Saturday 16 April 2016

నెమలి కన్ను

☘☘☘☘☘ నెమలి కన్ను..☘☘☘☘☘

నెమలి కన్ను ను చూస్తే బాల్యం గుర్తొస్తుంది..

పుస్తకాల్లో దాచుకొని, రోజూ పిల్ల పుట్టిందా లేదా ..

అని వెతుక్కుంటూ..ఒక రోజున అద్భుతంగా ..పక్కనే మరో సన్న ఈనె

కనబడుతుంది..అదేమిటో..అది పెరిగి మళ్ళీ ఇంకో నెమలి కన్ను

అయిపోతుందనే భావన..పక్కనున్న స్నేహితురాలు చెప్తుంది కూడా..

ఇదిగో..నా నెమిలీక ఎంత పెద్దగా అయ్యిందో అని..

మరి మన నెమిలీక అలా ఎప్పటికి పెరుగుతుందో అని ఆశ..

ఎవరిని అడగాలి..? అమ్మని అడిగితే నవ్వేస్తుంది..'నువ్వు పాలు తాగితే

అదే పెరుగుతుంది 'అని మాయచేస్తుంది..

అన్నని అడిగితే..'మొద్దూ..నెమిలీక పిల్లలు పెడుతుందా ..?'అని

వెక్కిరింత..అక్కకి చూపిస్తే..తన చెంపలకి మృదువుగా రాసుకొని..

మై మరచిపోతూ .'.ఎంతబావుందో..నాకివ్వరాదుటే'..అనేస్తుంది.

చేల్లికేం తెలీదు..లాగి చిమ్పేస్తుంది..

ఫ్రెండ్స్ కి చూపిస్తే..'అమ్మో..నేను చూడకుండా కొట్టేయ్యరూ..'

మరెలా..? ఎలా తెలుస్తుంది..'నెమిలీక పిల్లలు పెడుతుందో లేదో..?'

అందుకే..అలా పుస్తకాల్లో దాచుకొని చూసి మురిసిపోవడం..

ఎప్పటికైనా నా నెమిలీక పిల్లలు పెట్టకపోతుందా  అని..

అందుకే..నా అమాయక బాల్యం నాకెంతో ఇష్టం..!!!


         ----------Usha

-----------------26/04/2014


Friday 15 April 2016

మురళీ ధరుడు

🎼🎼🎼🎼మురళీ ధరుడు 🎼🎼🎼🎼



నిన్నటివరకు నేనెవరిని ?
అనామక గడ్డి మొక్కని..
ముళ్ళ పొదని..
నాలోనేనే  ఒక పిచ్చి లోకంలో..
మురిసిపోతూ ,కలలు కంటూ
ఎంతవృధాగా జీవించానో .. ఇన్నాళ్ళూ , ఇన్నేళ్ళూ
నాకంటూ ఓ అస్థిత్వం లేకుండా
 భావ హినమైన  మానులా, జీవం లేని మోడులా ,
రసహీన మైన మధువులా...
నువ్వు నన్ను చూసావు
నీ చల్లని చేతులతో తాకావు
నా తనువును మీటావు
నాలోని రాగాలను మేల్కొలిపావు
నీ పెదవులతో ఊపిరులూదావు
ఎంత అధ్భుతం !
ఎన్నెన్ని రాగాలు ? సరాగాలు..
నయగారాలు ,సోయగాలు నాలో ఇపుడు
నా తనువు పులకించి పోతోంది నీ ఊపిరితో... .
ఇప్పుడు నేను నేను కాదు..
నేను లేనే లేను , నీలోనే నేను..
నేను లేక నీవూ ,నీవు లేక నేనూ లేము
నీ శ్వాస నా తనువు గుండాఅల్లనల్లన సాగుతుంటే..
ఎంత చక్కని రవళి
వసంత మోహనరాగం
ఆనంద పరవశం ..నీతో రమిస్తూపరవశిస్తూ ,నా  తనవు పులకించగా
బ్రతుకే పల్లవించగా
జగమే పులకించగా
కృష్ణా !మొన్నటి వరకూ నేనో గడ్డిమొక్కని
వెదురు కొమ్మని
నేడు నీ వేణువుని
నీ మురళిని
నీవు మురళీధరుడవు
 మనది విడదీయలేని బంధం!!

