Wednesday 11 May 2016

💍💍💍💍 పచ్చరాయి ఉంగరం 💍💍💍💍

💍💍💍💍💍 పచ్చరాయి ఉంగరం  💍💍💍💍💍



నాకు పదేళ్ళ వయసప్పుడు జరిగిన ఒక సంఘటన ఇది. నేను ఎప్పటికీ

మరచిపోలేని అమ్మ జ్ఞాపకం. అమ్మకి పెద్దగా నగల పిచ్చి వుండేది కాదు. నాన్న పెద్ద

లాండ్ లార్డ్ అయినా.. వర్షాధార మెట్ట పంటలూ ,ఆదాయం తక్కువ ,ఖర్చులు

ఎక్కువ.బంగారం ధర తక్కువే అయినా ,స్తోమత వున్నా ,ఎందుకో సింపుల్ గానే

వుండేది అమ్మ. కానీ ఒకసారి అమ్మ ఉంగరం చేయించుకొంది...చాలా

ఇష్టంగా...పచ్చరాయి (ఎమరాల్డ్) ఉంగరం. దాని కోసం చారిని పిలిచింది.చారి

కంసలిబత్తుడు. సిరిపురం నుండి వచ్చేవాడు. అతని దగ్గర చిన్న త్రాసు

వుండేది.చిన్నఇత్తడి  దొప్పలు , ట్వైన్ దారంకట్టి చేసిన తూకం ,త్రాసు..(దాని ఎదో

పేరుతో పిలిచేవారు .గుర్తురావడం లేదు ) అందులో వస్తువులు,బంగారం

తూచడానికి ,రాగి పైసా, సత్తు పైసా, గురవిందగింజలూ..ఇలా చాలా సంజామా తో

,పెన్సిల్ బాక్స్ లాంటి ఒకపెట్టే ,కాఖీ గుడ్డ సంచిలో పెట్టుకొని వచ్చేవాడు.నాకు

ఆత్రాసుతో ఆడుకోవాలని చాలా ఇష్టం గావుండేది. కానీ అతనికి భయం ఎక్కడ

తెగిపోతుందో అని. ఒక గురవి౦ద  గింజ చేతిలోపెట్టి ," వద్దు అమ్మాయి గారూ "

అనేవాడు.. నేను తరవాత ..తరవాత డబ్బా మూతలకు చిల్లులు పెట్టి ,దారాలు కట్టి

,పైన మరో కర్రకి వేలాడా దీసి,మధ్యలో మరో దారం కట్టి (బాలన్స్ ),త్రాసు తయారు

చేసుకోనేదాన్ని. తూకం వెయ్యడానికి , రాళ్ళు ,కుండపెంకులూ గుండ్రంగా ఉండేవి

వెతుక్కొని ,ఆడుకోనేవాళ్ళం.
       

                  సరే చారి వచ్చి ,అమ్మ చెప్పినట్టు పచ్చరాయి ఉంగరం చెయ్యడానికి ,

పాత బంగారం ,ముక్కలూ ..అవీ తీసుకొని వెళ్లి , 10 రోజుల్లో చేసి తీసుకొచ్చాడు.ఆకు

పచ్చ రాయి ఉంగరం..ధగ ,ధగ మెరుస్తూ..ఎర్ర కాయితంలో..ఎంత

బావుందో..నాలుగుపలకల చిన్నరాయి.అమ్మ వేళ్ళు తెల్ల్లగా,సన్నగా ఉండేవి.పైగా

గోరింటాకు పెట్టుకొని ఇంకా అందంగా వున్నాయి అమ్మ ఆ ఉంగరం పెట్టుకొంటే

,అమ్మ ఎడమ చెయ్యి ఎంత బావుందో..నాకూ పెట్టుకోవాలని అనిపించి, “

అమ్మా..నాకు పెట్టు..అమ్మా నాకు పెట్టు ..” అని గొడవ చేస్తే , తీసి పెట్టింది.కానీ

చిన్నపిల్లని కదా ,లూజ్ గా వుండేది. “చూడు ..లూజ్ గా వుంది. పడిపోతుంది ..”

