రత విధానమును వివరముగా
తెలుసుకొనవలెనని మిక్కిలి ఆశ గాయున్నదితెలుపుడ"నిన..పరమేశ్వరుడు " ఈ వ్రతమును ఎవరైననూ ,జాతి,కుల
,మత భేదము లేక ప్రపంచము లోని అన్ని జాతులవారైన మానవులు ఆచరించ వచ్చు . విధి ,నియము, కట్టుబాట్లు ,మడి
,ఆచారము,నైవేద్యము,ఉద్యాపన,వాయన నియమములు ఏమియును లేవు..ఎవరికీ నచ్చినట్లు వారు చేయవచ్చును.మనసున ఇచ్చ కలిగిన మరుక్షణమే వ్రత మారంభింప వచ్చును .మన పూజలలో లాగా పూజా
మందిరం, తూర్పు దిక్కు , మంచి దినము ..ఇటువంటి నియమాలు
లేవు..కానీ  సంకల్పం చెప్పుకోవాలె.అదియునూ గోత్రనామాలు గాక,
పేరు,పుట్టిన దినము వంటి వివరాలు ఒక్కసారి పొందుపరచి.."అక్కౌంటు
"రూపొందించిన చాలు. ప్రతిదినమూ చెప్పవలసిన పనిలేదు.ఒకసారి వ్రత
దీక్ష బూనిన ,ఇహ ఉద్యాపన,వ్రత విరమణ చేయనక్ఖర  లేదు.మృష్టాన్నములు, పిండి వంటలూ,పండ్లూ నైవేద్యములూ ఏమీ వుండవు.అందుకే మ్లేచ్చుల నుండి అన్ని జాతుల వారూ ఈ వ్రత దీక్ష సల్పు చున్నారు . ఈ ఫేస్ బుక్ మాయా దీక్షలో పడి  , మనకి పూజలు చేయడం కూడా మరిచి పోతున్నారు దేవీ,.. " అని తెలిపి  పరమేశ్వరుడుఇప్పుడే వచ్చేద నని మరల జనియె..

        "ఔరా !! ఈ మానవులెంత తెలివైన వారు ..? " అని ఆశ్చర్య
పోయి ,పార్వతి తన స్నేహితురాల్లయిన లక్ష్మీ ,సారస్వతులకు ఈ కథ
నంతయు జెప్పి ,తమ భర్తల బిజీ షెడ్యూల్ వల్ల తామెంత
వంటరితనమును అనుభవించు చున్నారో యని దలచి, ప్రమధగాణాలలో
తమకు నమ్మకస్తుడైన ఒకనిని  భూలోకమునకంపి  3 లాప్ టాప్
లు,ఐఫోన్ లు, ఐపాడ్ లూ తెప్పించుకొని ,ఫేస్ బుక్ వ్రత దీక్షబూని..వారిలో వారే స్టేటస్ అప్డేట్స్ ,షేర్ లు, లైకులతో ఆనందంగా వుండిరి.
తమ పతుల  రాకపోకలను , ఉనికిని కూడా మరువగా ..ఇదంతా తన
మనోనేత్రము ద్వారా తెలుసుకొన్న విష్ణుమూర్తి ..శివుని తొందరపాటుకు చింతించే. దీనికి విరుగుడు ఏమా యని ఆలోచనలో పడిన వాడాయే ..

              ఇప్పటికీ విష్ణుమూర్తి విరుగుడు కనుగొన లేకపోయినా ఈ వ్రత విధానమును సూతుడు ,శౌనకాది ముని శ్రేష్టులకు ,వారినుండి
ముని పత్నులకు  , వారినుండి సకల జనులకు తెలియగా ..భరత
ఖండమున , ఆంద్ర ప్రదేశ్ అను రాష్ట్రమున ,కృష్ణా గోదావరుల మధ్యప్రదేశమైన హైదరాబాద్ అను పట్టణమున స్వగృహమున నివసించు ఉషారాణి నూతులపాటి యను నొక వనితామణి ఈ కథను మీ
కందరకును తెలియజేసినది.

                ఈ కథ విన్నవారికి ,చదివినవారికి, షేర్ చేసినవారికి మరు జన్మలోకూడా ఫేస్ బుక్ ను సేవించే మహద్భాగ్యం కలుగును. మరియు లైక్ చేసి , కామెంట్ చేసినవారు కూడా ఈ జన్మలోనే సర్వ సుఖములనూ బడియుదురు..అందరికీ కూడా ఎంతో పున్య కీర్తులు దక్కి ,స్నేహ పరంపర ,తామర తంపరగా వృద్ధి నొంది  ,జీవితాంతమూ ఈ 'fb' సుడి గుండములోనే  ..సుళ్ళు తిరుగుతూ , ఊపిరి పీల్చుకొను సమయము కూడా లేకుండా 'గిలగిలా' కొట్టుకుందురని కూడా సూతుడు శౌనకాది మునులకు ,వారి నుండి వారి పత్నులకు..వారినుండి.....తెలిసినది

       ********* శుభం భూయాత్ *********

ముఖ్య గమనిక :- ఈ కథపై పూర్తి హక్కులు నావే..దీనిని ప్రచురించదలచిన పత్రికలూ , ఒకవేళ సినిమా తీయాలనుకున్న నిర్మాతలు నన్నే సంప్రదించ వలెను.పూర్తి హక్కులు నావే..మొదట వచ్చిన వారికి పారితోషకము లో డిస్కౌంట్ ఇవ్వ బడును.

సూచన : { ఇది కేవలం నవ్వుకోవదానికే నని.మన పురాణాలూ ,వ్రతాలూ ,పూజలూ అనిన మిక్కిలి గౌరవము ,అభిమానమూ వున్న శుద్ధ శ్రోత్రీయ వంశజను అని మనవి ..} :)

🙊🙉🙈🐒 అల్లరి జ్ఞాపకాలు 🐒🙊🙉🙈

🙈🙉🙊 కొన్ని అల్లరి జ్ఞాపకాలు 🙈🙉🙊

       మా అమ్మమ్మ వాళ్ళు , తాతయ్య ఉన్నప్పుడు , పిల్లల చదువుల కోసం ఖమ్మం లో ఉన్నారు . పొడవైన ప్లాట్ లో మూడు వరసగదులు .. కట్టి .. మిగతా ఖాళీ స్థలం అలాగే ఉంచారు . కాంపౌండ్ కట్టి , పెద్దగేట్ ఉండేది . అప్పటికి అమ్మకి , పెద్ద పిన్నికి పెళ్లైంది . పిన్నికి పిల్లలు లేరు . మేం నలుగురం (చెల్లిపుట్టలేదు ) . ముగ్గురు ఆడపిల్లలు , ఇద్దరు మొగపిల్లలు , మా పెద్దన్నయ్య అక్కడ చదువుకునేవారు . ఆ మూడు గదుల్లోనే ఎంత మంది సర్దుకునే వాళ్ళమో .. అమ్మమ్మ చెల్లెళ్ళు , వారి పిల్లలు , అమ్మమ్మ వాళ్ళ అమ్మ ( తాతమ్మ ) , మా అమ్మ , మేము అందరం కలిసినప్పుడు
చాలా సందడిగా ఉండేది . భారీగా వంటలు , సినిమాలకి వెళ్ళడం , మంచినీళ్ళు
మొయ్యడం ( ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పక్కింట్లో నల్లా దగ్గర పట్టుకోవలసి వచ్చేది ) .. మా సావిత్రి పిన్ని రింగు లీడర్ .