(15/11/2014)
-————ఉష

ఆలూ స్నానం

A sweetest memory of 2014...
         

🎃🌷🎃🌷🎃🌷🎃 ఆలూ స్నానం  🎃🌷🎃🌷🎃🌷🎃


 3.40 అయ్యింది  మధ్యాహ్నం . నేను లాప్టాప్ లో ఎదో టైప్ చేస్తున్నా.
సిద్ధాంత్ స్కూల్ నుండి వచ్చాడు, స్కూల్ వాన్ లో .  నేను గమనించనట్టుగా  నా పనిలో వున్నా. యూనిఫాం మార్చుకొని, దగ్గరికి వచ్చి..” ఇగో అమ్మమ్మా ! ఆలూ స్నానం సూపర్ “ అన్నాడు. నాకు అర్ధం
కాలేదు. “ ఏమంటున్నావ్ సిద్ధాంత్..? ఆలూ స్నానం ఎన్టీ ..?” అన్నాను .

అసలే పవర్ లేదు. చిరాగ్గా వుంది ,గాలి లేక . లాప్టాప్ ఫుల్ చార్జ్ చేసివుంది కాబట్టి టైపింగ్ అవుతోంది. సమాధానం రాలేదు .ఏమిటా అని చూస్తే ..కొంటెగా నవ్వుతున్నాడు..మెరుస్తున్న కళ్ళతో. “  ఏంటి
సిద్ధాంత్..? చెప్పు మళ్ళీ ..” అన్నా .. వాడు..” అదే నువ్వంటావ్ గా , టమాటా స్నానం , ఆలూ స్నానం ..అదే..” అన్నాడు.
  అప్పుడు వెలిగింది నా ట్యూబ్ లైట్ బుర్ర .  పెద్దగా నవ్వేసా. వాడూ నవ్వాడు. అమ్మో ..ఎంత కొంటె వెధవ అని పించింది.
   

               మీకు అర్ధం అయ్యిందా..? ఏం లేదండీ..నేను వాడికోసంబేబీ
పొటాటోస్ తో  ‘ఆలూ బాత్ ‘చేసి, లంచ్ బాక్స్ లో పెట్టి పంపించా .
అప్పుడప్పుడు టమాటో బాత్ కూడా చేస్తా..వాడికిష్టం అని . కొద్దిగా స్పైసీ
గా ..కారం లేకుండా ..అదన్నమాట ..నామీద జోక్.
       నువ్వు’ బాత్ ‘ అనిఎందుకంటావు..రైస్ అనొచ్చుగా, బాత్ అంటే స్నానం  అని వాడి వాదన.

       ‘భాత్’..అంటే అన్నం అనే అర్ధం ..మా అమ్మ , మా చిన్నప్పుడు
అలాగే చెప్పింది..అందుకే నాకు అలా  అనడం అలవాటు అయ్యింది అంటే..వాడికి  తమాషా గా వుంది. అమ్మో ఇప్పటి పిల్లలు గడుసు పిండాలు సుమా..!! 😂😂

Thursday 14 April 2016

🌹 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌹

👏శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

👏సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.

🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹

 అత్మీయులైన మీకందరికీ...
శ్రీరామనవమి శుభాకాంక్షలు.

🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹



శ్రీ రామ రామ రఘునందన రామరామ

శ్రీ రామ రామ భరతాగ్రజ రామరామ

శ్రీ రామరామ రణకర్కశ రామరామ

శ్రీ రామరామ శరణం భవ రామరామ !