అని అమ్మ తీసేసి ,మళ్ళీ తనవేలికి పెట్టుకొనేది. నా గొడవ పడలేక ఒకరోజు

ఉంగరానికి చుట్టూ దారం చుట్టి , జారిపోకుండా ,నా వేలికి పెట్టింది. మరి నా

చెయ్యి అమ్మ చెయ్యి అంత అందంగా కనపడలేదు.ఎందుకంటే అమ్మ తెల్లని చేతికి

ఎర్రగా గోరింటాకు పండి, అందంగా వుంది. నేను పెట్టుకోలేదు. ఇంట్లోనే చెట్టు. మా

చాకలి కోసి ,రుబ్బుతుంది ఎప్పుడూ..కానీ నేను రాములును (మా జీతగాడు )

తొందరపెట్టి ,కోయించా..ఆకుకోసి , పెరట్లో వున్న పెద్ద రోట్లో రుబ్బడానికి

కూర్చున్నాడు రాములు. నేను రుబ్బుతానని కూర్చున్నా, “ వద్దు..అమ్మాయి

గారూ ,చెయ్యి నలిగి పోతుందీ ..” అని వారించినా, మనం వినం కదా.. అయితే చేతికి

పచ్చరాయి ఉంగరం వుంది. కొత్తగా మెరుస్తూ..దానికి గోరింటాకు అంటి , ఎర్రగా

అయిపోతే... అప్పుడు ఎలా..? అమ్మ తిట్టదూ ..అందుకని చేతికి గట్టిగా వున్నా,

బలవంతంగా సబ్బు పెట్టి మరీ తీసేసి ,వళ్ళో పెట్టుకొని ,రుబ్బడం మొదలు పెట్టా. కానీ సరిగ్గా

రుబ్బలేను. రాములుకి భయం,చెయ్యి నలిగితే  అమ్మ తిడుతుందని ..”చిన్నపిల్లతో

పనిచేయి౦చావా .. నువ్వేం చేస్తున్నావ్ ..” అంటే.. అదీ వాడి భయం. ఇంతలో బ్రాహ్మణవారి

అన్నమ్మ, అంజిబాబు నా ఫ్రెండ్స్. "ఆడుకుందామా "అంటూ వచ్చారు.. ఇంకేముందీ

లేచి పరుగెత్తా...
         

                             అమ్మ రాత్రి అన్నం తిన్నాక, చేతికి గోరింటాకు పెడుతూ ,చెయ్యి

చూసి “ఉంగరం ఏదే..ఉషా..” అని అడిగింది. నిద్రతో కళ్ళు మూతలు పడుతున్నాయి.