         సావిత్రి నాకంటే నాలుగేళ్ళు పెద్ద
అంతే . పెద్దన్నయ్య వయసు . చాలా ఇంటెలిజెంట్ , ప్రాక్టికల్ మైండెడ్ గా ఉండేది . పెద్దవాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ గా ఉంటె ,
వాళ్లకి తెలియకుండా , మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళేది . ఇంతమంది పిల్లల్లో , తెలియకుండా ఎవరో ఒకరు నోరు జారేవాళ్ళు .
దొంగతనం బయట పడేది .. పుల్లైసు కొనేది .. నొక్కేసిన డబ్బులతో ..అమ్మమ్మ ఏదో కొనుక్కు రమ్మంటే , తక్కువ కొని డబ్బులు మిగల్చడం , ధర ఎక్కువ చేసి చెప్పడం .. ఇలా . పుల్లైసు తింటే నోరు ఎర్రగా అయ్యేది . డబ్బులు ఎక్కడివి ? అని అడిగితే అందరూ
సావిత్రిని చూపించే వాళ్ళు . ముందు తిట్లు తిని , తరవాత మమ్మల్ని తిట్టేది . ఈసారి అస్సలు చెప్పం అని ఒట్టు వేసుకునే వాళ్ళం .. మళ్ళీ మామూలే !
       ఖమ్మం లో వీర భద్రం కిరాణా షాపు ఉండేది . అక్కడే కిరాణా సామాను కొనేవారు మా వాళ్ళు . అతను చిన్న లాటరీ నడిపేవాడు. ఐదు పైసలు , పది పైసలు ,
పావలా . దానిమీద బెట్ చెయ్యాలి . మనం చెప్పిన నెంబర్ లాటరీ లో వస్తే , ఎన్ని రెట్లు
బెట్ చేసామో అంత డబ్బు వస్తుంది . ఆ నంబర్లు ఒక కాలెండర్ లో నుండి కట్ చేసినవి . అది మా సావిత్రి గమనించింది .
ఆ కాలెండర్ లోని నంబర్లు జాగ్రత్తగా కట్
చేసి , మాలో ఇద్దరినీ  తన వెంట తీసుకేల్లేది . ఒకటి , రెండు సార్లు 5 పైసలు , 10 పైసలో
ఓడి పోయేది .  తరువాత పావలా బెట్ . ఫైవ్
టైమ్స్ / సిక్స్ టైమ్స్ అనేది . అతను ఒక చిన్న డబ్బా మనముందు పెడతాడు . తను కోరుకున్న నెంబర్ ( ఉదా .:33 అనుకోండి ) ఆ
డబ్బాలో నుండి తీయాలి . ఎలాగూ అది రాదు . వెనక ఉన్న మా దగ్గర సేం నంబెర్ ఉంటుంది . జాగ్రత్తగా అతని దృష్టి మళ్ళించి నంబర్ మార్చేది .  ఇలా రెండు మూడు రోజులకోసారి అతన్ని మోసం చేసేది . తప్పు
కదా అంటే .." ఆ ( .. వాడేమన్నా సత్య సంధుడా ..? మనకు నాణ్యత లేని సరుకులు అమ్ముతాడు . లాటరీ లో ఎంతమందినో మోసం చేస్తాడు .. మనం రెండు , మూడు రూపాయలు కొట్టేస్తే తప్పులేదు " అనేది .  ఆ డబ్బుతో సినిమాలు , పుల్లైసులు ., సినిమా బెంచి టిక్కట్టు 50 పై . ఉండేదనుకుంటా అప్పట్లో ..5 పై సలు పుల్లైసు .

              మాకు కామిక్ పుస్తకాల పిచ్చి ఉండేది .  నాన్న ఖమ్మం వెళ్తున్నాం అని అందరికీ తలా ఒక రూపాయి ఇచ్చేవారు . అవి సావిత్రి తీసుకునేది . కామిక్స్ కొనుక్కోవాలి అని ఏడిస్తే .. నీకు కొనిస్తాగా అనేది .  ఖమ్మంలో వై . ఎన్ . ప్రెస్ అని ప్రింటింగ్ ప్రెస్ / బుక్ షాప్ ఉండేది . వాళ్ళదగ్గర రష్యన్ పబ్లికేషన్ వో , వారి స్వంత పబ్లికేషనో గుర్తు లేదు కానీ , పెద్ద పెద్ద అక్షరాలతో , ఇంగ్లీషు , తెలుగు లలో కథల పుస్తకాలు దొరికేవి . డాక్టర్ చిలకమ్మ, జిత్తులమారి నక్క , తెలివైన కోతి అనే టైటిల్స్ వుండేవి .అవి ఒక్కో పుస్తకం పది పేజీలే ఉండేవి . పిల్లలు చదువుకునేందుకు , మంచి రంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉండేవి .ఖరీదు కూడా చాలా తక్కువ . పావలాకి ఒకటి . మేం బాగా కొనుక్కునే వాళ్ళం . సావిత్రి మా రెండో అన్నయ్యని , ఒక చేతి సంచి తీసుకొని వెళ్ళేది . వై ఎన్ ప్రెస్ ఎప్పుడు  కిటకిట లాడుతూ ఉండేది . వాళ్ళు కామిక్స్ అనగానే ఒక కట్ట తీసేవారు . అందులో చాలా పుస్తకాలు ఉండేవి .. మరి ఒక్కో పుస్తకం పది , పన్నెండు పెజీలేగా . చూసుకొని తీసుకుంటాం అని కట్ట తీసుకొని , మధ్యలో నుండి ఒక పది పుస్తకాలు లాగి , బాగ్ లో వేసేది .. అట్లా
చాలా బుక్స్ కొట్టేసేది . కొన్ని సార్లు హిందీ వి , అంతకు ముందు కొన్నవే వచ్చేవి .. ప్రెస్ వాళ్ళు ఎప్పుడు గమనించలేదు .. మా సావిత్రి పట్టు బడలేదు . కానీ ఇంట్లో దొరికి పోయి తిట్లు బాగా తినేది . ఎవరికి సావిత్రి మీద  కోపం వచ్చినా , తను చేసిన , దాచిన సీక్రెట్ చెప్పెసేవారు అమ్మమ్మకి .. అమ్మమ్మ నాలుగు దంచేది కూడా !