*             *             *

శ్రీరామ చంద్ర  చరణౌ మనసా స్మరామి

శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి

శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి

శ్రీ రామచంద్ర చరణౌ చరణం ప్రపద్యే !

*               *              *

మాతా రామో. మత్ పిత రామచంద్ర

భ్రాతా రామౌ మత్ సఖా రాఘవేశః

సర్వస్వం మే రామ చంద్రో దయాళు

నాన్యం జానే నైవ జానే  నజానే !



*               *               *
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం !

*                *               *
శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం

సీతాపతిం ,రఘుకులాన్వయ రత్న దీపం

ఆజాను బాహుం , అరవింద దళాయ తాక్షం

రామం ,నిశాచర వినాశకరం నమామి

*.                 *.                  *

శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !!

శ్రీ రామ జయరామ జయ జయ రామ !

💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼

🌹🌹శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!🌹🌹



Wednesday 13 April 2016

ఉప్పుడు పిండి

                           🍚🌿🍚🌿 ఉప్పుడు పిండి  🌿🍚🌿🍚

ఉప్పుడు పిండి అంటే బియ్యం రవ్వతో చేసే , శనివారం ఫలహారం గుర్తొస్తుంది చాలా మందికి ..వరంగల్ సైడు వారు బియ్యప్పిండి తో చేస్తారు .. చాలా సులువుగా తయారయ్యే ఒక ఉపాహారమే ఇది .. చాలామందికి తెలియకపోవచ్చు ..పెద్ద వస్తుసామాగ్రి అవసరమూ ఉండదు .. బియ్యప్పిండి ఉంటేచాలు .. మూకుడులో కాస్త నూనె వేడిచేసి  , పోపు దినుసులు వేసి  వేయించి , ఒక కప్పు నీళ్ళు పోయాలి . ఉప్పువేసి , మరిగినతరువాత రెండు కప్పుల పిండి వేసి
బాగా కలపాలి . పొడి పొడిగా , కమ్మటి వాసనతో అయిదు నిముషాల్లోపే ఉప్పుడు పిండి తయారౌతుంది . అల్లము , పచ్చిమిర్చి
, కారట్లు, టమాటాలు , కరివేపాకు , కొత్తిమీర
లాంటివేమీ అక్కర్లేదు . .. కాసేపు సన్న
సెగమీద ఉంచితే .. ఘుమ ఘుమలాడే ఉప్పుడు పిండి తయారు . చిక్కటి / పల్చటి మజ్జిగ వేసుకుని తినాలి .. ఇంకేమీ అక్ఖర్లేదు .. నాకైతే చిన్న గ్లాసు పాలు వేసికుని తినడం ఇష్టం .. మా అమ్మకు లాగా.. మా
అన్నదమ్ములకీ , చెల్లికీ  ( అయిదుగురికీ ) ఈ వంట చాలా ఇష్టం . మా నాన్నకి ఇష్టం ఉండేది కాదు . ఎత్తు కెత్తు అల్లం పచ్చిమిర్చి , జీడిపప్పు నెయ్యి వే(పో) సిన ఉప్మా తప్ప !