“ రేడియో మీద పెట్టానమ్మా..” అన్నాను. మా ఇంట్లో , పెద్ద హాలు , అందులో గోడకి

వేసిన పెద్ద చెక్క టేబులూ, దాని మీద పెద్ద మర్ఫీ రేడియో ఉండేవి. ఆ రేడియో మీద

అమ్మ క్రోషియా తో అల్లిన క్లాత్ వేసి వుండేది. ఆ రెడియోమీద పెన్నులూ ,

చిల్లరడబ్బులూ, నాన్న గడియారం, బుల్లెట్ మోటార్ సైకిల్ తాళాలు , పంచాంగం ,

ఇలా సర్వ వస్తు సముదాయం వుండేది. అందుకే ఏదన్నా జాగ్రత్త చేయాలంటే ,అదే

సరైన ప్లేస్. గాడ్రెజ్ బీరువా వున్నా , అది తాళం తీసి ,అందులో పెట్టే అలవాటు లేదు

ఎవ్వరికీ . అందుకే అలా అలవోకగా చెప్పేసా. అమ్మ నాకు గోరింటాకు పెట్టి ,చేతికి

గుడ్డ కట్టి , చాపవేసి దాని మీద పాత బెడ్ షీట్ వేసి (పక్క బట్టలకి గోరింటాకు

అంటకుండా..) పడుకోబెట్టింది. తెల్లారి  లేచాక , గబగబా చేతులు కడుక్కొని

చూసుకొంటే ఎర్రగా పండిన చేతులు..నాకే ముద్దొచ్చాయి.కానీ అసలు నేను

గోరింటాకు పెట్టుకోవాలని గొడవచేసి మరీ ..పెట్టుకొంది ఉంగరం కోసం కదా..అది

లేదు. నాకు అమ్మ మీద కోపం వచ్చింది. “అమ్మ ఎప్పుడూ ఇంతే..నిద్రపోగానే

ఉంగరం లాగేసుకొంటు౦ది..” అనుకొంటూ..కాళ్ళు టపటపా నేలకేసి కొడుతూ..

ఏడుస్తూ.. “ నేను నిద్రపోగానే నా (?) ఉంగరం లాగేసుకోన్నావా ..? నా ఉంగరం

నాకిచ్చేయ్ ..” అంటూ పేచీ మొదలెట్టాను. అమ్మ తెల్లబోయి.. “ నిన్న నీకే పెట్టా

కదా..దారం చుట్టి , నేను తీసుకోలేదు. అన్నట్టు నిన్న గోరింటాకు పెడుతున్నప్పుడు

,రేడియో మీద పెట్టానన్నావ్..? వెళ్లి చూడు.”.అంది కాఫీ పెడుతూ.. గబగబా అటు

పరుగెత్తా. కానీ అక్కడ లేదు. పెడితేగా ఉండటానికీ..మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్లి “

లేదమ్మా..” అన్నా.. నేను చూస్తాలే  తరవాత అన్నది. మళ్ళీ గంటకి.. “అమ్మా

ఉంగరం..” అంటూ గోల పెట్టా.. అమ్మ వచ్చి చూసింది..లేదు. అన్నీ తీసి ,

రెడియోమీద క్లాత్ దులిపి చూసింది..ఉహూ.. అప్పుడే చాకలి లచ్చి (లక్ష్మి ..కానీ

అంతా అలాగే పిలిచేవారు.) ఇల్లు వూడుస్తోంది. అమ్మ “ లచ్చీ..ఉషమ్మ ఉంగరం

టేబుల్ మీద పెట్టిందట..వూడ్చేతప్పుడు జాగ్రత్త గా చూడూ..” అంది.. ఇల్లంతా రెండు

సార్లు వూడ్చినా ఉంగరం లేదు. అమ్మకి కంగారు మొదలైంది. మళ్ళీ నన్ను దగ్గర

కూర్చోపెట్టుకొని ,మెల్లిగా .. “ ఆలోచించి చెప్పు.. ఎక్కడ పెట్టావు..? ఎప్పుడు

తీసావూ..? ఎవరింటికైనా వెళ్ళావా,,? ఎవరికైనా ఇచ్చావా ..” ఇలా పాపం చాలా

రకాలుగా అడిగింది. “సాయంత్రం స్నానం చేసేటప్పుడు తీసావా..? సబ్బు

రుద్దుకొంటు౦టే జారిపోయిందా ..” అమ్మ దిగులు పడింది.  “ చేయించి నెలన్నా

కాలేదు ... ఎవరి దిష్టి తగిలిందో..” అని .  సబ్బు మాట విన్నాక అప్పుడు

గుర్తొచ్చింది..సబ్బు పెట్టి బలవంతం గా ఉంగరం తీసిన గుర్తువచ్చింది ... అప్పుడు

చెప్పా.. “ ఆ గుర్తొచ్చింది..నిన్న గోరింటాకు రుబ్బాగా..అప్పుడు తీశా..” అన్నా..అమ్మ

ఆశ్చర్యంగా “ నువ్వు రుబ్బడం ఏంటీ..? రాములు కదా రుబ్బింది..” అని..రాములు

ని పిలిచింది. “ రాములూ, నువ్వు రుబ్బలేదా గోరింటాకు ? ఉషమ్మ గారు

రుబ్బానని అంటోంది ..” అని గట్టిగా అడిగింది. “ అమ్మాయిగారు రుబ్బుతానని శానా

గొడవ సేసినారండి..వద్దన్నా ఇనలేదు..మళ్ళీ బాపనోరి పిల్లలు రాగానే ..