           పాలలో సాయిబాబా (సత్య సాయి ) కనిపించాడు అని పెద్దవాళ్ళని కూడా నమ్మించింది ఒకసారి . తాతయ్యకు చాలా సీరియస్ గా ఉందని , పెద్ద వాళ్ళంతా హాస్పిటల్ లో ఉన్నారు . తాతయ్య ఇక కొన్ని రోజుల్లో పోతారని తెలిసింది . తాతమ్మ ,
మేము ఇంట్లో , భయం భయంగా బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాము . సావిత్రి , "పాలల్లో సాయిబాబా కనిపించారు నాకు . భజన చేస్తే , బాపు (నాన్న ) కి ఏమీ కాదుట .." అంది . తాతయ్య , అమ్మమ్మ సత్య సాయిని బాగా నమ్మే వారు . నీకు బాబా ఎలా కనిపించాడు
? మాకూ చూపించు అని అందరూ అడిగారు
. పాలగిన్నే తెచ్చి లైటు వెలుతురు కింద పెట్టింది . వెడల్పుగా ఉన్న గిన్నెలో , బాబా తల ఆకారంలో నీడ కనిపించింది . అంటే ఆయన తల ఆకారం .. ఇక రోజంతా బాబా భజనలే .. తరువాత ఎవరో .. "అంతా వట్టిదే ..ఏ వెడల్పు గిన్నెలో అయినా , వెలుతురు లో పాల నీడ , అలాగే ఉంటుంది .. మనం గమమిచం " అన్నారు . మళ్ళీ నిలదీస్తే , "నాకు బాబా కనిపించి , మాట్లాడినట్లు
అనిపించింది " అంది ..

       ఇలా మా సావిత్రి ఆగడాలు , అల్లరి పనులు .. కో కొల్లలు . కొన్ని సరదాగా షేర్ చేసాను మీ అందరికీ ..

💦💦💦💦 చెలిమ నీరు - 4 💦💦💦💦

💦💦💦💦చెలిమ నీరు -4 💦💦💦💦

          ఇక ఆఖరుదైన నీటి సమస్య . మా వూళ్ళో నీటి సమస్య మాకు తెలియదు . వూరు చుట్టూ చిన్న చిన్న నీటి కయ్యలు  ,  కుంటలూ, చెరువు వుండడం వల్లనేమో . అది ఇప్పుడు తెలిసింది . మా ఇంట్లో భావి ఎప్పుడూ ఎండిపోలేదు  .  మంచినీళ్ళ కోసం కొంతమంది వచ్చేవాళ్ళు కూడా మా ఇంటికి .  ఇక నీళ్ళు తోడడం కూడా తెలియదు . ఎప్పుడైనా సరదాకి చేసినా అమ్మకి భయం .. భావి దగ్గరికి వెళ్ళవద్దు అనేది . అమ్మ వేసిన పెరటి తోటలో సరదాగా నీళ్ళు పోసేవాళ్ళం . అంతే .
 
            అమ్మమ్మ వాళ్ళ వూరిలో నీటి ఎద్దడి బాగా ఉండేది . చుట్టూ ప్రక్కల చెరువులు , కుంటలూ లేనందువల్ల నెమో .. వర్షాభావ పరిస్థితులు కూడా అయివుండా వచ్చు . అమ్మమ్మ వాళ్ళ ఇంటి దక్షిణం వైపు , ప్రహరీ గోడనానుకుని .. పెద్ద భావి ఉండేది . అది ఊరుమ్మడి భావి . పెద్దగా , నాలుగువైపులా
నీళ్ళు తోడుకునేందుకు ఇనుప కమ్మీలు , గిలకలు , భావి చుట్టూ  సిమెంటు గచ్చు , మురుగు నీరు నిలవకుండా కాలువ .. ఇన్నివున్నా .. భావిలో నీళ్ళు సున్నా . అమ్మమ్మ వాళ్ళ భావి లో కూడా ఆ సంవత్సరం నీళ్ళు అడుగంటి పోయాయి . గుడి పూజారి గారి ఇంట్లో భావిలో కాస్త ఉండేవి . ఉదయం వాళ్ళ అవసరాలకి తోడుకున్న తరువాత , మళ్ళీ నీళ్ళు వూరిన తరువాత , తొమ్మిది గంటల ప్రాంతంలో మేము చిన్న , చిన్న తప్పాళ్ళు, చిన్న బిందె , చెంబు లతో  నీళ్ళు మోసేవాళ్ళం . ఇవి వంటకీ , వంటింటి అవసరాలకోసం . మా పిన్ని సావిత్రి రెండు బిందెలు తడి బట్టలతో అమ్మమ్మకి మడిగా తెచ్చేది . అమ్మమ్మ మంచినీళ్ళ కోసం , చిన్న కుండ ,చిన్న వంటగదిలో విడిగా ఉండేది . మేం ముట్టుకోకూడదు . " ఎంగిలి మంగళం " చేస్తారు ఈ పిల్లలు అని విసుక్కునేది మమ్మల్ని .  మా కోసం మరో పెద్ద 'రంజన్' ఉండేది . అది హాలు ప్రక్కన ఉన్న వేరే గదిలో . దానిచుట్టు ఇసుక పోసి , అందులో అల్లం కణుపులు గుచ్చేది మా పిన్ని . అవి మొలకెత్తి , ఆకుపచ్చగా , అల్లం వాసన వస్తూ ఉండేది .  ఆ కుండలో నీళ్ళు రంధ్రాల లోనుండి కొద్దిగా వస్తాయి . అందువల్ల నీళ్ళు బాగా చల్లగా ఉంటాయి . ఆనీటి తడి ఇసుక పీలుస్తుంది . అల్లం తాజాగా , మూడు నాలుగు నెలలు చెడిపోకుండా ఉంటుందిట
. ఎంత మంచి మల్టీ పర్పస్ ప్లాన్ కదా !

               అయ్యగారి (పూజారి ) ఇంటి
నుండి నీళ్ళు మొయ్యడం సరదాగానే ఉండేది . వాళ్ళ ఇల్లు మరీ దగ్గరేమీ కాదు , అయినా విశాలమైన మట్టి రోడ్లు , కాస్త టైం
పాస్ , నీటితో ఆట . రెండు మూడు సార్లు
తిరిగి నీళ్ళు మోసినా , కష్టం అనిపించేది కాదు . కానీ అవి త్రాగడానికి ఉప్పగా ఉండేవి
. వూర్లో ఎక్కడా మంచినీళ్ళు లేవు(ట).

              మా స్నానాలకీ, ఇతర అవసరాలకీ  గంగాళాలు , బక్కెట్లు , తొట్టినిండా నింపేవాడు చాకలి భిక్షం . ఇంట్లోకి అవసరాలకి మేము తెచ్చేవాళ్ళం . మా పిన్ని 'చెలిమనీరు' తెచ్చుకుందాం అనేది . మాకు అదేమిటో తెలియదు .. సరదాగా పొలాలు చూస్తూ నడుస్తూ , వెళ్ళడమే కదా ..  నీళ్ళు తియ్యగా , కొబ్బరి నీళ్ళ లాగా ఉంటాయి అని చెప్పేది . అదేమిటో చూడాలని కుతూహలం . పైగా నీళ్ళు తేని వాళ్లకి ఉప్పు నీళ్ళే అని బెదిరించేది కూడా . తోవ పొడుగునా తెనాలి రామ లింగడి కథలూ చెప్తానని ఊరించేది..  ఇన్ని తాయిలాలు . అందరం ఉత్సాహంగా సరే ..సరే అనేశాం .