        నేను .. చాలా సంవత్సరాల తరువాత బ్రేక్ఫాస్ట్ కి ఉప్పుడు పిండి చేసుకున్నా ..సో
వ్హాట్ ..అనేగా మీ ఎక్స్ ప్రెషన్ ? ఈ ఉప్పుడు పిండి అంటే ఇంత ఇష్టం కలగడానికి మరో ఫ్లాష్ బాక్ ఉంది ..
          మా అమ్మమ్మగారి పుట్టిల్లు వరంగల్ .
అక్కడ దేశముఖ్ వంశానికి చెందిన జమిందారులు వారు . మా అమ్మమ్మ తల్లిగారి పేరు తారాబాయి . మాకు బాగా బుద్ధితెలిసేవరకు అంటే 7,8 సం. వయసువరకు వారు జీవించి ఉన్నారు .  సన్నగా , తెల్లగా , తెల్లటి జుట్టి , తెల్ల రవిక , సన్నటి అంచు , చిన్న  గడులున్న ( చెక్స్) చీర
కాశ ( గోచీ ) పోసి కట్టుకునేది . ఎప్పుడు నోట్లో పాన్ , కళ్ళకు సుర్మా పెట్టుకునేది. బోసి నోరు, నవ్వు ముఖం .. ఎప్పుడు కోపం వచ్చేది కాదు పెద్దమ్మమ్మకి .. తాతమ్మ అనాలి కానీ , మా మామయ్యలు , పిన్ని వాళ్ళు అమ్మమ్మ అంటుంటే మాకూ అదే అలవాటు అయ్యింది .
       విచిత్రం ఏమిటంటే .., రజాకార్ల దాడులు , మత మార్పిడులు జరిగే రోజుల్లో ,
పెద్దమ్మమ్మ , ముత్తాతగారు , వారి పెద్ద కూతురు , కొడుకు లను ముస్లిం మతం లోకి
బలవంతంగా మార్చారట !  ఆ తరువాత కూడా వారు అవేపద్ధతులు పాటించారు .
 హిందూ ఆలయాలని దర్శించేవారు కాదు . హిందూ దేవుళ్ళని పూజించేవారు కాదు . రోజు 5 సార్లు నమాజు చేసేవారు . తలమీద చీరకొంగు జారనిచ్చేది కాదు . పేరంటాలు ,
బొట్టు ( భర్త ఉన్నప్పుడు )పెట్టుకోవడం ఏమీ చెయ్యలేదుట.  మేడలో కేవలం నల్లపూసలు వేసుకునేదట . మేము పుట్టకముందే ఆవిడ భర్త్రుహీన . ఆవిడ నమాజు చేస్తుంటే మేము ఆశ్చర్య పోయేవాళ్ళం . మరో విచిత్రం ఏమిటంటే , పెద్ద కూతురు , కొడుకు తరువాత పుట్టిన ముగ్గురు కూతుళ్ళు , (మా అమ్మమ్మ , మరో ఇద్దరు చెల్లెళ్ళు  )హిందువులుగా పెరిగారు . వారి పేర్లు , కట్టు , బొట్టు సాంప్రదాయం అంతా .. పెద్ద కూతురు రంజనీ బాయి . మా అమ్మమ్మ శారద , తరువాత ద్రౌపది , సుగుణ .. చూసారా తేడా ?  మా అమ్మకి పెద్దమ్మ అయిన రంజనీ బాయి గారి భర్త , పిల్లలు హిందూ బ్రాహ్మణ సాంప్రదాయం . ఆవిడ మాత్రం నమాజు చెయ్యడం , తల మీద కప్పుకోవడం , సుర్మ , పాన్ అంతా మహమ్మదీయ సాంప్రదాయం . కాకపోతే మాంసాహారం కాకుండా , సాత్వికమైన శాఖాహారులు .  ఎంత నిబద్ధత చూడండి బలవంతపు మార్పిడి అయినా .. ఎవరు చూడొచ్చారు వీరు మతం ఫాలో
అవుతున్నారా లేదా అని ? కానీ వారు అలా చేయలేదు .
    పెద్దమ్మమ్మ పిల్లలందర్నీ ఎంతగా ప్రేమించేదో .. తన మనవలూ , ముని మనవలమైన మమ్మల్ని కూడా .. అనర్గళంగా కథలు చెప్పేది . సింద్ బాద్ , అరేబియన్ నైట్స్ కథలు , పంచ తంత్ర , తెనాలి రామ
లింగడి కథలు , ఎన్ని చెప్పేదో ! రాత్రి అవగానే అమ్మమ్మ చుట్టూ చేరే వాళ్ళం .
         అయితే ఆవిడ రాత్రిపూట అన్నం తినేది కాదు . చపాతీలు కూడా తినేది కాదు పళ్ళు లేవు కదా .. ఉప్పుడు పిండి చేసుకునేది .. నమాజు చేసుకునేది .. మళ్ళీ
మడీ , అంటూ , సొంటూ అనేది .. తనే కుంపటిమీద బుజ్జి గ్లాసుడు పిండి తో చేసుకునేది .. మాకు ఆవాసన ఘుమ ఘుమ బాగా నచ్చేది . వెంటనే ఆవిడ దగ్గర చేరి కొంచం పెట్టావా అమ్మమ్మా .. అని అడుక్కునే వాళ్ళం .. అమ్మా, పిన్నీ వాళ్ళు తిట్టేవారు . "ఆవిడ చేసుకునేదే చారెడు పిండి , దానికి కూడా
ఎగబడతారు , కరువుగొట్టు పిల్లలు " అని .. కానీ అవన్నీ తెలుసుకునే వయసు కాదు , తిండి యావ తప్ప .. "పోనీ లేవే , పిల్లల్ని తిట్టకండి " అని మాకు , పేపరు ముక్కల్లో గుప్పెఫు ఉప్పుడు పిండి , ఎత్తి పోసేది .. అంటు కదా మళ్ళీ ..ఎంత రుచిగా ఉండేదో ..ఆ మధురమైన రుచి ఎప్పటికీ మర్చిపోలేని విధంగా .. ఆ మాట మా అమ్మావాళ్ళు కూడా అనుకునేవారు ..
"అమ్మమ్మ ఉప్పుడు పిండి భలే చేస్తుంది "
అని .. నా కూతురు కూడా "అమ్మమ్మ ఉప్పుడు పిండి  సూపర్  గా చేస్తుంది "
అంటుంది .. మరి నా మనవళ్ళు
అసలు తిననే తినరు .. కాబట్టి నాకు ఆ చాన్స్ లేదు .. అమ్మ వంటా , అమ్మమ్మల వంటా .. వారి ప్రేమను
అనుభవించిన వారికే తెలుస్తాయి కదా !
ఇదీ ఉప్పుడు పిండి ఫ్లాష్ బాక్ ..