ఎల్లిపోయారు..అప్పుడే లచ్చిమి వచ్చి..నేను రుబ్బుతాలే అని రుబ్బిందండి. నేను

గొడ్లకాడికి (పశువులు ) ఎల్లిపోనాను. రోటికాడికి పోలేదు.” ..మళ్ళీ కథ లచ్చి దగ్గరికి

వచ్చింది.అది “నేనే రుబ్బాను..కానీ ఉంగరం సంగతి తెల్వది , చీకట్లు పడ్డాయి ఏమీ

కాపడలేదు(కనపడలేదు )కంటికి ..దొరసానీ ..” అన్నది.. “ అప్పుడు

కనపడకపోయినా, ఉదయం వాకిలి వూడ్చింది నువ్వేకదా మళ్ళీ..నీకు కాకపొతే

ఎవరికి  దొరుకుతుంది.? నిజం చెప్పు దొరకి తెలిస్తే గొడవై పోతుంది...” అని ఎన్ని

రకాలుగా చెప్పినా అది ..నాకు దొరకలేదనే ..అన్ని వోట్లు పెట్టి ,చెప్పింది. అమ్మ విసిగి

పోయి ,ఉక్రోషం పట్టలేక ,నా చెంప పగలగొట్టి..కళ్ళనీళ్ళు పెట్టుకొని..ఊరుకుంది.

నాన్నకు తెలిస్తే మళ్ళీ గొడవ అని.
                   

                                                   అప్పటి నుండి అమ్మ మళ్ళీ ఉంగరం

పెట్టుకోలేదు. నాకు బుద్ధితెలిసాక అమ్మచేతికి ఉంగరం చూళ్ళేదు. నా పెళ్ళయి ,

ఉద్యోగం చేస్తున్నప్పుడు “అమ్మా ..నీ ఉంగరం నేనే పారేశా కదా..నీను ఉంగరం

కొంటాను. మళ్ళీ పచ్చరాయి ఉంగరం ..” అని నేనంటే..  “ ఛ..వద్దొమ్మా..నువ్వు

కొనడమేంటీ..అయినా నాకు ఉంగరం అచ్చిరాలేదు..వద్దు.”అనేది. నాకు చాలా గిల్టీగా

వుండేది. కానీ అమ్మకి ఉంగరం మాత్రం కొనలేదు.. 3 సం. క్రితం ,మావారు మా

పెళ్ళిరోజుకి ,ఉంగరం కొన్నారు. విచిత్రం గా “పచ్చరాయి” ఉంగరం..ఎమరాల్డ్..అచ్చం

అమ్మ పోగుట్టుకున్న ,ఉంగరం లాగే ఉంది. కాకపోతే సైజ్ కాస్త పెద్దగా..అమ్మ వేళ్ళు

సన్నగా ఉండేవి. మరి నా వేళ్ళు లావు.వెంటనే అమ్మ గుర్తొచ్చింది..అమ్మ ఫోటో

దగ్గర పెట్టి ,గంటసేపు ఏడ్చాను. కానీ అమ్మకి ఉంగరం మాత్రం కొనలేకపోయాననే

బాధ, నా జీవితాంతం వేధిస్తూనే వుంటుంది.అమ్మా నన్ను క్షమించవూ..

( అమ్మ ఫోటోలో నవ్వుతోంది. “పిచ్చిదానా..నీకోసం నేనే కొన్నా ఆఉంగరం ..నీకూ ఇష్టం గా మరి”..అని..)అమ్మా నాన్నలకి నమస్కారాలతో..

 కన్నీటితో అమ్మకి అంకితం.. నీ ఉష.

2 comments:

  1. Heart Touching. బంగారం పై మోజు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. అవును వనజ గారూ .. అమ్మ చాలా సింపుల్ గా వుండేది. ఎక్కువ నగలు ఎప్పుడూ ధరించేది కాదు ..పుస్తకాలు విపరీతంగా చదివేది . చేతిలో పుస్తకమే ఆభరణం...

      Delete