            మా అమ్మమ్మ నన్ను వద్దు అనేసింది . " ఎందుకు వద్దూ.. అదేమన్నా మహా రాణా
..? మంచినీళ్ళు తాగదా ..రానీ . దాని నీళ్ళు అదే తెచ్చుకోవాలి .."  అంది మా పిన్ని .  ఇక మా అమ్మమ్మ  సణుగుడు మొదలైంది ..
" అవేం గౌన్లు ..? చేతుల్లెకుండా .. ఎదిగే పిల్లలకి అంత పొట్టి గౌన్లు తెస్తారా ? తాటి చెట్ల లాగా ఎదుగుతుంటే , కాళ్ళు కనిపిస్తూ .. మీ నాన్న తేవడం సరే .. మీ అమ్మ వెయ్యడం సరే ..మీ నాన్న సంపాదనంతా మీ బట్టలకే సరిపోతుంది .. మీ అమ్మకి బుద్ధి ఉండద్దూ .. బీరువా నిండా అన్నేసి చీరలు ఉన్నాయి . ఏం
చేసుకుంటుందీ ? నీకు లంగా జాకెట్లు కుట్టించ వచ్చుగా ? వాణెమ్మ ( ఆఖరు పిన్ని .. మెంటల్లీ డిజేబుల్డ్ .. బలహీనంగా , పీలగా ఉండేది ) కన్నా రెండేళ్ళు చిన్నదానివి . దానికంటే పొడుగున్నావ్..(అది నా తప్పా ?) బయటికి వెళ్తే అందరికళ్ళు నీ మీదే .  అసలే
మంచి వూరు కాదు . మీ వూళ్ళో ఏమైనా ఏడవండి ,మా వూరికి వచ్చేటప్పుడు లంగా
జాకేట్లే తెచ్చుకో . గౌన్లు వద్దు .." అంటూ తిట్టి
పోసింది .  మా పిన్నీ , పెద్ద మామయ్యా "చిన్న పిల్ల దానికేం తెలుసు పాపం .. దాన్ని
తిడతావు .." అన్నా ఆగకుండా .  నేను భయంగా " ఒక లంగా జాకెట్ తెచ్చుకున్నా
అమ్మమ్మా .." అనగానే " ఉద్దరించావ్ . వేసుకో మరి .." అని నేను కూడా ,
చెలిమకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది . అదీ లంగా , జాకెట్ తో .. మా తమ్ముడు చిన్నవాడు .. అయినా వాణ్ని కూడా వదలలేదు మా పిన్ని . ఒక మర చెంబు  ఇచ్చింది వాడికి . నాకు చిన్న ఇత్తడి బిందె , తను పెద్ద బిందె , మా చిన్నన్నయ్యకు , చిన్న మామయ్యలకు కూడా చెరో స్టీల్ కాన్ . అందరం పోలో మని బయలు దేరాం .

                   ఎక్స్కర్షన్ కి వెళ్ళినంత థ్రిల్ తో .  కానీ షార్ట్ కట్ రూట్ అని ఏనెల్లో ( చిన్న రాళ్ళ గుట్టలు ) నుండి మా ప్రయాణం . ఒక చేత్తో బిందె , మరోచేత్తో లంగా అడ్డం పడకుండా ఎత్తి పట్టుకుని , హవాయి స్లిప్పర్లు రాళ్ళమీద జారకుండా బాలెన్సు చేసుకుంటూ , గెంతుతూ ..రెండు కిలో మీటర్లు నడిచి కాలవ గట్టుకి చేరాం . అది పంట పొలాలకి నీళ్ళిచ్చే కాలువ . కాలువ కింద నేల తడిగా , నీటి వూటతో లూజుగా ఉంది . కొద్దిగా వెతికి శుభ్రంగా ఉన్న చోట , తనతో తెచ్చిన అంచులేని ఇత్తడి గిన్నెతో తవ్వి , గుంత చేసింది మా పిన్ని . కొద్దిగా తవ్వగానే సన్న నీటి ఊట .. ఇంకాస్త లోతుగా తవ్వి , మొదట వూరిన నీళ్లన్నీ ఎత్తి పారబోసింది మా పిన్ని .  మరో అరగంట వెయిట్ చేసాక , గుంట నిండింది .. ఈసారి నీళ్ళు స్వచ్చంగా ఉన్నాయి . తనతో తెచ్చిన తెల్లటి బట్ట , మూడు మడతలు వేసి  బిందేలన్నీ మెల్లగా తనే నింపింది . మమ్మల్ని అస్సలు ముట్టుకోనివ్వకుండా .. మురికి అవుతాయని ..మాకు దోసిళ్ళలో పోసి రుచి చూపించింది కూడా .. తియ్యగా ఉన్నాయి నీళ్ళు . ఇదంతా రెండుగంటలు పట్టింది . తిరిగి ఇంటికి బయలుదేరాం . నేను బిందె తలమీద , భుజమ్మీద మోయలేక పోయా . నడుము మీద పెట్టుకున్నా . లంగా ఎత్తి పట్టుకోవాలి . తడి చెప్పులకి మట్టి అంటి , జారుతున్నాయి . పైగా బిందెలో నీళ్ళు ఒలికి , డ్రెస్ తడిసిపోతోంది ..నడవడం కష్టంగా ఉంది . ఎండ మండిపోతోంది .. రాళ్ళ గుట్టమీద
జారి బోర్లా పడిపోయా .. రెండు మోకాళ్ళ
చిప్పలు పగిలి రక్తం .. మా పిన్ని నాకు తగిలిన  దెబ్బ కన్నా , బిందె సొట్ట పడిపోయిందని బాధ . అమ్మమ్మ తో తిట్ల భయం . ఇంతలో మా తమ్ముడు చెప్పులు మర్చిపోయాడు చెలిమ దగ్గిర . తనబిందే రాళ్ళమీద పెట్టి , మా అన్నయ్యవాల్లని కాపలా పెట్టి , నేనూ , పిన్ని , తమ్ముడు వెనక్కు వెళ్ళాము చెలిమ
దగ్గరికి . అక్కడ చెప్పులు లేవు .. మళ్ళీ నా
బిందె నింపుదామంటే , నీళ్లన్నీ మురికి అయిపోయాయి . మేకలు నీళ్ళు తాగుతున్నాయి కూడా . మళ్ళీ ఇంకో చెలిమ తవ్వాలి . ఇక లాభం లేదని వెనక్కు వచ్చేసాం . నేను కుంటుతూ ఎలాగో ఇల్లు చేరా . మా అమ్మమ్మ ఒకటే కంగారు . ఇంతసేపు అయిందే మని . మా పిన్ని జరిగిందంతా చెప్పింది . నా దెబ్బలకి పసుపు పెట్టి , చూసుకొని నడవాలని
దేప్పింది .  చెలిమ నీటి సరదా అలా తీరింది . మర్నాడు పెద్ద మామయ్య  ఎవ్వరూ మంచినీళ్ళు తేవద్దు . బిక్షం సైకిల్ మీద తెస్తాడు అని చెప్పేసాడు . అటు తరువాత మరో రెండు సార్లు చెలిమ కి వెళ్ళినట్లు గుర్తు .. గౌను తోనే ..