నేను చేసిన ఉప్పుడు పిండి కూడా ఓకే .. బానే ఉంది ..మీరూ ట్రై చెయ్యండి .. పాలతో తినడం మర్చిపోవద్దు  సుమా ..

                       🍋నిమ్మకాయ పప్పు 🍋- నా డయటింగు 


   ఈ రోజు నిమ్మకాయ పప్పు ,కొబ్బరి పచ్చడి,కారట్  ఫ్రై  చేసా .(మేం అడిగామా మీరేం వండుకున్నారో ? రోజూ వండుకునేవి కూడా చెప్పి చావగొట్టాలా తల్లీ !) మధ్య మధ్య ఫేస్బుక్ లో ,గుడ్మార్నింగ్స్ , హాపీ బర్త్ డే ,లైక్స్, కామెంట్స్ పెడుతూ ..కష్టపడి వంట పూర్తిచేసా .. ఈలోపే మావారి ఫోన్ .."వంట అయ్యిందా ..భొయనానికి రావచ్చా "అని.  ఫాక్టరీ పక్కనే ఉన్నాయి మా క్వార్టర్స్  .టైం 12 గంటలే  అయ్యింది  .  ఉదయం మామిడి పండు ముక్కలు తిని వెళ్ళారు పాపం,ఆకలి వేస్తుందేమో అని.."సరే రండి "అన్నా.  ఈ మధ్య రోజూ బ్రేక్ఫాస్ట్ మాంగోనే .  మరి "పరకలు ,పరకలుగా "వస్తున్నాయి ఎవరో ఒకరు పంపించారని . "నాకు ఇంట్లో అభిమానులు లేరు గానీ , బయట చాలామంది ఉన్నారు " అంటున్టారాయన దెప్పి పొడుపుగా .. "మరిహనేఁ .. అవ్వే తింటే సరి. అనవసరంగా కుళ్ళ బెట్టడం ఎందుకూ ...." అని అవే బ్రేక్ఫాస్ట్ . 