        కాస్త  పెద్ద అయ్యాక అమ్మమ్మా వాళ్ళ వూరు వెళ్ళడం తగ్గింది . సావిత్రి పిన్ని పెళ్ళవడం , పెద్ద మామయ్య కి జాబ్ రావడం , చిన్న మామయ్య ఖమ్మం లో చదువు .. అమ్మమ్మే కోదాడ వచ్చేది . డాక్టర్ కి
చూపించుకోవాలని . రెండు బస్సులు మారి రావాల్సి వచ్చేది డైరెక్ట్  బస్సు లేక . బస్టాండు నుండి నడిచి వచ్చేది . రిక్షా ఎక్కోచ్చుగా అంటే .. 'రూపాయి దండగ . ఎందుకె ' అనేది . " నాకోసం ఏమి తెచ్చావు అమ్మమ్మా .." అంటే  " ఖాళీ చేతులు , చెప్పుల్లో కాళ్ళు " అనేది .. " ఏమి వంట చేసావ్" అంటే .. " గుండ్ల కూర , బెండ్ల పచ్చడి .. ఏదో ఒకటి అన్నీ తినేవే . తినడానికి అంటూ ఒకటి దొరకడమే ఎక్కువ .." అనేది . అన్నం మెతుకులు కింద పడకూడదు , "మెతుకు పోతే , బతుకు పోతుంది " అనేది .. ఇప్పటికీ నాకు అన్నం కింద పడితే ఎత్తి , కళ్ళకు అద్దుకోని ప్లేట్ లో వేసుకుంటాను అమ్మమ్మ మాట గుర్తుకు వచ్చి .
 కాలేజీకి వచ్చాక , లంగా వోణీ వేసుకుని " ఇప్పుడు బావున్నానా అమ్మమ్మా ..?" అని కొంటెగా అడిగితే ... " బాగానే ఉన్నావులే . రేపు నిన్ను చేసుకునే వాడి సంపాదనంతా నీ బట్టలకీ , చెప్పులకే చాలదు .." అని కొంగు అడ్డం పెట్టుకుని నవ్వేసేది అమ్మమ్మ . డిగ్రీ లో ఉన్నప్పుడే అమ్మమ్మ దైవ సాన్నిధ్యం పొందింది .. తను నేర్పిన జీవిత విలువలు అన్యాపదేశంగా మా మీద ప్రభావం చూపిస్తూ ..మమ్మల్ని మనుషులుగా నిలబెట్టాయి..🙏🏼🙏🏼

     ----సమాప్తం 🙏🏼
చదివి ఆదరించిన మితృలందరికీ  శతకోటి ధన్యవాదాలు ..💐🙏🏼💐

💦💦💦💦 చెలిమ నీరు -3 💦💦💦💦💦

💦💦💦💦చెలిమ నీరు -3 💦💦💦💦

        అమ్మమ్మ వాళ్ళ వూర్లో  కాలక్షేపం కూడా పెద్ద సమస్యే ! పిల్లలమైనా మాకు తోచేది కాదు . ఇల్లుదాటి బయటికి వెళ్లనిచ్చేది కాదు అమ్మమ్మ . పాత వూరు పాలేరు వరదల్లో మునిగిపోతే , కాస్త దూరంగా ఈ వూరు నిర్మించుకున్నారు . విశాలమైన నాలుగు వీధులు , దూరం , దూరంగా ఇళ్ళు. మా ఈడు పిల్లలు కనిపించే వారే కాదు . పెద్ద పాటక్ ( గేటు ) ఎప్పుడు వేసి వుండేది . ఇంటిముందు పెద్ద ఖాళీ స్థలం . ఇంటివెనక  పెద్ద చెట్లు ఉన్న దొడ్డి .., ప్రక్కనే పశువుల కొట్టం , వెనుక గడ్డి దొడ్డి (ఎండు గడ్డి ) ఉండేవి . ఊరంతా నిశ్శబ్దంగా ఉండేది అదేమిటో .బిచ్చగాళ్ళు కూడా వుండే వారు కాదు ఆ వూర్లో .

         మాది చిన్న పల్లె అయినా .. సందడిగా ఉండేది . గుడి , పక్కనే బడి . గుడి
వెనుక పెద్ద రావి చెట్టు , బోలెడు నీడ . పిల్లలందరం గుడి చుట్టూ పరుగులు పెడుతూ ఎన్ని ఆటలో . మా ఈడు పిల్లలు ఎందరు వుండేవారో .. బొమ్మరిళ్ళు కట్టడం , గృహ ప్రవేశాలు , బాదం
ఆకుల్లో భోయనాలు , బొమ్మల పెళ్ళిళ్ళు , ఆ బొమ్మల్ని బుజ్జి మేనా లో లేదా , తాటి ముంజ కాయల చక్రాలతో చేసిన బండి ని  రంగు కాయితాలతో అలంకరించి పల్లకీ  చేసి , గుడిలో దండం పెట్టించే వాళ్ళం . దూదేకుల
, ముతరాస , చాకలి , బ్రాహ్మణ , రెడ్డి అందరి పిల్లలు కలిసి మెలిసి ఆడుకునే వాళ్ళం .  మా ఇంట్లో నే పంచాయితీ ఆఫీసు . ఒక గదిలో రెండు పెద్ద ఇనుప బీరువాల నిండా పుస్తకాలు . ఏవో కవితలు , పిల్లలకథల పుస్తకాలు వుండేవి .. మంచి రచనలు, పేరున్న
రచయితల పుస్తకాలు  కాకపోయినా .. ఏదో కాలక్షేపానికి బాగానే ఉండేవి .  అమ్మ బోలెడు పత్రికలూ , చందమామ , బాలమిత్రతెప్పించేది . పత్రికలలో కార్టూన్స్ చదువుకునే వాళ్ళం .మా   బంధువులు  కూడా చాలా మంది ఉండే వారు .  మాకు సెలవుల్లో కూడా రోజు సరిపోనంత బిజీగా , పరుగులు ,
ఆటలూ ఉండేవి .


               అమ్మమ్మ వాళ్ళ యిల్లు , ఆ వూరి పూజారి గారి యిల్లు అంతే తెలుసు మాకు . అది కూడా , అమ్మమ్మ ఇంట్లో భావి ఎండి
పోతే .. వాళ్ళింటి నుండి నీళ్ళ మోత వుండేది కాబట్టి .  ఎంత బోర్ కొట్టేదో అక్కడ .
వెళ్ళిన రెండు రోజులకే , ఎప్పుడు వెళ్లిపోతామా అని ఎదురు చూపులు మొదలయ్యేవి .  అమ్మా వాళ్ళు యాత్రలు ముగిసి వచ్చినా , వెంటనే బండి పంపేవారు కాదు మా కోసం . ఆరోజుల్లో ఎద్దుల బండి
ప్రయాణమే ! జీతగాళ్ళు తీరికగా ఉండి , ఎద్దులు , బండి ఖాళీ అయ్యేవరకు మాకు ఈ అజ్ఞాత వాసమే !

(సశేషం )

💦💦💦💦💦చెలిమ నీరు -2💦💦💦💦💦

💦💦💦చెలిమ నీరు -2💦💦💦💦


 
               తాతయ్య పట్వారీ గా చేసేవారు . ఆవూర్లో పంటపొలాలూ , పెద్ద ఇల్లూ ఉన్నాయి . ఆయన ఎప్పుడూ నవ్వుతూ , జోకులేస్తూ ఉండేవారని అమ్మా , పిన్నీ వాళ్లు చెప్పడమే .. మేం బాగా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే హార్ట్ ఎటాక్ వచ్చి పోయారట . దొరసాని గా పరదాలలో గడిపిన అమ్మమ్మ భుజాలపై నలుగురు పిల్లల బాధ్యత , పొలాలు , కౌళ్ళ గొడవలూ , అప్పులు ఎగ్గొట్టే వాళ్ళు , అప్పులు బాకీ ఉన్నారని గొడవ చేసిన వారూ, ఆస్తికోసం దాయాదుల
గొడవలూ .. ఒక్కసారిగా అమ్మమ్మను క్రుంగ దీశాయి . పెద్దల్లుడు మా నాన్న . అల్లుడి తో మాట్లాడడానికి , చూడడానికి ఘోషా పాటించే అత్తగారు  .. చిన్న వాళ్లైన బావమరదులు .. అతికష్టమ్మీద అందరితో
మాట్లాడి .. సమస్యలు తీర్చారు (ట) నాన్న. పెద్ద పెద్ద జరీచీరలూ , కణుం జాకెట్లూ , కచ్చడం బండ్లూ , పరదాలలో తిరిగిన అమ్మమ్మ .. ఆర్ధికంగా , మానసికంగా , ఆరోగ్య
పరంగా కూడా బాగా క్రుంగి పోయింది. వత్తిడి వల్ల    షుగర్  వ్యాధి , నీరసం వచ్చాయి .
             తెల్లగా , పొడుగ్గా , ఎత్తుకు తగ్గ లావుతో , ఠీవిగా ఉండేది కాస్తా , సన్నబడి ,నవ్వన్నది లేకుండా చిట చిట లాడుతూ ఉండేది . వంటలమీద , పోషణ మీద శ్రద్ధ ఉండేది కాదు కానీ మాకు కథలు మాత్రం చాలా చెప్పేది .
   
         నా  సమస్యల్లో , రెండోది , తిండి
తరువాతది నిద్ర సమస్య కదా .. ఆ వూళ్ళో కరెంటు ఉండేది కాదు . రెండు లాంతర్లు , రెండు బుడ్డి దీపాలు . ఒక లాంతరు ముందు వసారాలో తగిలించేవారు . ఒక బుడ్డి (గుడ్డి ) దీపం హాల్లో కిటికీలో , ఒకటి వంటింట్లో .. మరో లాంతరు మా పిన్ని పట్టుకుంటే , తనవేనకాలే తిరిగేదాన్ని భయం గా . ఎందుకంటే ఆ వూర్లో పాములు విపరీతం . పైగా త్రాచు పాములు ..ఎప్పుడూ వంటింట్లో పాము వచ్చింది , పందిరి మీద నుండి అమ్మమ్మ మంచం మీద
పాము ( ఆవిడ పడుకోకముందు ) పడింది , తలుపు వెనకాల , భావిదగ్గర అంటూ బోలెడు కథలు ఉండేవి .. చీకటి పడగానే నాలుగు మెతుకులు నోట్లో పడగానే మంచం ఎక్కేదాన్ని . ఒక పక్క అమ్మమ్మ మంచం , మరోపక్క పెద్ద మామయ్య మంచం ..మధ్యలో నా మంచం .. పైగా దయ్యాల కథలు ..భయం తో వణికి పోతూ ఉండేవాళ్ళం తమ్ముడు , నేనూ . మధ్యలో మెలకువ వచ్చినా , కళ్ళు
తెరవాలన్నా భయమే .. పైగా మా పెద్ద మామయ్య తెగ ఏడిపించేవాడు.. పాములు మంచం ఎక్కుతాయి , కాలు కిందపెడితే చుట్టుకుంటాయి .. కాటేస్తాయి అని ..రాత్రి పూట మాత్రం అమ్మమ్మ ప్రేమగా ధైర్యం చెప్పేది . బోలెడన్ని కథలు చెప్పేది . మా మూడో పిన్ని కి అప్పటికి పెళ్ళికాలేదు . తను కూడా చాలా కథలు చెప్పేది కానీ అన్నీ హారర్ కథలే .. దయ్యాలు , భూతాలు , రాక్షసులు అంటూ వర్ణించి చెప్పేది . మా రెండో అన్నయ్య బాగా వినేవాడు ఆ కథలు . సినిమా స్టోరీలు కూడా బాగా చెప్పేది . మా పిల్లగాంగు కి రౌడీ లీడర్ తనే . మా చేత పనులు చేయించేది . చెప్పిన మాట వినకపోతే ..
సామ దాన బేధ దండో పాయాలన్నీ ప్రయోగించేది ..నన్ను బాగా ఎడిపించేది మా రెండో అన్నయ్యతో కలిసి ...

(సశేషం )

 చెప్పాగా నాకు క్లుప్తంగా మాట్లాడడమూ రాదు .. రాయడం అంతకన్నా రాదు మరి ..

🙅🏻📝🙅🏻📝🙅🏻నిర్భయ ఆత్మ ఘోష🙅🏻📝🙅🏻📝🙅🏻

ఈరోజు ఉదయమే అమితాబ్ రాసిన ఈ కవిత నాకు వాట్సప్ లో వచ్చింది .. నా మనసును బాగా కదిలించింది ..తెలుగులోకి అనువాదం చేయాలనిపించింది .. నాకు అంత విద్వత్తు లేదని తెలుసు .. అయినా మనసాగలేదు .. ఏదో .. ఇలా రాయగలిగాను .. పెద్దలు ..తప్పులుంటే మన్నించగలరు ..🙏🙏🙏
_________________________

🙅🏻📝🙅🏻📝🙅🏻నిర్భయ ఆత్మ ఘోష🙅🏻📝🙅🏻📝🙅🏻


Amitabh Bachchan Pays
His Tribute to Delhi Rape
Victim With His Poem:
-------------
Must Read & Share..
(Very Touching..)