                 5నిముషాల్లో వచ్చేసారు .. ఇద్దరం కలిసి తిందామంటే నాకు పొట్టలో అన్నం గంట మోగలేదు మరి .. 2 కొడితేనే గానీ ముద్దదిగదు నాకు. అందుకే ఆయనొక్కరికే పెట్టా . వేడి ,వేడి అన్నం లో నిమ్మకాయ పప్పు కలుపుతుంటే , కమ్మటి వాసన వచ్చి ,నోట్లో లాలాజలం వూరింది . 
          
                   ముద్ద నోట్లో పెట్టుకోకముందే , "బావుందా?" అని అడిగా . నామొహం లో ఆత్రతా ,నోరు వూరుతున్నట్లు గ్రహించి ,ఒక పెద్దముద్ద నా చేతిలో పెట్టారు . 'ఆమ్ ' అని మింగేసా .! ఎంత బావుందో .. నవ్వి మరో ముద్ద  కూడా పెట్టారు ..'గుటుక్' మనిపించా . (అబ్బ..దిష్టి పెట్టకండి బాబూ .. పెళ్ళయ్యి 30 యేళ్ళయ్యింది . ఆమాత్రం ప్రేమ ఉండదా ఏం ?) ;) 

                      ఇహ ఆయన ఆఫీస్ కి వెళ్ళగానే ,కంచం పెట్టుకుని ,అన్నం,నిమ్మకాయ పప్పు కలిపి పెద్ద వాయ లాగించా. ' ఆహా ఏమి రుచి ' అనుకుంటూ . ఎంతైనా నేను వంట బాగా చేస్తాను సుమండీ ( నీ మొహం నిమ్మకాయ పప్పుకి పేద్ద కళా కౌశలం ఏమీ అక్ఖర్లేదు లెస్తూ .. ) మళ్ళీ మరో పెద్దవాయి కొబ్బరి పచ్చడి కలిపి లాగించా .. కారెట్ కూర సంగతి పెరుగాన్నానినికి అప్పజెపుదాం లే అని . గడ్డపెరుగు తో భోజనం ముగించా. ' ఓస్ .. అన్నం తినడానికి అంత మొహం వాపిరి ఎందుకమ్మా ' అనేగా మీ సందేహపు డౌట నుమానం ? 
    
                   నేను రోజూ తినేది ' పులకాలు ' కదామరి .. అబ్బబ్బా  ఎవరి ' కాలూ ' కాదు . గోధుమ పుల్కాలు . రెండు  పూటలా అవే తినేది . " ఓహో అన్నం తింటే లావుగా , పుల్కాలు తింటే సన్నగా అయిపోతారా .." అంటారేమో.  సన్నబడటం మాట దేవుడెరుగు , నేను గ్యారంటీగా లావు అవుతాను . ఎందుకంటే అన్నం అనేసరికి ఊరగాయలు కలిపి మరో రెండు వాయలు  ఎక్కువతింటాను . అదీ భయం . పుల్కాలైతే  రెండింటి తో సరిపెట్టవచ్చు . 
                    " ఆ( .. మరీ చోద్యం కాకపోతే .. ఇప్పుడు సన్నబడి మోడలింగ్ చెయ్యాలా ఏంటీ " అంటూ దీర్ఘాలు తీస్తున్నారా ? ( అంతసీను లేదు పాపా .. ఎప్పుడో ఏజ్ బార్ అయ్యింది ) . మోడలింగ్ చెయ్యక్ఖర్లేదు గానీ , ఇంకాలావు కాకుండా ఉంటే చాలు బాబూ .. మొన్నామధ్య జలుబు చేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు , ఈసీజీ, స్కానిన్గూ ,థైరాయిడ్ ,షుగరూ ,బీపీ లాంటి టెస్టులన్నీ చేసి .. " ఎప్పటినుండి వెయిట్ పుటాన్ అయ్యారూ ..?" అని అడిగాడు . ఇది తెలుసుకోవడానికి ఇన్ని టెస్టు లెందుకు , అడిగితే నేనే చెప్పేదాన్నిగా .. అందుకే ఠక్కున " మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండీ సర్ .." అన్నా. డాక్టర్ గారు బీపీ వచ్చి పడిపోయారు పాపం. " మరే మనం పుట్టాక ముందునుండే ఓవర్ వెయిట్ !! ఏంచేస్తాం  చెప్పండి .. జీన్సు .. "
   