Maa Bahut Dard Seh Kar,
Bahut Dard De Kar..
Tujhse Kuchh Keh Kar
Main Jaa Rahi Hu..

Aaj Meri Vidaai Mein Jub
Sakhiyaan Milne Aayengi..
Safed Jode Mein Mujhe Lipta
Dekh Sisak-Sisak Marr Jaayengi..

Ladki Hone Ka Khud Pe
Phir Wo Afsos Jataayengi..
Maa Tu Unse Itna Keh Dena,
Darindon Ki Duniya Mein
Sambhal Kar Rehna..

Maa Rakhi Par Jub Bhaiya
Ki Kalaai Sooni Reh Jaayegi,
Yaad Mujhe Kar-Kar Jub
Unki Aankh Bhar Aayegi..

Tilak Maathe Par

Karne Ko
Maa Rooh Meri Bhi
Machal Jaayegi..

Maa Tu Bhaiya Ko
Rone Na Dena,
Main Saath Hu Har Pal
Unse Keh Dena..

Maa Papa Bhi
Chhup-Chhup Ke
Bahut Royenge..

Main Kuchh Na Kar
Paaya Ye Keh Ke
Khud Ko Kosenge..

Maa Dard Unhein Ye
Hone Na Dena,
Ilzaam Koi Apne Sar
Lene Na Dena..

Wo Abhimaan Hain Mera
Sammaan Hain Mera,
Tu Unse Itna Keh Dena..

Maa Tere Liye Ab Kya Kahoon,
Dard Ko Tere Shabdon
Mein Kaise Baandhoon..

Phir Se Jeene Ka
Mauka Kaise Maangu,
Maa Log Tujhe Sataayenge
Mujhe Aazaadi Dene Ka
Tujhpe Ilzaam Lagaayenge..

Maa Sub Seh Lena Par
Ye Hargiz Na Kehna
"Agley Janam Mohe
Bitiyaa Na Dena"
📝 😷
__________________________
🙅📝📝🙅నిర్భయ ఆత్మఘోష 🙅📝📝🙅

           - అమితాబ్ బచ్చన్

అమ్మా ! ఎంతో బాధను భరిస్తూ
మరెంతో కోతను నీకిస్తూ
నా వ్యధను నీతో కాస్త చెప్పుకొని
నేను వెళ్లి పోతున్నా !

నేటి నా  అంతిమ  వీడ్కోలులో
నన్ను చూడాలని నా స్నేహితురాళ్ళు వస్తారు ..
తెల్లటి వస్త్రంలో చుట్టిన నా శరీరాన్ని చూసి
ప్రాణం పోయేంతగా కుమిలి - కుమిలి ఏడుస్తారు ..
ఆడపిల్లలుగా పుట్టినందుకు వారిపై వారికే
మళ్లీ పశ్చాత్తాపం కలుగుతుంది
అమ్మా ! వాళ్ళతో నా మాటగా చెప్పు ..
"ఈ దుర్మార్గపు ప్రపంచంలో ..
అతి జాగరూకతతో మెలగమని .."

అమ్మా! రాఖీ రోజు నా
సోదరుని చేయి చిన్నబోతుంది ..
నన్ను పదే పదే గుర్తు చేసుకొంటూ ..
తన కళ్ళు కన్నీళ్లు నింపు కొంటాయి ..

తన నుదుట తిలకం దిద్దాలని
నా ఆత్మ కూడా పరితపిస్తూ ఉంటుంది
అమ్మా ! నువ్వు నా సోదరుని రోదించనివ్వకు ..
అనుక్షణం నేను తనవెంటే ఉంటానని చెప్పు !

అమ్మా! నాన్న కూడా లోల్లోపల
చాలా కుమిలిపోతుంటారు ..
తానేమీ చేయలేక పోయానని
తనని తానే నిందిన్చుకుంటారు

అమ్మా! తననస్సలు బాధ పడనీయకు
ఎలాంటి ఆరోపణలు తలకెత్తు కోనీయకు ..
నాన్నే నా అభిమానం ..
ఆయనే నా ఆత్మగౌరవం ..
ఈమాట మాత్రం తప్పక చెప్పు !

అమ్మా ! ఇక నీకేం చెప్పనూ ..
ఈ బాధనంతా మాటల్లో ఎలా  మూట కట్టనూ...
మళ్ళీ జీవించాలని ఉందని ఎలా అడగనూ ..?

ఈ జనం నిన్నే తప్పుపడతారు
నాకింత స్వేచ్చ నిచ్చినందుకు ..
నీపై దోషాన్ని మోపుతారు
అన్నీ సహనంతో భరించు .. కానీ ..
అమ్మా !ఒక్కటి మాత్రం ఎప్పటికీ అనకేం ..
"వచ్చే జన్మలో మాత్రం నాకు
ఆడపిల్ల నివ్వకు  భగవంతుడా " అని !!
📝😭😷📝😭😷📝😭😷📝😭😷📝
తెలుగు అనువాదం : ఉషారాణి నూతులపాటి

18/03/2015

Monday 2 May 2016

💦💦💦💦 చెలిమ నీరు -1 💦💦💦💦💦

💦💦💦 చెలిమ నీరు 💦💦💦💦💦

ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలుగా వర్షాల్లేక , భూగర్భ జలాలు అడుగంటిపోయి , నీటి ఎద్దడి విపరీతంగా పెరిగిపోయింది . చుక్కనీటికోసం మనుషులు , జంతువులు ఇంకా పక్షులు అల్లాడిపోతున్నారు . వర్షాలు పడితే అతివృష్టి , పడకపోతే అనా వృష్టి అతి సాధారణమై పోయింది మనదేశంలో . ఎందుకిలా ? సైన్సు ఇంతగా అభివృద్ధి చెందినా , జలవనరుల పొదుపు , జాగ్రత్త , వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడం లోని మెళకువలు , ఎందుకు మెరుగు పర్చుకోలేక పోతున్నాం ? మురుగునీటి వ్యవస్థ సరిగ్గాలేక ,చిన్న వర్షాలకే రోడ్లు , ఇళ్ళు , మునిగిపోతాయి . అప్పటికప్పుడు , తాత్కాలిక చర్యలతో సరి . మరుసటి ఏడు వర్షాభావం .. మళ్ళీ వర్షాలు పడితే గానీ , వేడి పుట్టదు. మళ్ళీ మరుసటేడు ఇంకో ప్రభుత్వం వస్తుంది .. తప్పంతా పాత ప్రభుత్వానిదే .. వీళ్ళూ ఏమీ చేయరు . ఈ విష చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది . ఇక్కడ మనుషుల జీవితాలకు , 

ప్రాణాలకు విలువ , భద్రత లేవు మరి !

           నాకు ఉపన్యాసాలు , ఆవేశపూరిత కవితలూ , ప్రశ్నించడం రాదు . బాధ వుంటుంది .. కానీ కవితలు రాయను /రాయలేను కూడా..ఎవరైనా రాస్తే వారితో బాధను పంచుకోగలను. అంతే ..