                         అదిగో ఆమాట అనగానే మానాన్న ఫోటోలో నుండే కోపంగా " నీ దుంప తెగ ,జీన్సూ , టీ షర్టూ  అంటూ మా వంశాన్ని బయటేస్తున్నావా  ? మాతాతయ్య లావు , నాయనమ్మ,లావు, మా నాన్న లావూ అని . మరి మీ అమ్మ పెట్టిన మీగడ పెరుగూ , వెన్నా ,ఆవకాయ ముద్దలూ ,డజన్ల కొద్దీ మింగిన వడలూ ,దోశలూ ఏమయ్యాయి ? అవితిని కాదా " అంటున్నాడు . సరే ,ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు లెండి . ఏదో ఇలా అనుభవిస్తున్నాం .
   
                          మా చిన్నప్పుడు మాఇంటికి వచ్చిన బందువొకాయన , మా అమ్మనడిగేవాడు . " ఏం పెడితే పిల్లలు ఇంత ఆరోగ్యంగా( లావుగా అనడానికి మొహమాటపడి ) అవుతారమ్మా .. మా పిల్లలు ఈసురోమన్నట్లు  ఉంటారు .." అని  . మా పెద్దన్నయ్యకి  ( చిన్నప్పుడు బాగాలావుగా,తెల్లగా , ముద్దుగా ఉండేవాడు ) వళ్ళుమండి , " పచ్చిగడ్డి , పళ్ళ తొక్కలు పెట్టండి " అన్నాడట !

                          సరే ఏదైతేనేం ..ఈరొజు ఫుల్లుగా లాగించా. ఈజీగా ఒక 2 కిలోలు పెరిగే ఉంటా . ఇది రాస్తుంటే .. (సాయంత్రం నాలుగ్గంటలు )  కళ్ళు మూతలు పడిపోతున్నాయి .  హా( ఆఆఆఆ ... ని... ద్ద ... రొ .. స్తో ... న్ది .. గుడ్ నైట్ ..   :) 
        మా నాన్న " అందుకే మరి వళ్ళు తగ్గంది .. పగటినిద్ర మానుకో " అంటూ సణుగుతున్నారు . నాన్న ఫోటో నా లాప్టాప్ స్క్రీన్ మీదే ఉంటుంది . 

************* బ్రాకెట్స్ లో ఉన్నది నా స్వగతం అని మనవి .  

                                                                                                 ఉషారాణి నూతులపాటి 
                                                                                                      ( 29/ 05/2014 )

                    








ఉషా కిరణాలు

  హాయ్  ఫ్రెండ్స్ ...
ఉషా కిరణాలు బ్లాగ్ కి  సుస్వాగతం . నేను బ్లాగ్ కి కొత్త . నా స్నేహితులందరూ బ్లాగ్ వ్రాస్తున్నారు . నాకు కూడా బ్లాగ్ వ్రాసి నా ముచ్చట్లన్నీ మీతో పంచుకోవాలని ఇలా వచ్చాను.  ఇకనుండి నేనూ మీతో ..