           మన దేశంలోని ప్రస్తుత నీటి సమస్య  కొత్తదేమీ కాదు . ఇంతకు ముందు , ఇప్పుడు , ఇకముందు కూడా ఉంటుంది . నాకు 6,7 సంవత్సరాల వయసున్నప్పుడు , ఎండాకాలం సెలవలకి మా అమ్మమ్మగారి వూరు వెళ్లాం . అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడం అందరికీ ఇష్టమే కదా . కానీ నాకు కొంత అయిష్టం వుండేది . ఇష్టం లేకపోయినా వెళ్లాల్సి వచ్చేది . అమ్మా , నాన్నా దక్షిణ దేశ యాత్రలూ , ఉత్తర దేశయాత్రలూ చేసేవారు . చెల్లి చిన్నది కాబట్టి అమ్మతో వెళ్ళేది . మిగిలిన నలుగురం కేరాఫ్ అమ్మమ్మ వూరు .

        మరి ఎందుకు ఇష్టం ఉండదూ అక్కడికి వెళ్ళడం ?  అక్కడ తిండి సమస్య , నీటి సమస్య , నిద్ర సమస్య .. టైం పాస్ కూడా సమస్యే !! తిండి సమస్య ఏంటంటే .. అమ్మమ్మ వాళ్లకు పాడి సమృద్ధి లేదు . రెండు ఆవులు పాలు ఇచ్చేవి . నీళ్ళపాలు .. మొత్తం కలిపి 1 లీటర్ కూడా ఉండేవి కావు . కొందామన్నా దొరకని పల్లెటూరు . నీటి ఎద్దడి . గడ్డి దొరక్కపోతే అవి పాలు ఎలా ఇస్తాయి ? ( ఇదంతా పెద్దయ్యాక వచ్చిన జ్ఞానం .. అప్పట్లో తెలిసేది కాదు ) . మాకు పాడి బాగా ఉండేది . మీగడతో గడ్డ  పెరుగు , పెరట్లో అమ్మ అన్ని రకాల ఆకు కూరలూ , కాయగూరలూ పండించేది . పైగా  జనం బాగా వచ్చిపోయే యిల్లు. ఉదయం టిఫిన్లూ , మధ్యాహ్నం రెండుకూరాలూ , పప్పు , పచ్చడి , నెయ్యి , పెరుగు ,వూరగాయలతో భోజనం.సాయంత్రం చిరు తిళ్ళు .. డబ్బాలకు డబ్బాలు చేసేది అమ్మ .  అమ్మమ్మ వాళ్ళింటికి వెళితే నో కాఫీ . మాకు పాలు తాగే అలవాటు చిన్నప్పటినుండీ లేదు . మా వంశంలోనే లేదు అని అమ్మ వెక్కిరించేది కూడా .. చిన్నప్పటినుండీ , గ్లాసు పాలల్లో కాఫీ వేస్తేనే తాగడం , లేకపోతే కక్కడం . విసుగు పుట్టి కాఫీలే తాగి చావండి అనుకుందేమో మరి . అమ్మమ్మ వాళ్ళింట్లో నీళ్ళ పాలు . వాళ్ళందరికీ టీ తాగడమే అలవాటు . పొద్దున్నే టీ తాగడం అంటే ఆముదం త్రాగినట్లే వుండేది మా అందరికీ . నేను కాఫీ కావాలని ఏడ్చేదాన్ని.. అప్పుడు వాళ్ళ వూర్లో వున్నా ఒకే ఒక్క కిరాణా షాపులో నో కాఫీ పొడి . కాఫీ బిళ్లలు దొరికేవి . అవి దంచి , డికాషన్ చేస్తే .. కాఫీ అంటే విరక్తి పుట్టేది . కంపు వాసన , వాన నీళ్ళు లాగా , ఎర్రగా ..పల్చగా . అంతకంటే టీ నే బెస్ట్ అనుకునేవాళ్ళం . మా రెండో అన్నయ్య కాఫీ నల్లుల వాసన అనేవాడు . అంత ఘోరం . 

ఇక కూరలు దొరికేవి కావు . మా అమ్మ మాతో పాటే .. 4,5 కిలోల ఆలుగడ్డలు , దోసకాయలూ , దొండకాయలూ ఆకుకూరలూ పంపేది . కానీ ఎన్నిరోజులు వస్తాయి ? అమ్మమ్మ డయాబెటిక్  పేషంట్ . తొందరగా అలసిపోయి చెయ్యలేకపోయేది . పైగా మడి, ఆచారం . ఉదయం నో బ్రేక్ఫాస్ట్ . చద్దన్నం , ఆవకాయ , నీళ్ళ మజ్జిగ . చద్దన్నం మా ఇంట్లో అసలు తినేవాళ్ళం కాదు . అన్నం మిగిలితే చాకలికి ఇచ్చేసేది అమ్మ . స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూడా వేడి అన్నమే , ఏదైనా కూరా , పెరుగు.  పైగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎర్రచీమలు విపరీతం . అన్నం నీళ్ళల్లో పెట్టినా , అన్నానికి , మజ్జిగకీ , ఆఖరుకి ఆవకాయకి కూడా చీమలు పట్టేవి . చచ్చినట్లు అవే తినాలి . కళ్ళు 'పత్తికాయల్లా ' తెరుచుకుని , వంచిన తల ఎత్తకుండా .. చీమలు ఏరుకుని , తీసేసి తినాలిగా మరి .  మా ఇంట్లో భోజనాలప్పుడు గొడవలు , 

గ్లాసులు విరుకోవడాలూ ..తిట్లు .. యుద్ధాలు 

జరిగేవి . అక్కడ ఆ అవకాశమే లేదు . నిశ్శబ్ద యుద్ధం .. సాయంత్రం ఎంత ఆకలేసినా తినడానికి ఏమీ ఉండేవికావు . అమ్మమ్మ ఆకలి అంటే .." ఆకలేస్తే రోకలి మింగండి .. ఈ పిల్లలకి  కి ఆకలి దయ్యం పట్టింది " అనేది . మళ్ళీ రాత్రికి నీళ్ళ మజ్జిగ అన్నాలే . మా రెండో అన్నయ్య , "మా ఇంట్లో పెరుగన్నం తిని చెయ్యి కడుక్కుంటే ఇంతకంటే చిక్కగా వస్తాయి నీళ్ళు " అనే వాడు . మా అందరిలో తెలివిగా మాట్లాడగలిగేది తనే . నాకు ఏడుపు తప్ప ఇంకోటి వచ్చేది కాదు . నాకంటే చిన్నవాడు తమ్ముడు . పాపం ఎలా తినేవాడో .. వాడికి తెలిసేది కాదేమో కూడా .

(సశేషం ... చాలా రాయాలి మరి..మీకు ఒకేసారి చదవాలంటే కష్టం అని .... ఇలా ముక్కలు , ముక్కలు గా చెప్తాను...)